Kidney Cancer

కిడ్నీ క్యాన్సర్

కిడ్నీలు


కిడ్నీలు ఉదరం వెనుక భాగంలో ఉండే అవయవాలు. వెన్నెముకకు కుడి మరియు ఎడమ ప్రక్కన ఇరువైపులా రెండు మూత్రపిండాలు ఉంటాయి. మూత్రపిండాలు మూత్రాశయానికి యురేటర్స్ ద్వారా అనుసంధానించబడి ఉంటాయి, వీటితో పాటు శరీరం విసర్జన వ్యవస్థ ఏర్పడుతుంది. మూత్రపిండాలు రీనల్ ఆర్టరీ (వృక్క ధమని) ద్వారా రక్తంలోకి ప్రవేశించి రీనల్ వెయిన్ (మూత్రపిండ సిర) ద్వారా బయటకు వస్తుంది. ప్రతి మూత్రపిండాల పైభాగంలోనూ అడ్రినల్ గ్రంథి అని పిలవబడే గ్రంథి, హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది.
మూత్రపిండాలు ప్రధానంగా నిర్వర్తించే పని, తనలోకి వెళ్ళే రక్తాన్ని ఫిల్టర్ చేసి వ్యర్థ ఉత్పత్తులను తొలగించడం.
మూత్రపిండాలు శరీరంలో ద్రవాలు, లవణాల సమతుల్యతను కాపాడటానికి సహాయపడతాయి, రక్తపోటును నిర్వహించడానికి కూడా సహాయపడతాయి.

కిడ్నీ లేదా మూత్రపిండ కేన్సర్

కిడ్నీ కేన్సర్ అంటే మూత్రపిండాల కణాలలో మొదలయ్యే కేన్సర్. వివిధ రకాల మూత్రపిండ కేన్సర్లు ఉన్నాయి, అయితే 85% వరకు ఉండే సర్వసాధారణంగా వచ్చే కేన్సర్ ని మాత్రం క్లియర్ సెల్ రీనల్ సెల్ కార్సినోమా అని పిలుస్తారు. అసాధారణమైన వాటిని పాపిల్లరీ, క్రోమోఫోబ్, ఆంకోసైటిక్ లేదా కలెక్టింగ్ డక్ట్ కార్సినోమా అని అంటారు. గ్లోబోకాన్ 2018 డేటా ప్రకారం, 2018 లో 15,454 కేన్సర్లు ఉన్నాయి, మొత్తం కేన్సర్ రకాల్లో ఇది 1.3% గా ఉంది.

కిడ్నీ కేన్సర్ అనేక సంభావ్య కారణాల వల్ల సంభవిస్తుంది. కొన్ని సాధారణమైన కారణాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి. కిడ్నీ కేన్సర్ సాధారణంగా ఒక కిడ్నీని ప్రభావితం చేస్తుంది. రెండు మూత్రపిండాలకు ఒకే సమయంలో కేన్సర్ రావడం చాలా అసాధారణం.

ధూమపానం

మూత్రపిండ కేన్సర్‌కు ధూమపానం ప్రమాద కారకం. ధూమపానం చేయనివారితో పోల్చితే ధూమపానం చేసేవారిలో మూడో వంతు మూత్రపిండ కేన్సర్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది.

స్థూలకాయం

స్థూలకాయం లేదా అధిక బరువు ఉండటం వల్ల కిడ్నీ కేన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మూత్రపిండాల కేన్సర్లలో 20% స్థూల కాయానికి సంబంధించినవని అధ్యయనాలు చెబుతున్నాయి.

వయసు

వయసుతో పాటు కిడ్నీ కేన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇది సాధారణంగా 50 ఏళ్లలోపు రోగులలో చాలా అరుదుగానూ, 70 ఏళ్లు పైబడిన వారిలో చాలా సాధారణంగా కనిపిస్తుంది.

కిడ్నీ వ్యాధి

దీర్ఘకాలికంగా మూత్రపిండ వ్యాధి గలవారికి కిడ్నీ కేన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. డయాలసిస్ ఉన్నవారిలో ఈ ప్రమాదం మరింత హెచ్చుగా ఉంటుంది.

కుటుంబ చరిత్ర

కుటుంబంలో సోదరుడు, సోదరి, తల్లి లేదా తండ్రి, ఇలా సన్నిహిత బంధువుల్లో ఎవరికైనా కిడ్నీ కేన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

జన్యుపరమైన కారణాలు

సాధారణ జనాభాతో పోలిస్తే వాన్-హిప్పెల్ లిండౌ సిండ్రోమ్, ట్యూబరస్ స్క్లెరోసిస్ లేదా BHD సిండ్రోమ్ వంటి వారసత్వంగా జన్యు పరిస్థితులు ఉన్నవారికి కిడ్నీ కేన్సర్ వచ్చే ప్రమాదం హెచ్చుగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పెరిగే కేన్సర్లు చిన్న వయస్సు నుంచే పెరిగే అవకాశం ఉంటుంది, అవి మల్టిపుల్ కేన్సర్లు అయ్యే అవకాశం ఉంటుంది, ఈ సమస్య రెండు మూత్రపిండాలకీ రావచ్చు.

కిడ్నీ కేన్సర్ చిన్నగా ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలనూ ఉత్పన్నం చేయకపోవచ్చు, మరొక కారణం కోసం చేసిన పరీక్షల తర్వాత యాదృచ్ఛికంగా కనుగొనబడవచ్చు. మూత్రపిండాల కేన్సర్ వల్ల ఉత్పన్నమయ్యే లక్షణాలు ఇలా ఉంటాయి.

మూత్రంలో రక్తం

మూత్రంలో రక్తం పడడం మూత్రపిండ కేన్సర్‌కి సంబంధం ఉన్న ఒక సాధారణ లక్షణం. రక్తస్రావం కొన్నిసార్లు కావచ్చు, కొన్నిసార్లు కాకపోవచ్చు. కొన్నిసార్లు రక్తస్రావం కంటికి కనిపించకపోవచ్చు, కేవలం మైక్రోస్కోపిక్ పరీక్షలలో మాత్రమే కనుగొనబడవచ్చు.
గమనించదగ్గ విషయం ఏమిటంటే, మూత్రంలో రక్తం రావడానికి ఇన్ఫెక్షన్లు, కిడ్నీ లేదా బ్లాడర్ స్టోన్స్ వంటి అనేక ఇతర పరిస్థితుల వల్ల సంభవిస్తుంది.

నొప్పి

మూత్రపిండాల కేన్సర్ కారణంగా నడుములో (వెనుక భాగానికీ, పొత్తి కడుపై పై భాగానికీ మధ్య ప్రాంతం) కొంచెం నొప్పిగా ఉండటం ఒక లక్షణం.

జ్వరం, రాత్రి పూట చెమటలు

అలసటతో పాటు జ్వరం రావడం, రాత్రిపూట చెమట పట్టడం మూత్రపిండ కేన్సర్ లక్షణం. ఇన్ఫెక్షన్లలో కూడా ఇది ఒక సాధారణ లక్షణం.

గడ్డ లేదా మాస్

పొత్తికడుపుకి ఒక వైపున గడ్డ లేదా మాస్ లా ఉండడం కిడ్నీ కేన్సర్‌కు సంకేతం.

ఇతర లక్షణాలు

ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, కాళ్ళలో వాపు లేదా స్క్రోటమ్, రక్తహీనత, అనారోగ్యంగా ఉన్నట్టు ఫీల్ అవడం వంటి ఇతర లక్షణాలు కిడ్నీ కేన్సర్ లక్షణాలు.

కేన్సర్ నిర్ధారణపై దర్యాప్తులో భాగంగా, రోగులందరికీ డాక్టర్ పరీక్షతో పాటు కొన్ని రకాల రక్త పరీక్షలు చేయబడతాయి. సాధారణ పరీక్షల్లో కంప్లీట్ బ్లడ్ పిక్చర్, ఫుల్ బ్లడ్ కౌంట్, లేదా ఫుల్ బ్లడ్ కౌంట్, ఎలక్ట్రోలైట్స్, క్రియేటినిన్, లివర్ ఫంక్షన్ పరీక్షలు, ఇంకా నిర్దిష్ట రకానికి చెందిన కేన్సర్ ని నిర్ధారించే ఏవైనా నిర్దిష్ట రక్త పరీక్షలు ఉన్నాయి. ఇంకా చేయాల్సిన ఇతర పరీక్షల్లో ఇవి కూడా ఉంటాయి,

అల్ట్రాసౌండ్ స్కాన్

అల్ట్రాసౌండ్ స్కాన్ అసాధారణంగా ఉన్న వాటిని చూడడానికి ధ్వని తరంగాలను ఉపయోగిస్తుంది. మూత్రపిండాల కేన్సర్‌లో, అల్ట్రాసౌండ్ స్కాన్ మూత్రపిండాలలో ఉన్న గడ్డలు లేదా మాస్ లను గుర్తించడంలో సహాయపడుతుంది. అల్ట్రాసౌండ్ స్కాన్ ఆ కిడ్నీ మాస్ కేన్సర్ గడ్డా కాదా అని చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే కిడ్నీ సిస్టుల వంటి ఇతర కేన్సర్ కాని గడ్డలు ఉండడం కూడా చాలా సాధారణం. ఇతర పరీక్షలు కూడా అవసరం కావచ్చు.

CT స్కాన్

మూత్రపిండాల కేన్సర్ ఉందో లేదో నిర్ధారణ కోసం చేసే టెస్టులలో భాగంగా పొత్తికడుపు CT స్కాన్ లేదా CT ఉరోగ్రామ్ జరుగుతుంది. CT స్కాన్ అసాధారణంగా కనిపించే ప్రాంతానికి సంబంధించిన వివరణాత్మక చిత్రాలను ఇవ్వగలదు, ఇది అసాధారణ ద్రవ్యరాశి (మాస్) స్వభావాన్ని గుర్తించడంలో సహాయపడుతుంది. రోగ నిర్ధారణ చేసిన తర్వాత వ్యాధిని నిర్వహించడానికి స్కాన్ సహాయపడుతుంది. CT ఉరోగ్రామ్ అనేది ఒక ప్రత్యేక రకం CT స్కాన్, ఇది మూత్రపిండ మార్గంలోని అసాధారణతలను ప్రత్యేకంగా చూడడానికి సహాయపడుతుంది. ఇందులో మూత్రపిండాలు, యురేటర్లు, బ్లాడర్ ఉంటాయి.

సిస్టోస్కోపీ

మూత్రంలో రక్తం వస్తున్న రోగులలో, సిస్టోస్కోపీ ఈ రక్తస్రావం ఎందుకవుతోందో కారణం తెలుసుకోవడం కోసం చేసే ఒక సాధారణ పరీక్ష. సిస్టోస్కోపీలో బ్లాడర్ (మూత్రాశయం)లోకి చూడడానికి పురుషాంగం ద్వారా ఒక సన్నని గొట్టం ఉంచడం జరుగుతుంది. ఆ ట్యూబ్‌లో ఒక లైట్ సోర్సు ఉంటుంది, దానికి కెమెరా జత చేయబడి ఉంటుంది. ఇది వైద్యుడికి మూత్రాశయం లోపల చూడడానికి వీలు కల్పిస్తుంది.

MRI స్కాన్

MRI స్కాన్ శరీరం లోపలి భాగాన్ని చూడడానికి బలమైన విద్యుదయస్కాంత తరంగాలను ఉపయోగిస్తుంది. ఈ స్కాన్ కొన్నిసార్లు మూత్రపిండంలో ఉన్న మాస్ స్వభావం, పరిమాణం, వ్యాప్తిని గుర్తించడానికి ఉపయోగిస్తారు. మూత్రపిండాల కేన్సర్ కీ, యాంజియోమయోలిపోమా అనబడే నాన్ కేన్సర్ గడ్డకీ మధ్య గల తేడాని చెప్పడానికి MRI స్కాన్ ఉపయోగించబడుతుంది.

బోన్ స్కాన్

మూత్రపిండాల కేన్సర్‌ దశని నిర్ణయించడానికి ఐసోటోప్ బోన్ స్కాన్ ఉపయోగించబడుతుంది. బోన్ స్కాన్ ఎముకలలో మూత్రపిండాల కేన్సర్ ఉందా లేదా అనే విషయాన్ని గుర్తించడానికి సహాయపడుతుంది.

కిడ్నీ బయాప్సీ

బయాప్సీ అనేది ఒక పరీక్ష, ఇక్కడ కణజాలం నమూనాను సూదితో తీసుకొని, రోగ నిర్ధారణ చేయడానికి సూక్ష్మదర్శిని క్రింద చూస్తారు. మూత్రపిండాల కేన్సర్‌లో, ముఖ్యంగా అధునాతన మూత్రపిండ కేన్సర్‌లో, చికిత్స ప్రారంభించడానికి ముందు రోగ నిర్ధారణను నిర్ధారించడానికి బయాప్సీ జరుగుతుంది. ప్రారంభ మూత్రపిండ కేన్సర్‌లో, కేన్సర్‌ను తొలగించే ముందు సాధారణంగా బయాప్సీ చేయరు.

PET-CT స్కాన్

రోగనిర్ధారణ సమయంలో మూత్రపిండాల కేన్సర్‌ ఏ దశలో ఉందో నిర్ధారించడానికి PET/CT స్కాన్ ని సాధారణంగా సిఫారసు చేయడం జరగదు, ఎందుకంటే ఇది ఈ సెట్టింగ్‌లో అత్యంత ఖచ్చితమైనది కాదు.

కేన్సర్ స్టేజింగ్ అనేది, శరీరంలో కేన్సర్ ఏ పరిమాణంలో ఉన్నదీ, ఏ ప్రాంతంలో ఉన్నదీ వివరించడానికి ఉపయోగించే పదం. కేన్సర్ స్టేజిని తెలుసుకోవడం వల్ల వైద్యులు చాలా ఖచ్చితమై చికిత్సని నిర్ణయించడానికి సహాయపడుతుంది. కిడ్నీ కేన్సర్ స్టేజి నిర్ధారణ TNM స్టేజింగ్ సిస్టమ్ లేదా నంబర్ సిస్టమ్ ఆధారంగా జరుగుతుంది.
మూత్రపిండంలోని ట్యూమర్ పరిమాణం, వ్యాప్తి, మూత్రపిండాల్లో లింఫ్ నోడ్స్ (శోషరస కణుపులు) లేదా చుట్టుపక్కల ఉన్న రక్తనాళాల్లో కేన్సర్ వ్యాప్తి శరీరంలోని ఇతర భాగాలలో కేన్సర్ వ్యాప్తిపై ఆధారపడి ఉంటుంది.TNM అంటే ట్యూమర్, నోడ్, మెటాస్టేసులు. T అంటే ట్యూమర్, N అంటే నోడ్స్, మూత్రపిండాల చుట్టూ లింఫ్ నోడ్స్ లో కేన్సర్ వ్యాప్తి. M అంటే మెటాస్టేసెస్ మరియు శరీరంలోని సుదూర ప్రాంతాలకు కేన్సర్ వ్యాప్తి.

TNM స్టేజింగ్

T స్టేజి

T1 ఇక్కడ కేన్సర్ మూత్రపిండాలకు మాత్రమే పరిమితమై ఉంటుంది, ఇది పరిమాణంలో 7 సెం.మీ లేదా చిన్నది
T2 కేన్సర్ మూత్రపిండాలకు మాత్రమే పరిమితమై ఉంటుంది, ఇది పరిమాణంలో 7 సెం.మీ. కన్నా పెద్దది
T3 కేన్సర్ మూత్రపిండాలకి వెలుపల లేదా రక్త నాళాలకు విస్తరించి ఉంటుంది (రీనల్ వెయిన్ (మూత్రపిండ సిర), క్రొవ్వు, ఇన్ఫీరియర్ వెనా కావా)
T4 కేన్సర్ మూత్రపిండానికి దూరంగా ఉన్న ప్రాంతాలకు లేదా అడ్రినల్ గ్రంథికి వ్యాపిస్తుంది

N స్టేజి

N0 కేన్సర్ ద్వారా లింఫు నోడ్స్ కి ప్రమేయం లేదు
N1 కేన్సర్ చుట్టుపక్కల లింఫు నోడ్స్ కి వ్యాపించింది

M స్టేజి

M0 శరీరంలోని సుదూర భాగాలలో కేన్సర్ వ్యాప్తి లేదు
M1 శరీరంలోని సుదూర భాగాలలో కేన్సర్ వ్యాపించింది.

నెంబర్ స్టేజింగ్

స్టేజి 1 మూత్రపిండంలో కేన్సర్ పరిమాణం 7 సెం.మీ లేదా అంతకంటే చిన్నదిగా ఉంది
స్టేజి 2 కేన్సర్ మూత్రపిండంలో మాత్రమే ఉంటుంది, పరిమాణం 7 సెం.మీ కంటే పెద్దది
స్టేజి 3 కేన్సర్ మూత్రపిండాల వెలుపల సిరలు లేదా రీనల్ ఫ్యాట్ (మూత్రపిండ కొవ్వు) లేదా సమీప లింఫు నోడ్స్ లోకి వ్యాపించింది.
స్టేజి 4 కేన్సర్ మూత్రపిండాల బయటి పొరలో లేదా అడ్రినల్ గ్రంథిలోకి లేదా శరీరంలోని సుదూర భాగాలలోకి వ్యాపించింది.

మూత్రపిండ కేన్సర్ చికిత్స ఎక్కువగా రోగనిర్ధారణ చేయబడిన తర్వాత కేన్సర్ స్టేజిపై ఆధారపడి ఉంటుంది. మూత్రపిండ కేన్సర్ చికిత్సలో ఈ క్రింది ఎంపికలు ఉపయోగించబడతాయి.

సర్జరీ

మూత్రపిండ కేన్సర్ ని సర్జరీ ద్వారా తొలగించడమే సాధారణంగా ఉపయోగించే మొదటి చికిత్స. ఈ ఆపరేషన్ ని రాడికల్ నెఫ్రెక్టోమీ అని అంటారు. లింఫ్ నోడ్స్ తో పాటు మూత్రపిండాల చుట్టూ ఉన్న కేన్సర్ ని తొలగించడం, అలాగే, అడ్రినల్ గ్రంథితో సహా మూత్రపిండాల చుట్టూ ఉన్న మరేవైనా నిర్మాణాలను తొలగించడం జరుగుతుంది. ఇది ఇప్పటివరకు చేయబడుతున్న సాధారణ రకం ఆపరేషన్. మూత్రపిండాల చివర మాత్రమే ఉండి, మరెక్కడా వ్యాపించని చిన్న కిడ్నీ కేన్సర్ ఉన్న రోగులకి పాక్షిక నెఫ్రెక్టోమీ చేయవచ్చు. ఈ సర్జరీలో మూత్రపిండంలో కొంత భాగాన్ని మాత్రమే తొలగిస్తారు.

మూత్రపిండంలోనూ, దాని చుట్టుపక్కలా ఉన్న కేన్సర్‌ని పూర్తిగా బయటకు తీసినప్పుడు, తదుపరి చికిత్స అవసరం లేదు. అయినప్పటికీ, శస్త్రచికిత్స చేసేటప్పుడు అంచులలో ఎక్కడైనా కేన్సర్ ఉండిపోయిన లేదా శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించిన రోగులలో, నెఫ్రెక్టమీ తర్వాత తదుపరి చికిత్స చేయాల్సి ఉంటుందనే సలహా ఇస్తారు. నెఫ్రెక్టమీని అనేక విధాలుగా చేయవచ్చు. ఈ ఆపరేషన్ చేయడానికి సాధారణ మార్గం ఓపెన్ నెఫ్రెక్టమీ. ఈ విధానంలో నడుము మీద పెద్ద కోత పెట్టడం ద్వారా అక్కడ నుంచి కేన్సర్ తొలగించబడుతుంది. మరొక ఎంపిక లాపరోస్కోపిక్ సర్జరీ. మూడవ ఎంపిక రోబోటిక్ నెఫ్రెక్టమీ, ఇందులో రోబోట్ సహాయంతో లాపరోస్కోపిక్ సర్జరీ జరుగుతుంది. లాపరోసోకోపిక్, రోబోటిక్ సర్జరీలు అనుభవజ్ఞులైన వైద్యుల చేత చేయించుకుంటే ఓపెన్ సర్జరీ కంటే మెరుగ్గా ఉంటాయి, రోగులు వేగంగా కోలుకోగలుగుతారు. కానీ ఇవి అన్ని పరిస్థితులలోనూ సాధ్యం కాదు.

స్టేజి 4 కేన్సర్‌కు సర్జరీ

సర్జరీ ద్వారా తొలగింపు ప్రధానంగా పైన వివరించిన విధంగా మూత్రపిండాలనూ, వాటి చుట్టుప్రక్కల గల నిర్మాణాలను తొలగించడానికి పనికొస్తుంది. కానీ శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించిన మూత్రపిండాల కేన్సర్‌ను తొలగించడం అప్పుడప్పుడు జరుగుతుంది, ఎందుకంటే ఆ సర్జరీకి అన్ని మెటాస్టాటిక్ వ్యాధులను తొలగించగల సామర్థ్యం ఉండి ఉండాలి. ఉదాహరణకు, ఊపిరితిత్తులు, లివర్ లేదా మెదడులో ఒకటి లేదా రెండు భాగాలలో మాత్రమే కేన్సర్ వ్యాప్తి చెంది ఉంటే, సర్జరీతో ఆ యా భాగాల్లోని కేన్సర్ ని తొలగిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. సర్జరీతో మాత్రమే నయం చేయలేనంతగా ముదిరిన లేదా మెటాస్టాటిక్ కేన్సర్ ఉన్న రోగులకు డీబల్కింగ్ సర్జరీ జరుగుతుంది, ఇది ఈ క్రింద వివరించబడింది.

ముదిరిన లేదా మెటాస్టాటిక్ మూత్రపిండ కేన్సర్ చికిత్స

సర్జరీతో కూడా నయం చేయలేనంతగా ముదిరిన లేదా మెటాస్టాటిక్ మూత్రపిండ కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిన చాలా మంది రోగులకు సర్జరీతో పాటు బయోలాజికల్ థెరపీ లేదా ఇమ్యునోథెరపీ లేదా రెండింటి కాంబినేషన్ తోనూ చికిత్స చేస్తారు. అటువంటి చికిత్స చేయడానికి ముందు, చాలా మంది రోగులకు డీబల్కింగ్ సర్జరీ చేస్తారు. ఈ సర్జరీలో మూత్రపిండంలో ఉన్న ప్రైమరీ ట్యూమర్ లేదా కేన్సర్ తొలగించబడుతుంది ఆ తరువాత సిస్టమిక్ ట్రీట్మెంట్ ప్రారంభించబడుతుంది. వ్యాధి బాగా వ్యాపించినా లేదా రోగికి సర్జరీ చేయడానికి సాధ్యపడకపోయిన కొన్ని సందర్భాల్లో, సిస్టమిక్ ట్రీట్మెంట్ ని ముందుగా మొదలుపెట్టి, తర్వాత సర్జరీ చేస్తారు. ఈ సర్జరీ పైన వివరించిన సర్జరీకు భిన్నంగా ఉంటుంది, ఇందులో వ్యాధిని నయం చేయడం కంటే ఎక్కువగా తగ్గించడం మీదే దృష్టి పెట్టడం జరుగుతుంది.

ముదిరిన లేదా మెటాస్టాటిక్ రీనల్ కేన్సర్‌లో రిస్క్ స్ట్రాటిఫికేషన్

ముదిరిన మెటాస్టాటిక్ రీనల్ కేన్సర్ ఉన్న రోగులందరూ రోగికి గల కొన్ని లక్షణాలూ మరియు కేన్సర్ ఆధారంగా, బాగా రిస్క్, మధ్య రకం రిస్క్, అంతగా రిస్క్ లేని గ్రూపులుగా వర్గీకరించబడిన 3 గ్రూపులు ఉంటాయి. రోగి కోసం ప్లాన్ చేయబడిన సిస్టమిక్‌ ట్రీట్‌మెంట్ ఏ గ్రూపులోని రోగి కోసం చేస్తున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. చికిత్స ఎంపికలలో కేవలం బయొలాజికల్ థెరపీ, కేవలం ఇమ్యునోథెరపీ థెరపీ లేదా ముఖ్యంగా మధ్య రకం రిస్క్, అంతగా రిస్క్ లేని గ్రూపుల కాంబినేషన్ తోనూ ఉంటాయి. ఒక ఎంపికను ఎన్నుకునే ముందు, ఈ చికిత్సల వల్ల కలిగే ప్రయోజనాలూ, నష్టాల గురించి ఆంకాలజిస్ట్ చర్చిస్తారు.

బయొలాజికల్ ట్రీట్‌మెంట్

బయొలాజికల్ ట్రీట్‌మెంట్ లేదా చేయాల్సిన చికిత్స కేన్సర్ కణాలను లేదా కేన్సర్ పెరగడానికి వీలు కల్పించే యంత్రాంగాలను లక్ష్యంగా చేసుకుని నిర్దిష్ట ప్రాంతాలపై మందుల వాడకం ఆధారంగా జరుగుతుంది. కిడ్నీ కేన్సర్ చికిత్స కోసం ఈ బయొలాజికల్ మందులు ఎన్నో అందుబాటులో ఉన్నాయి.
బాగా ముదిరిన కిడ్నీ కేన్సర్ రోగులకు సర్జరీ ద్వారా తొలగించలేనప్పుడూ లేదా కేన్సర్ శరీరంలోని వివిధ భాగాలకు (మెటాస్టాటిక్) వ్యాపించినప్పుడూ బయొలాజికల్ చికిత్సను అందించడం జరుగుతుంది.
ఈ మందులు మాత్రల రూపంలో గానీ లేదా సిరలోకి గానీ ఇవ్వబడతాయి. ఇవి కేన్సర్‌ ని తగ్గించడానికీ, లక్షణాలను నియంత్రించడానికీ, ఆయుర్దాయం పొడిగించడానికీ సహాయపడతాయి. సాధారణంగా ఉపయోగించే మందుల్లో సునిటినిబ్, పాజోపనిబ్, కాబోజాంటినిబ్, సోరాఫెనిబ్, ఆక్సిటినిబ్, బెవాసిజుమాబ్, టెమ్సిరోలిమస్, ఎవెరోలిమస్ వంటి mTOR నిరోధకాలు.
ఈ విధమైన చికిత్సలకి సాధారణంగా కనిపించే దుష్ప్రభావాల్లో అలసట, విరేచనాలు, చర్మ మార్పులు, గొంతు నొప్పి, తక్కువ బ్లడ్ కౌంట్స్, ఇన్ఫెక్షన్ ప్రమాదం, కండరాల నొప్పులు, థైరాయిడ్ గ్రంథి పనితీరులో మార్పులు రక్తపోటు వంటివి ఉంటాయి. వీటితో పాటు, ప్రతి ఔషధానికి నిర్దిష్ట దుష్ప్రభావాల జాబితా ఉంటుంది.

రోగనిరోధక చికిత్స

కిడ్నీ కేన్సర్‌ నివారణకి ఉపయోగించే మందులు రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. ఈ మందులు కేన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడడానికి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. సాధారణంగా ఇంటర్ఫెరాన్ ఆల్ఫా, ఇంటర్ లుకిన్ వంటి సైటోకిన్ మందులు ఇందుకు ఉపయోగిస్తాయి. నివోలుమాబ్ వంటి చెక్ పాయింట్ ఇన్హిబిటర్స్, ఇపిలిముమాబ్ వంటి యాంటీ CTLA యాంటీబాడీ. నివోలుమాబ్, ఇపిలిముమాబ్ లేదా ఈ రెండింటి కాంబినేషన్ చికిత్సలో ఉపయోగించే మందులు. దుష్ప్రభావాల వంటి మరిన్ని వివరాల కోసం తరచుగా అడిగే ప్రశ్నలలో ఇమ్యునోథెరపీపై విభాగాన్ని చూడండి.

కెమోథెరపీ

రీనల్ కార్సినోమా (మూత్రపిండ కేన్సర్) చికిత్సకి కెమోథెరపీ బాగా నిర్ధారించబడిన విధానం కాదు.

రేడియోథెరపీ

కొన్నిసార్లు రీనల్ (కిడ్నీ) కార్సినోమా చికిత్సకి రేడియోథెరపీని ఉపయోగిస్తారు. సర్జరీ చేయబడిన సమయంలో రిసెక్షన్ చివర్లలో మార్జిన్ల వెంబట వ్యాధి ఉన్న సమయంలో ఇది ఉపయోగించబడుతుంది, ఇది ట్యూమర్ ప్రదేశంలో వ్యాధి ఉనికిని సూచిస్తుంది. శరీరంలోని వివిధ భాగాలకు వ్యాపించిన కేన్సర్ వల్ల కలిగే నొప్పి, రక్తస్రావం వంటి లక్షణాలకు చికిత్స చేయడానికి రేడియోథెరపీని కూడా ఉపయోగిస్తారు.

రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ (RFA)

రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటే కేన్సర్ ని నాశనం చేయడానికి రేడియో తరంగాల ద్వారా ఉత్పత్తి చేయబడిన వేడిని ఉపయోగించడం. రీనల్ కేన్సర్ సందర్భంలో, కేన్సర్ ని తొలగించడానికి ఆపరేషన్ చేయాల్సి వచ్చినపుడు, వైద్యపరంగా ఫిట్ గా లేని రోగుల విషయంలో, చిన్న ట్యూమర్లు ఉన్న రోగులకు చికిత్స చేయడానికి ఈ పద్ధతి ఉపయోగించబడుతుంది.
మూత్రపిండంలోని మాస్ లక్షణాలు కేన్సర్ బాగా ముదిరి ఉన్నట్టుగా సూచిస్తున్నా సర్జరీ ద్వారా తొలగించడం సాధ్యంకాని రోగులకి ఇది కూడా కొన్నిసార్లు ఉపయోగించబడుతుంది. ఊపిరితిత్తులు లేదా లివర్ వంటి చిన్న ప్రాంతాలకు వ్యాపించిన కేన్సర్లని చికిత్స చేయడానికి దీనిని ఉపయోగించవచ్చు.
ఈ ప్రక్రియలో చర్మం ద్వారా ట్యూమర్ లోకి సూది లేదా ప్రోబ్‌ను ప్రవేశపెట్టడం జరుగుతుంది. రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలు ప్రోబ్ ద్వారా ప్రసారం చేయబడతాయి, ఇది వేడిని ఉత్పన్నం చేసి ట్యూమర్ ని నాశనం చేస్తుంది. ఈ విధానం స్థానికంగా ఇచ్చే మత్తు లేదా సాధారణ మత్తుమందుతో చేయబడుతుంది.

క్రియోథెరపీ

ఇది RFA వంటి సందర్భాల్లో ఉపయోగించే చికిత్సకి మరొక రూపం. ఇక్కడ తీవ్రమైన చలిని కేన్సర్‌ను నాశనం చేయడానికి ఉపయోగిస్తారు. ట్యూమర్ లో చర్మం ద్వారా ఒక ప్రోబ్ చొప్పించబడుతుంది. చొప్పించిన ప్రోబ్ లేదా సూది ద్రవ (లిక్విడ్) నత్రజని (నైట్రోజన్)ని కలిగి ఉంటుంది, అది ట్యూమర్ని స్తంభింప (ఫ్రీజ్) చేసి, నాశనం చేస్తుంది.
మూత్రపిండాలలో చిన్న రీనల్ (మూత్రపిండ) కేన్సర్ ఉండి, సర్జరీ చేయడం సాధ్యం కాని రోగులకు ఈ రకమైన చికిత్సను ఉపయోగిస్తారు. ఈ చికిత్స కేన్సర్ ని నయం చేయగలదు, ట్యూమర్ మళ్లీ వస్తే కూడా మళ్లీ ఈ చికిత్సని ఉపయోగించవచ్చు.

ట్యూమర్ ఎంబోలైజేషన్

ట్యూమర్ ఎంబోలైజేషన్ అనేది కేన్సర్‌కు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాన్ని ఎంబోలైజ్ చేసే ప్రక్రియ (బ్లాక్ చేయబడుతుంది). ఇది రక్తం, ఆక్సిజన్ కోసం ట్యూమర్ ని ఆకలితో మాడేలా చేస్తుంది, దాంతో ట్యూమర్ కణాలు చనిపోతాయి. రక్తనాళంలోకి ఒక రసాయనాన్ని ఇంజెక్ట్ చేయడం ద్వారా ఎంబోలైజేషన్ సాధించబడుతుంది, అది ఆ నాళంలో రక్త ప్రవాహాన్ని ఆపివేస్తుంది. మూత్రపిండాల కేన్సర్‌లో, వివిధ కారణాల వల్ల సర్జరీ ద్వారా కేన్సర్ ని తొలగించడం సాధ్యం కానప్పుడు ఈ విధానం ఉపయోగించబడుతుంది. కొన్ని సందర్భాల్లో సర్జరీకు ముందు కూడా దీనిని ఉపయోగించవచ్చు, ముఖ్యంగా ట్యూమర్ పెద్దగా ఉన్నప్పుడు సర్జరీలో రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది.