బ్రెయిన్ ట్యూమర్ల

బ్రెయిన్ ట్యూమర్ల

మెదడు

మెదడు పుర్రెలో ఉండే ఒక అవయవం, ఇది నాడీ వ్యవస్థలో ప్రధాన భాగంగా రూపొందుతుంది. మెదడు సెరెబ్రం, సెరెబెల్లమ్, మిడ్ బ్రెయిన్, పోన్స్, మెడుల్లా వంటి ఇతర భాగాల్ని ఉంటుంది. మెదడు కుడి ఎడమ సెరెబ్రల్ హెమిస్పియర్స్ గా గానీ లేదా అర్థభాగాలుగా గానీ విభజించవచ్చు. మన నియంత్రణలో ఉన్న విధులు, లేని విధులతో సహా అన్ని విధుల్నీ నియంత్రించడమే మెదడు పని.

బ్రెయిన్ ట్యూమర్లు

ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్లు (మెదడు కణుతులు) మెదడులో ఏర్పడే కణితులు లేదా క్యాన్సర్లు. ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్లు మెదడులోనే మొదలవుతాయి. ఈ ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్లు నిరపాయమైనవైనా కావచ్చు లేదా ప్రాణాంతకం కావచ్చు. నిరపాయమైన కణితులు క్యాన్సర్లు కాదు, అంటే వీటికి శరీరంలోని ఇతర భాగాలకు వ్యాప్తి చెందే సామర్ధ్యం లేదు. ప్రాణాంతకమైన మెదడు కణితులు మాత్రం మెదడు లేదా శరీర ఇతర భాగాలకు వ్యాప్తి చెందే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

సెకండరీ బ్రెయిన్ ట్యూమర్లు శరీరంలోని ఇతర భాగాలలో మొదలై మెదడుకు వ్యాపించే క్యాన్సర్. ఈ విభాగంలో మనం ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్ల గురించి తెలియజేస్తున్నాం. సెకండరీ బ్రెయిన్ క్యాన్సర్లను ప్రత్యేక విభాగంలో చర్చించబడింది. ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్లు వివిధ రకాలుగా ఉంటాయి. ఈ రకాలు మెదడులోని మూలకణాల ఆధారంగా వర్గీకరించబడ్డాయి. వివిధ రకాల మెదడు కణుతులు ఈ క్రింద ఇవ్వబడ్డాయి. ఏ కణితి గురించిన వివరాలు తెలుసుకోవాలంటే దయచేసి వాటిని ఎంచుకోండి.

  • మెనింగియోమాలు
  • లో గ్రేడ్ గ్లియోమాలు
  • హై గ్రేడ్ గ్లియోమాలు
  • లింఫోమాలు
  • ఎకౌస్టిక్ న్యూరోమా
  • మెడుల్లోబ్లాస్టోమా
  • పిట్యూటరీ ట్యూమర్లు
  • పినియల్ ట్యూమర్లు
  • స్పైనల్ (వెన్నెముక) ట్యూమర్లు

ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్లు వివిధ రకాలు. ఈ రకాలు మెదడులోని మూలకణాల ఆధారంగా వర్గీకరించబడ్డాయి. వివిధ రకాల మెదడు కణితులు క్రింద ఇవ్వబడ్డాయి.

మెనింజియోమా ట్యూమర్లు

మెనింజెస్ మెదడుకి బాహ్య ఆవరణలు. ఇవి డూరా, పియా, అరాక్నోయిడ్ అని పిలవబడే మూడు వేర్వేరు పొరల్లో ఉంటాయి. డూరా అనే భాగం బాహ్య ఆవరణం, అలాగే అన్నింటికంటే లోపలి ఆవరణం అరాక్నోయిడ్ భాగం.

మెనింజియోమా అనేది మెనింజెస్ నుంచి అభివృద్ధి చెందే ట్యూమర్ (కణితి). ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్లలో ఈ రకం 25% వరకు ఉంటాయి. మెనింజియోమా ట్యూమర్లు సాధారణంగా వృద్ధుల్లోనూ, పురుషుల కంటే స్త్రీలలోనూ ఎక్కువగా కనిపిస్తుంది. సాధారణంగా ఈ మెనింజియోమా ట్యూమర్లు నిరపాయమైనవి. అయితే అవి అప్పుడప్పుడు ప్రాణాంతకమయ్యే అవకాశం ఉంది.

లో గ్రేడ్ గ్లియోమా ట్యూమర్లు

గ్లియోమాస్ అనేవి మెదడులో గ్లియల్ కణాల నుండి అభివృద్ధి చెందే కణితులు. గ్లియల్ కణాల్లో వివిధ రకాల ఉన్నాయి. ఆస్ట్రోసైట్స్ నుంచి ఆస్ట్రోసైటోమాస్, ఒలిగోడెండ్రోగ్లియల్ కణాల నుండి ఒలిగోడెండ్రోగ్లియోమాస్ అభివృద్ధి చెందుతాయి. మిశ్రమ గ్లియోమా రకం కణుతుల్లో, ఆస్ట్రోసైట్లు, ఒలిగోడెండ్రోగ్లియల్ కణాలు ఉంటాయి. ఎపిడిమల్ కణాల నుంచి ఎపిడిమొమా రకం పెరుగుతుంది. లో (తక్కువ) గ్రేడ్ గ్లియోమా రకం నెమ్మదిగా పెరిగే స్వభావం కలిగిన గ్లియోమాలు. దాని ప్రవర్తనని బట్టీ, బయాప్సీ (జీవాణుపరీక్ష) తర్వాత లేదా సూక్ష్మదర్శినిలో ఉన్న MRI స్కాన్లో కనిపించే కణితి రూపాన్ని బట్టీ దీనికి ఆ పేరు వచ్చింది. ఈ ట్యూమర్లకు గ్రేడింగ్ లెవల్స్ ఇవ్వబడతాయి. బయాప్సీ ఆధారంగా 1 మరియు 2 గ్రేడ్స్ ఇవ్వబడితే వాటిని లో గ్రేడ్ గ్లియోమాలని పిలుస్తారు.

హై గ్రేడ్ గ్లియోమా

హై గ్రేడ్ గ్లియోమాలు కూడా గ్లియల్ కణాల నుండి ఆస్ట్రోసైట్లు, ఒలిగోడెండ్రోగ్లియల్ కణాలు, ఇంకా ఎపెండైమల్ కణాలు వంటి వాటి నుండి ఉత్పన్నమవుతాయి. లో గ్రేడ్ గ్లియోమోల్లా కాకుండా వీటి ప్రవర్తన మరింత వేగంగానూ, ఉద్రిక్తంగానూ ఉంటుంది. స్కాన్లు మరియు బయాప్సీలో కనబడే లక్షణాల ఆధారంగా హై గ్రేడ్ గ్లియోమా రోగ నిర్ధారణ చేస్తారు.

ఈ కణుతులకు గ్రేడింగ్ స్థాయిలు ఇవ్వబడతాయి. హై గ్రేడ్ గ్లియోమాలకి గ్రేడ్ 3 మరియు 4 ఇవ్వబడుతుంది. గ్రేడ్ 4 గ్లియోమాను గ్లియోబ్లాస్టోమా అని పిలుస్తారు.

లింఫోమాలు

లింఫోమా అనేది శోషరస వ్యవస్థకి సంబంధించిన క్యాన్సర్. లింఫోమా రకం శరీరంలో ఏ భాగం లోనైనా సంభవించవచ్చు. మెదడులో ప్రారంభమైన లింఫోమాను ప్రైమరీ CNS లింఫోమా అని పిలుస్తారు. శరీరం యొక్క ఇతర భాగాలలో లింఫోమాలతో పోలిస్తే ఈ రకమైన లింఫోమా ప్రవర్తన మరియు చికిత్స పూర్తిగా భిన్నంగా ఉంటుంది.

ఎకౌస్టిక్ న్యూరోమా

ఎకౌస్టిక్ న్యూరోమాలు మెదడులోని ధ్వని (అకౌస్టిక్) నరాల మీద వచ్చే కణితులు. ఎకౌస్టిక్ నరాలు వినికిడితోనూ, సంతులనతోనూ ముడిపడి ఉంటాయి. ఇది నిరపాయమైన కణితి మరియు చాలా నెమ్మదిగా పెరుగుతుంది. ఈ రకాన్ని ష్వన్నోమా అని కూడా పిలుస్తారు.

మెడుల్లోబ్లాస్టోమా

ఒక మెడుల్లోబ్లాస్టోమా అనేది అతి లేతవయసులో ఉన్న శరీరం పెరుగుదలతో సంబంధం ఉన్న కణాల నుంచి అభివృద్ధి చెందే ప్రాణాంతక కణితి. ఇది చిన్న పిల్లల్లో కనిపించే ఒక సాధారణ బ్రెయిన్ ట్యూమర్. కానీ ఈ రకం కణితి పెద్దవారికి అరుదుగా వస్తుంది. దీనిని ప్రిమిటివ్ న్యూరో ఎక్టోడెర్మల్ ట్యూమర్ (PNET) అని కూడా అంటారు.

పిట్యూటరీ ట్యూమర్లు

పిట్యూటరీ గ్రంథి అనేది మెదడు దిగువ భాగంలోనూ మరియు మెదడు మధ్యలోనూ ఉంటుంది. ఇది ఉత్పత్తి చేసే హార్మోన్లలో శరీరంలో ఇతర హార్మోన్లని ఉత్పత్తి చేసే గ్రంథులపై ప్రభావాలను కలిగించే రసాయనాలు ఉంటాయి. ఈ విధంగా హార్మోన్ ఉత్పత్తి చేసే కణాల్లో ఎక్కడ నుంచైనా కణితి పెరుగుతుంది. ఈ కణుతులు స్రవించవచ్చు లేదా స్రవించకపోవచ్చు. స్రవించే కణుతుల్లో అవి ఏ కణాల నుంచి ఉత్పన్నమవుతున్నాయో, ఆ హార్మోన్లనే ఉత్పత్తి చేస్తాయి. పిట్యూటరీ కణుతులు నిరపాయకరమైనవి.

పీనియల్ ట్యూమర్లు

పీనినల్ గ్రంథి మెదడు కేంద్రంలో దిగువ భాగంలో ఉండే ఒక చిన్న గ్రంథి. దీని నుండి ఉత్పన్నమయ్యే కణుతులు టెరిటోమాల నుండి పీనియోసైటోమాలు, పీనియోబ్లాస్టోమాల దాకా వైవిధ్యభరితంగా ఉంటాయి.

వెన్నెముక కణుతులు

స్పైనల్ కెనాల్ (వెన్నెముక కాలువ) లేదా వెన్నుపూసల్లో ఈ కణుతులు వస్తాయి. ఈ కణుతులు చాలా రకాలుగా ఉంటాయి, వీటిలో గ్లయోమా కణుతులు, మెనింజోమాలు, చోర్డోమాలు, ష్వన్నో మాలు మరియు న్యూరోఫైబ్రోమాల వంటి కణుతుల రకాలు ఉంటాయి. వీటిలో కొన్ని కణుతులు నిరపాయకరమైనవి, కొన్ని ప్రాణాంతకమైనవి.

జెర్మ్ సెల్ ట్యూమర్లు

ప్రత్యుత్పత్తి వ్యవస్థ అభివృద్ధి చెందే ఆదిమ కణాల్లో ఈ కణుతులు మొదలవుతాయి.

జెర్మ్ సెల్ ట్యూమర్లు సాధారణంగా పొత్తికడుపులోనూ, ఛాతీలోనూ ఏర్పడతాయి. అయితే ఇవి కొన్నిసార్లు మెదడులో ప్రారంభం కావచ్చు. ఇవి పీనియల్ లేదా పిట్యూటరీ గ్రంథికి దగ్గరగా ఉంటాయి.

కణితి రకం మరియు దాని స్థానం ఆధారంగా మెదడు కణుతులు ఏర్పడే లక్షణాలు మారతాయి. లక్షణాలు హఠాత్తుగా ఆగవచ్చు లేదా కొన్ని వారాలు లేదా నెలల దాకా క్రమేపీ అభివృద్ధి చెందవచ్చు.

బ్రెయిన్ ట్యూమర్ (మెదడు కణితి)కి గల సాధారణ లక్షణాల్లో ఇవి ఉంటాయి

తలనొప్పి

తలనొప్పి హఠాత్తుగా ఆగవచ్చు లేదా క్రమేపీ పెరగవచ్చు. తలనొప్పి తక్కువ స్థాయిలో ఉండవచ్చు లేదా అదరడం వల్ల వికారం మరియు వాంతులకి సంబంధించిన తలనొప్పి కూడా అయి ఉండవచ్చు. తలలో ఒత్తిడి పెరగడం వల్ల ఈ లక్షణాలు కనబడతాయి. రాత్రి సమయంలోనూ, అలాగే ఉదయం నిద్రలేచే సమయంలోనూ తలనొప్పి రావచ్చు.

దృష్టి తగ్గడం

మెదడు కణుతులతో సంబంధం ఉన్న లక్షణాల్లో దృష్టి తగ్గిపోవడం లేదా ఆకస్మాత్తుగా మసకబారే లక్షణం ఒకటి. ఇది దృష్టికి సంబంధించిన మెదడు భాగాల ఒత్తిడి వల్ల దృష్టి క్రమేపీ తగ్గవచ్చు లేదా హఠాత్తుగా తగ్గవచ్చు.

మూర్ఛలు

మూర్ఛలు లేదా ఫిట్స్ అనేవి ఉన్నట్టుండి శరీరంలో ఒక చిన్న భాగంలో గానీ లేదా అన్ని అవయవాల్లోనూ ఒక్కసారిగా మొదలయ్యే అసంకల్పిత కదలికలు. వీటిలో నాలుక కొరుక్కోవడం, అదుపు లేకుండా మూత్రవిసర్జన చేయడం మరియు మూర్ఛ నుంచి లేచిన తర్వాత మగతగా ఉండడం వంటి లక్షణాలు ఉంటాయి. మెదడు కణుతులు ఉన్న రోగులకి మూర్ఛలు ఉండడం సర్వసాధారణంగా చూడవచ్చు. కణితి ఉండడం వల్ల మెదడులో కొన్ని భాగాల్లో చికాకుగా ఉంటుంది.

బలహీనత

శరీరంలో ఒక అవయవం లేదా శరీరంలో సగభాగం లేదా ముఖంలో నీరసంగా ఉన్న లక్షణాలు కనబడతాయి. దీనివల్ల మాట్లాడడం లేదా మ్రింగడం చాలా కష్టంగా ఉంటుంది. వెన్నెముకలో ఉండే కణుతుల వల్ల వెన్నెముకలో అంత కంటే క్రింది స్థాయిలో ఉన్న భాగం బలహీనపడుతుంది, ఇది సాధారణంగా కాళ్ళ బలహీనతకి దారితీస్తుంది.

ఇంట్రాక్రానియల్ ప్రెషర్ పెరగడం

మెదడు ద్రవానికి సంబంధించిన డ్రైనేజి, ముఖ్యంగా కణితి ద్వారా నిరోధించబడినపుడు మెదడులో పీడనం పెరుగుతుంది. ఈ పరిస్థితి వల్ల ఉదయానే విపరీతంగా తలనొప్పి రావడం లేదా దగ్గడం, కదలడం, వికారంగా ఉండడం, వాంతులు, పెరిగిన రక్తపోటు, గుండె కొట్టుకునే రేటు తగ్గడం, దృష్టి తగ్గడం వంటి లక్షణాలు కలుగుతాయి.

సెరెబెల్లర్ లక్షణాలు

మస్తిష్కంలో సెరిబెల్లం అని పిలవబడే మెదడు భాగంలో కణితి ఉన్నప్పుడు, సంతులనం (బ్యాలెన్స్) కోల్పోవడం, నిలకడ తగ్గడం వంటి కొన్ని నిర్దిష్ట లక్షణాలు కనిపిస్తాయి, మాట్లాడుతుంటే వణకడం, త్రేన్పులు వంటి ఇబ్బందులు కూడా ఉండవచ్చు.
ఇంకా కొన్ని రకాల ఇతర లక్షణాల్లో జ్ఞాపకశక్తి తగ్గడం, మతిమరుపు, వ్యక్తిత్వంలో మార్పు, వినికిడి లోపం, తిమ్మిర్లు మరియు స్పర్శ కోల్పోవడం, లేదా చదవడం లేదా రాయడంలో సమస్యలు ఉంటాయి. పిట్యుటరీ స్రావంతో ఉన్న కణితి అయితే, స్రవించే హార్మోన్ ఫలితాల్ని కలిగి ఉంటాయి. ఈ లక్షణాల్లో బరువు పెరుగుట, అలసిపోవడం, చర్మం మారడం, పీరియడ్స్ లో మార్పు మరియు చేతులు మరియు పాదాల పరిమాణం పెరగడం వంటి కొన్ని లక్షణాలు కూడా ఉంటాయి.
ఈ లక్షణాలు చాలా వరకు సాధారణ వ్యక్తుల్లో కనిపిస్తాయి. అవి మెదడులో కణితి ఉందని సూచించవని గమనించాలి. ఈ లక్షణాలు ఇంతకు ముందు కంటే ఎక్కువవుతూ ఉండి, ఆగకుండా ఉంటే, మీరు వైద్యుడిని చూడాల్సి ఉంటుంది.

మెదడు కణితి ఉందని అనుమానంగా కలిగినపుడు, సాధారణంగా మొదటి పరీక్షగా మెదడు స్కాన్ తీయడం జరుగుతుంది. మెదడు కణితులను గుర్తించడానికి చేసే పరీక్షలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ప్రతి సందర్భానికీ అన్ని రకాల పరీక్షలూ అవసరం ఉండవు.

CT స్కాన్ హెడ్

సాధారణంగా రోగి కణితి ఉన్నపుడు ఉండే లక్షణాలతో వచ్చినపుడు CT స్కాన్ మొదటి పరీక్షగా చేయబడుతుంది. స్కాన్ చేసే సమయంలో వెయిన్ (సిర)లోకి ఇంజెక్షన్ చేస్తే సరైన చిత్రాల్ని పొందవచ్చు. కొన్ని సందర్భాల్లో మినహాయిస్తే సాధారణంగా MRI స్కాన్ కంటే CT స్కాన్ ద్వారా జరిగే మెదడు కణుతుల నిర్ధారణ, మూల్యాంకనం తక్కువగా ఉంటుంది.

MRI స్కాన్

మెదడు మరియు/లేదా వెన్నెముకకి CT స్కాన్ తర్వాత అవసరమైనప్పుడు MRI స్కాన్ చేయబడుతుంది. కొన్నిసార్లు, ఒక MRI స్కాన్, CT స్కాన్ కంటే ముందు చేయవచ్చు. స్కాన్ సమయంలో సిరలోకి ఒక కాంట్రాస్ట్ ఏజెంట్ (విరుద్ధంగా పని చేసే పదార్థాన్ని) ని ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది, ఇలా చేస్తే ఇమేజి (చిత్రాలు) బాగా వస్తాయి. MRI స్కాన్ లో బ్రెయిన్ ట్యూమర్ దాదాపుగా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రత్యేకమైన MRI స్కాన్లు DWI (డిఫ్యూజన్ వెయిటెడ్ ఇమేజింగ్), DTI (డిఫ్యూజ్ టెన్సర్ ఇమేజింగ్), MRA (మాగ్నెటిక్ రెజొనెన్స్ ఆంజియోగ్రఫీ), MRS (మాగ్నెటిక్ రెజొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ) వంటి చిత్రాల (ఇమేజెస్) ద్వారా మరింత సమాచారం పొందడానికి ఉపయోగించవచ్చు.

బయాప్సీ

సమస్యాత్మకంగా కనిపించే కణజాలం నుంచి సూక్ష్మమైన నమూనాను సూక్ష్మదర్శిని క్రింద చూడడాన్ని బయాప్సీ అంటారు. ఒక మెదడు కణితిని స్కాన్ లో గుర్తించిన తర్వాత రోగనిర్ధారణ చేయడానికి బ్రయిన్ బయాప్సీ (జీవాణుపరీక్ష) చేస్తారు. ఈ ప్రక్రియను న్యూరోసర్జన్ చేస్తారు. బయాప్సీ కణితి ఉన్నట్టు చూపిస్తే న్యూరోసర్జన్ అప్పుడే కణితిని తొలగించవచ్చు.

CSF విశ్లేషణ (ఎనాలిసిస్)

CSF లేదా సెరెబ్రోస్పైనల్ ద్రవం అనేది మెదడు కేంద్ర భాగంలో జఠరికలు (వెంట్రికల్స్) అని పిలవబడే భాగం గుండా ప్రవహించే పల్చని ద్రవం. ఈ జఠరికల ద్వారా ఈ ద్రవం ప్రవహిస్తుంది. వెన్నెముకలో వెన్నుపాము చుట్టూ ఉన్న CSF తో ఇది అనుసంధానించబడుతుంది. కొన్ని రకాల మెదడు కణుతులు వచ్చినపుడు, ఆ ద్రవంలో క్యాన్సర్ కణాల ఉనికిని మినహాయించడానికి CSF విశ్లేషణ చేయడం అవసరం.

మైలోగ్రామ్

ఇది ఒక సెట్టింగ్ లో MRI సాధ్యం కానప్పుడు వెన్నెముక ఇమేజ్ తీయడానికి ఉపయోగించే పరీక్ష. వెన్నెముక చుట్టూ ఉన్న ప్రదేశంలోకి ముందుగా ఒక డై ఇంజెక్ట్ చేయబడుతుంది, ఆ తర్వాత ఎక్స్-రే తీసుకోవడం జరుగుతుంది.

ఆంజియోగ్రామ్

రక్తనాళాల్ని చూడడానికి ఆంజియోగ్రామ్ పరీక్ష చేయబడుతుంది. ఒక సెరిబ్రల్ ఆంజియోగ్రామ్ చేయడం వల్ల, అది దాంతో మెదడులో కణితి సంబంధించిన రక్తనాళాల్ని చూడడానికి సహాయపడుతుంది. ఈ రోజుల్లో MRI తో బాగా అందుబాటులోకి వచ్చింది కాబట్టి, ఈ పరీక్ష అంత ఎక్కువగా ఉపయోగించబడట్లేదు.

PET-CT స్కాన్

మెదడు కణుతులు ఉన్నాయో లేదో నిర్ధారించడానికి PET స్కాన్ సాధారణంగా ఉపయోగించబడదు. మళ్లీ వస్తుందేమోనని అనుమానం ఉన్నప్పుడు కణితి మరియు మచ్చ కణజాలం మధ్య తేడాను గుర్తించడం ద్వారా ఈ పరీక్ష నిర్వహించబడుతుంది. ఇది స్కాన్ లో లో గ్రేడ్, హై గ్రేడ్ గ్లియోమాల మధ్య తేడాని కనుక్కోవడానికి కూడా ఉపయోగించవచ్చు.

ఎకౌస్టిక్ న్యూరోమా అంటే ఏమిటి?

ఎకౌస్టిక్ న్యూరోమా లేదా వెస్టిబ్యులర్ ష్వన్నోమా అనేది మెదడులోని 8 వ కపాలపు నరానికి సంబంధించిన రక్షిత కవచాన్ని తయారు చేసే ష్వన్ కణాల్లో ఉత్పన్నమయ్యే ఒక నిరపాయమైన కణితి. అవి 6-8% మెదడు కణితులకు కారణమవుతాయి. న్యూరోఫైబ్రోమాటోసిస్ టైప్ 2 అనబడే జన్యు స్థితిలో రోగుల్లో ఇది మరింత ఎక్కువగా కనిపిస్తుంది.

లక్షణాలు

అకౌస్టిక్ (ధ్వనికి సంబంధించిన) న్యూరోమా లక్షణాల్లో సాధారణంగా వినికిడి నష్టం లేదా చెవుడు (టిన్నిటస్) ఉంటుంది. ఈ లక్షణాలు సాధారణంగా ఒక వైపు ఉంటాయి, ఒక్కోసారి రెండు వైపులా కూడా ఉండవచ్చు. మరి కొన్ని ఇతర లక్షణాల్లో అడుగులు స్థిరంగా పడకపోవడం, ముఖం మొద్దుబారడం, అరుదుగా ముఖం బలహీనంగా ఉండడం ఉంటాయి.

ఇన్వెస్టిగేషన్ (లోతైన పరిశీలన)

అకౌస్టిక్ న్యూరోమా ఉందని అనుమానం వస్తే ఆ విషయాన్ని పరిశీలించడానికి మెదడుని MRI స్కాన్ చేయాలి. MRI సాధ్యం కాకపోతే, CT స్కాన్ చేయబడుతుంది. వినికిడి పనితీరుని అంచనా వేయడానికి ఆడియోమెట్రీ పరీక్షల వంటి ఇతర ఇన్వెస్టిగేషన్లు చేస్తారు.

చికిత్స

అకౌస్టిక్ న్యూరోమాకి శస్త్ర చికిత్స, రేడియోథెరపీ లేదా అబ్జర్వేషన్ అనే మూడు రకాల చికిత్స ఎంపికలు ఉన్నాయి.

కణితి చిన్నదిగా ఉన్నప్పుడు, అందులోనూ ముఖ్యంగా వృద్ధ రోగులలో ఏ లక్షణాలనూ కలిగించనిదైతే అబ్జర్వేషన్ (పరిశీలన) అనే ఎంపికకి వెళ్లవచ్చు, కణితి పరిమాణం పెరుగుతూ, లక్షణాలు కనబడడం మొదలైతే చికిత్స చేయవచ్చు.

శస్త్రచికిత్స లేదా రేడియోథెరపీ కణితిని అదుపు చేసేందుకు సమానమైన అవకాశాల్ని అందిస్తాయి. ఏ ఎంపిక ఎంచుకోవడమా అనేది క్యాన్సర్ సెంటర్ లో అందుబాటులో ఉన్న నిపుణుల మీదా, రోగి యొక్క ఎంపిక మీదా ఆధారపడి ఉంటుంది.

శస్త్రచికిత్స పూర్తయినప్పుడు, కణితిని పూర్తిగా తొలగించడమే లక్ష్యంగా పెట్టుకుని ఆ పని పూర్తిచేస్తారు.

రేడియో థెరపీ (ధార్మిక చికిత్స) ఉపయోగించినప్పుడు, స్టీరియోటాక్టిక్ రేడియోసర్జరీ, ఫ్రాక్షనేటెడ్ స్టీరియోటాక్టిక్ రేడియోథెరపీ లేదా స్టాండర్డ్ రేడియోథెరపీ అనే అన్ని ఎంపికలనూ ఉపయోగించడం జరుగుతుంది. వినపడకపోవడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ శస్త్రచికిత్సకీ, రేడియోథెరపీకీ కూడా ఉండే అవకాశం ఉంది. క్లుప్తంగా చెప్పాలంటే, ఈ రెండు చికిత్సల్లో ఏది ఎంచుకున్నా మంచిదే.

పిట్యూటరీ గ్రంథి

మెదడు దిగువ భాగంలో ఉండే పిట్యుటరీ గ్రంథి ఒక చిన్న గ్రంథి. గ్రంథి ముందు భాగం, వెనుక భాగం అని రెండు భాగాలుగా విభజించవచ్చు. శరీరంలో చాలా కీలకమైన పనితీరు కలిగిన అనేక హార్మోన్లను ఈ గ్రంథి ఉత్పత్తి చేస్తుంది. హార్మోన్లు ఒకే చోట ఉత్పత్తి చేయబడే రసాయనిక పదార్ధాలు. ఇవి శరీరంలోని ఇతర భాగాలలో ప్రభావాన్ని కలిగించడానికి రక్తప్రవాహంలో రవాణా చేయబడతాయి.

పిట్యుటరీతో సహా అనేక హార్మోన్లు ఉత్పత్తి చేయబడతాయి.

  • థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్
  • ఫోలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్
  • ల్యూటినైజింగ్ హార్మోన్
  • గ్రోత్ (పెరుగుదల) హార్మోన్
  • అడ్రెనోకార్టికోట్రోపిక్ హార్మోన్
  • ప్రోలాక్టిన్
  • మెలనోసైట్ హార్మోన్ స్టిమ్యులేటింగ్
  • ఆక్సిటోసిన్
  • యాంటిడియురెటిక్ హార్మోన్

పిట్యూటరీ ట్యూమర్ (కణితి)

ఈ కణితి లేదా గడ్డ పిట్యూటరీ గ్రంథిలో మొదలవుతుంది. ఈ పిత్తాశయ కణితి (పిట్యూటరీ ట్యూమర్) స్రవించే కణితి కావచ్చు, అది ఈ హార్మోన్లలో ఏదో ఒకదాన్ని స్రవించవచ్చు లేదా స్రవించని కణితి ఈ హార్మోన్లలో దేన్నీ స్రవించదు. ఎక్కువ పిట్యూటరీ కణితులు నిరపాయమైన కణితులు.

లక్షణాలు

పిట్యూటరీ కణుతులు మెదడు చుట్టూ నిర్మాణాలపై స్థానిక ప్రభావం కలిగి ఉండడం వల్ల ఆ లక్షణాలను ఉత్పత్తి చేయగలవు. అందువల్ల గానీ లేదా కణుతులచే ఉత్పత్తి చేయబడిన అదనపు హార్మోన్ల అసాధారణ ప్రభావాల కారణంగా గానీ తలనొప్పి వస్తుంది. హార్మోన్లు ఈ ప్రభావాల్ని బాగా ఉత్పత్తి చేయగలవు.

ఉదాహరణకు, బిడ్డలో హార్మోన్లు అధికంగా ఉత్పత్తి కావడంతో ఎత్తు బాగా పెరగడానికి దారితీస్తుంది. అలాగే పెద్దవాళ్లలో ఎముకలు, కండరాలు, ఇతర భాగాల విస్తరణకు దారితీస్తుంది. డయాబెటీస్ వస్తుంది, చెమట పట్టడం ఎక్కువవుతుంది.

గర్భం ధరించకపోతే లేదా మగ రోగిలో వక్షోజాలు విస్తరించడం, లైంగిక సమస్యలు వచ్చినపుడు ప్రోలాక్టిన్ వంటి హార్మోన్లు పాలు ఉత్పత్తి చేయగలవు.

థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఉత్పత్తి పెరిగినట్లయితే, రక్తంలో అధికంగా థైరాక్సిన్ చేరుతుంది.

ACTH హార్మోన్ అధిక ఉత్పత్తి వల్ల అధిక రక్తపోటు, బరువు పెరగడం, చర్మంపై మార్పులు రావడం, ముఖం గుండ్రంగా అవడం, భావోద్వేగాలు (మూడ్స్) త్వరగా మారుతుండడం, బ్లడ్ షుగర్ ఎక్కువడ కావడం జరుగుతుంది.

నిద్రకి ఇబ్బంది కలగడం, విపరీతమైన దాహం, ఎక్కువ పరిమాణంలో మూత్ర విసర్జన వంటి ఇతర దుష్ప్రభావాలు ఉంటాయి. FSH మరియు LH హార్మోన్ల ఉత్పత్తిలో పెరుగుదల ఉన్నప్పుడు మహిళలకు శరీరంపై ఎక్కువగా వెంట్రుకలు రావడం, లేదా నెలసరి ఆగిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

పైకి కనిపించే లక్షణాలు

పిట్యూటరీ గ్రంథి విజువల్ పాత్ వే (చూపు మార్గం)లో ముఖ్యమైన భాగమైన ఆప్టిక్ చియాసంకి చాలా దగ్గరగా ఉంటుంది. అక్కడ కణితి వస్తే ఆప్టిక్ చియాజం కుదించుకుపోతుంది. దానివల్ల కంటి చూపు తగ్గుతుంది లేదా మసకబారడం, ఒకటికి రెండు రూపాలు కనిపించడం జరుగుతుంది.

పిట్యూటరీ ట్యూమర్లపై పరిశోధనలు

పిట్యూటరీ కణితిగా అనుమానించినపుడు, మెదడుకి CT స్కాన్ లేదా MRI స్కాన్ వంటి సాధారణ పరిశోధనలు చేస్తారు. ఒక కణితి స్రవిస్తున్నట్టుగా అనుమానం ఉంటే, రక్తంలో హార్మోన్ల స్థాయిని కొలిచి, హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయేమో చూస్తారు.

పిట్యూటరీ ట్యూమర్ల చికిత్స

ఈ రకం కణుతుల చికిత్స ఆ కణితి రకాన్ని బట్టి ఉంటుంది. కొన్ని హార్మోన్ స్రవిస్తూ ఉండే కణుతుల్ని హార్మోన్ ఉత్పత్తిని నియంత్రించే ఔషధాలతో చికిత్స చేయవచ్చు.

సర్జరీ

చికిత్సలో ఉపయోగించే ఒక సాధారణమైన ఎంపిక శస్త్రచికిత్స ద్వారా పిట్యూటరీ కణితిని తొలగించడమే. ఇది తరచూ స్రవించని కణితుల చికిత్స కోసం ఉపయోగించే మొట్టమొదటి చికిత్స. రెండు రకాల శస్త్రచికిత్సలు ఉన్నాయి. ఒకటి, ట్రాన్స్-ఫ్రంటల్ విధానం, రెండవది ట్రాన్స్-స్పెనోయిడల్ శస్త్రచికిత్స. సర్వ సాధారణంగా ఈ రెండవదే జరుగుతుంటుంది. మామూలుగా అయితే ఎండోస్కోపిక్ శస్త్రచికిత్స జరుగుతుంది. అంటే ముక్కులోంచి ఒక గొట్టం (ఎండోస్కోప్) పిట్యుటరీ గ్రంథికి చేరేలా వేస్తారు. ముందు కొంత చికిత్స జరిగిన తర్వాత కణితి మళ్లీ వస్తే శస్త్రచికిత్స కూడా చేస్తారు. మరీ విపరీతంగా పెరిగిన కణుతుల విషయంలో అయితే, ఆ కణితిని తొలగించడానికి క్రానియోటమీ (పుర్రె తెరవడం) అవసరమవుతుంది.

రేడియోథెరపీ

పిట్యూటరీ కణుతుల చికిత్సకు మరొక ఎంపిక రేడియోథెరపీ. శస్త్రచికిత్సలో కణితి అసంపూర్ణంగా తొలగించినా, సర్జరీ జరిగిన తర్వాత కణుతులు ఇంకా ఉన్నా, రేడియోథెరపీ అనేది సాధారణంగా తీసుకునే ఒక ఎంపిక. స్టీరియోటాక్టిక్ రేడియోసర్జరీ, స్టీరియోటాక్టిక్ రేడియోథెరపీ లేదా స్టాండర్డ్ రేడియోథెరపీ వంటి రేడియోథెరపీలోని వివిధ రీతుల్ని ఈ సెట్టింగ్ లో ఉపయోగించవచ్చు. ప్రామాణిక రేడియోథెరపీ కోర్సు సుమారు 5 వారాలపాటు ఉంటుంది. కొన్ని పిట్యూటరీ కణుతుల విషయంలో రేడియోధార్మికత ప్రయోజనం కనబడడానికి కొంత సమయం పడుతుంది. గామా నైఫ్, లీనియర్ యాక్సిలరేటర్ బేస్డ్ (ఆధారంగా) లేదా ప్రోటాన్ థెరపీలు ఉపయోగించదగిన రేడియోధార్మిక రకాలు.

మెడికల్ మేనేజ్మెంట్

కొన్ని పిట్యూటరీ కణుతుల్ని మాత్రలు లేదా ఇంజెక్షన్ల రూపంలో మందుల సహాయంతో నిర్వహించబడతాయి.
ప్రొలాక్టిన్ ఉత్పత్తి చేసే ప్రోలాక్టినోమా అనే ట్యూమర్ ఉన్న రోగులు బ్రోమోక్రిప్టైన్ లేదా కేబర్గోలిన్ వంటి మందుల్ని ఉపయోగించవచ్చు. ఈ మందు ఈ కణితి ద్వారా ఉత్పత్తి చేయబడిన లక్షణాలను నియంత్రించటానికి సహాయపడుతుంది.
అక్రోమెగలీ ఉన్న రోగులకు పెరుగుదల హార్మోన్ మరింత అధికంగా ఉత్పత్తి అవుతుంది, సర్జరీ లేదా రేడియేషన్ కు అదనంగా సోమాటోస్టాటిన్, అనలాగ్స్ వంటి మందుల్ని ఉపయోగించవచ్చు.
ACTH ను ఉత్పత్తి చేసే కణితులకు, కేబర్గోలిన్ వంటి మందుల్ని కణితి ప్రభావాలను నియంత్రించడానికి ఉపయోగిస్తారు.

పిట్యూటరీ కణితి చికిత్స సైడ్ ఎఫెక్ట్స్

పిట్యూటరీ కణుతులకి సర్జరీ చేయడం గానీ లేదా రేడియేషన్ ఇవ్వడం గానీ చేస్తే దానికి హైపోపిటిట్యూటిజం అనే ఒక ప్రధానమైన సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. అంటే, ఈ చికిత్సల తర్వాత సాధారణ పీయూష గ్రంథి ఉత్పత్తి చేసే హార్మోన్ల కంటే తక్కువ స్థాయిలో ఉత్పత్తి అవుతాయని దీని అర్థం. అందువల్ల, ఈ హార్మోన్ల స్థాయిల్ని చెక్ చేయడానికి చికిత్స తర్వాత డాక్టర్ ని తరచూ కలుసుకోవడం ముఖ్యం.
ఇతర సంభావ్య దుష్ప్రభావాల్లో తలనొప్పి, ముఖ్యంగా విపరీతమైన దాహం, ముఖ్యంగా శస్త్రచికిత్స తరువాత ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయడం (సాధారణంగా పరిస్థితి సెటిల్ అవుతుంది), CSF లీక్, అలసట, జుట్టు ఊడిపోవడం, వికారం, ఇంకా కంటికి కనిపించే మార్పులు ఉంటాయి.

మెనింజియోమా అంటే ఏమిటి

మెనింజెస్ మెదడుకి బాహ్య ఆవరణలు. మెనింజెస్ డూరా, పియా, అరాక్నోయిడ్ అని పిలవబడే మూడు వేర్వేరు పొరల్లో ఉంటాయి. డూరా అనే భాగం బాహ్య ఆవరణం, అలాగే అన్నింటికంటే లోపలి ఆవరణం అరాక్నోయిడ్ భాగం.

మెనింజియోమా అనేది మెనింజెస్ నుంచి అభివృద్ధి చెందే ట్యూమర్ (కణితి). ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్లలో ఈ రకం 25% వరకు ఉంటాయి. మెనింజియోమా ట్యూమర్లు సాధారణంగా వృద్ధుల్లోనూ, పురుషుల కంటే స్త్రీలలోనూ ఎక్కువగా కనిపిస్తుంది. సాధారణంగా ఈ మెనింజియోమా ట్యూమర్లు నిరపాయమైనవి. అయితే అవి అప్పుడప్పుడు ప్రాణాంతకమయ్యే అవకాశం ఉంది.

మెనింజియోమా ట్యూమర్ల గ్రేడింగ్

సూక్ష్మదర్శిని క్రింద ఒక నమూనాని పరిశీలించిన తర్వాత మెనింజియోమా గ్రేడ్ ఇవ్వబడుతుంది. ఈ గ్రేడ్ 1-3 ల వరకు ఉంటుంది. గ్రేడ్ 1 మెనింజియోమా నిరపాయమైనది, తక్కువ ఉద్రిక్త స్వభావం కలిగినదై ఉంటుంది. గ్రేడ్ 3 ప్రవర్తన బాగా దూకుడుగా ఉంటుంది. గ్రేడ్ ని గుర్తించిన తర్వాత చేయవలసిన చికిత్స ఎంపికలు కొంచెం భిన్నంగా ఉంటాయి.

మెనింజియోమా ట్యూమర్ల లక్షణాలు

మెనిన్గియోమా ట్యూమర్లు వాటి ప్రారంభ దశల్లో ఎలాంటి లక్షణాల్నీ చూపకుండానే పెరుగుతాయి. కొన్ని మెనింజియోలు అనేక సంవత్సరాల పాటు పెరుగుతాయి. వాటి లక్షణాల్ని కనబరిచినపుడు, అవి ఇతర మెదడు కణితి లక్షణాలను పోలి ఉంటాయి. మరింత సమాచారం కోసం మెదడు కణుతుల లక్షణాలపై విభాగాన్ని చూడండి.

మెనింజియోమా ట్యూమర్ల చికిత్స

పరిశీలన

ఇది చికిత్స చేయబడని ఎంపిక, రోగిని కొంత కాలవ్యవధిలో పర్యవేక్షిస్తారు. ఇది అనేక సంవత్సరాల పాటు చేయవచ్చు. వరస పెట్టి స్కాన్స్ చేసినపుడు పరిమాణం పెరిగినట్టుగా గానీ లేదా రోగిలో అలాంటి లక్షణాలు గుర్తించినపుడు గానీ చికిత్స ప్రతిపాదించబడుతుంది. ఏ లక్షణాలను ఉత్పత్తి చేయని చిన్న కణుతులున్న రోగుల నిర్వహణ కోసం ఈ ఎంపిక ఉపయోగపడుతుంది.

శస్త్రచికిత్సతో తొలగింపు

పెద్ద ట్యూమర్ ఉన్న రోగులు లేదా ట్యూమర్ లక్షణాలున్న రోగులకి మెనింజియోమాని శస్త్రచికిత్స ద్వారా తొలగించే చికిత్స ఎంపిక. ఇది క్రానియోటమీతో చేయబడుతుంది, మొత్తం కణితిని తొలగించడం జరుగుతుంది. శస్త్రచికిత్స సాధారణ అనస్థీషియా ఇచ్చి చేస్తారు.

రేడియోథెరపీ

రేడియోధార్మిక చికిత్స అనేది 2 మరియు 3 గ్రేడ్ మెనింజియోమా రోగులలో పాక్షికంగా లేదా పూర్తిగా తొలగించబడిన తర్వాత ఎంచుకునే ప్రత్యామ్నాయ చికిత్స. రేడియేషన్ మెనింజియోమా తొలగించబడిన మళ్లీ వచ్చిన రోగులకు కూడా ఇవ్వబడుతుంది. ఈ రోగులలో, సర్జరీ చేసిన తర్వాత వెంటనే రేడియేషన్ ఇవ్వబడుతుంది. శస్త్రచికిత్స చేయించుకోవడానికి వీలైన పరిస్థితి లేని రోగులకూ, లేదా ఇతర కారణాల వలన శస్త్రచికిత్స సాధ్యపడని సందర్భాల్లో కూడా శస్త్రచికిత్సకు బదులుగా చికిత్సను రేడియేషన్ ని ఉపయోగించవచ్చు మెనింజియోమా రోగులకి ఇచ్చే రేడియోథెరపీ గురించి మరిన్ని వివరాల కొరకు, మెదడు కణుతులకు రేడియోథెరపీ విభాగాన్ని చూడండి.

శస్త్రచికిత్స (సర్జరీ)

శస్త్రచికిత్స మెదడు కణుతుల చికిత్సలో ఒక ముఖ్యమైన భాగంగా ఉంది. మెదడు కణితి శస్త్రచికిత్స న్యూరోసర్జన్స్ చేత చేయబడుతుంది. కణితి ఏ రకానికి చెందిందో దాన్ని బట్టీ, మెదడులోని అది ఉన్న స్థానం, అలాగే రోగి సాధారణ పరిస్థితిపై ఏ రకమైన శస్త్రచికిత్స చేయాలనేది ఆధారపడి ఉంటుంది. శస్త్రచికిత్స అనేది కణితిని తొలగించే చోట పూర్తిగా తొలగించబడుతుంది (కంప్లీట్ రిసెక్షన్) రూపంలో ఉంటుంది. కణితిలో ఒక భాగం మాత్రమే తొలగించవలసి ఉన్నపుడు ఇది పాక్షిక విచ్ఛేదన రూపంలో ఉంటుంది. కణితిలో చిన్న నమూనా మాత్రమే తొలగించబడుతున్నపుడు అది బయాప్సీ రూపంలో ఉంటుంది. ఈ శస్త్రచికిత్సలు సాధారణంగా మత్తు ఇచ్చి చేస్తారు.

శస్త్రచికిత్స ఈ క్రింది విధానాలలో చేయవచ్చు.

క్రానియోటోమీ

క్రానియోటమీ అనేది కణితిని చేరుకోవడానికి పుర్రె భాగాన్ని తొలగించే ఒక విధమైన ప్రక్రియ. మెదడు సాధారణ భాగం దెబ్బతినకుండా వీలైనంత ఎక్కువగా కణితిని ఆపరేట్ చేసి తొలగించబడుతుంది. కొన్నిసార్లు ఆపరేషన్ ప్రాంతాన్ని చాలా స్పష్టంగా చూడడానికి సూక్ష్మదర్శని (మైక్రోస్కోప్) ని ఉపయోగిస్తారు. కొన్ని సందర్భాల్లో, పేషెంట్ మేల్కొని ఉండగా క్రానియోటమీ చేయబడుతుంది.అంటే రోగి శస్త్రచికిత్స సమయంలో మేల్కొని ఉంటాడు. మాట్లాడే పద్ధతిని లేదా స్పర్శ వంటి ముఖ్యమైన పనితీరుల్ని నియంత్రించే మెదడులోని ఒక భాగంలో పనిచేస్తున్నప్పుడు ఈ ప్రక్రియను ఉపయోగిస్తారు. శరీరంలోని విధులు నిర్వహించడానికి సంబంధించిన ప్రాంతాల్ని గుర్తించడం సహాయపడే కార్టికల్ స్టిమ్యులేషన్ సహాయంతో బ్రెయిన్ మ్యాపింగ్ చేయబడుతుంది. ఇలా చేయడం వల్ల న్యూరోసర్జన్ వీలైనంత వరకు కీలకమైన విధులకు సంబంధించిన మెదడు భాగాలపై ఆపరేట్ చేయకుండా ఉండడానికి వీలవుతుంది. పైన పేర్కొన్న విధంగా క్రానియోటమీతో స్పీచ్ మ్యాపింగ్ వంటి ఇతర మ్యాపింగ్ టెక్నిక్స్ ని ఉపయోగిస్తారు. శస్త్రచికిత్స పురోగతిని అంచనా వేయడానికి సీరియల్ స్కాన్స్ సహాయంతో CT లేదా MRI గైడెడ్ సర్జరీ చేయవచ్చు. కణితిని తొలగించిన తరువాత, పుర్రె ఎముకని యథాస్థానంలో తిరిగి అమర్చబడుతుంది.

కొన్ని రకాల కణుతులలో, మెదడులో ఉన్న ద్రవ ప్రవాహం ఆటంకపరచబడుతుంది. ఆపరేషన్ సమయంలో, సర్జన్ ఒక గొట్టాన్ని ఉంచుతారు, ఈ ద్రవం అందులోకి ప్రవహిస్తుంది. మెదడుని పొత్తికడుపుతో కలిపే షంట్ ని వెంటిక్యులో-పెరిటోనియల్ (VP) షంట్ అని పిలుస్తారు. ఒక ఓమ్మాయా రిజర్వాయర్ అనే ట్యూబ్ శాశ్వతంగా మెదడులో ఉంచబడుతుంది, ఇది చర్మంతో సంబంధం కలిగి ఉంటుంది, కొంతమంది రోగులలో అప్పుడప్పుడూ ద్రవాన్ని తొలగించడానికి దీన్ని ఉపయోగిస్తారు.

మైక్రోసర్జరీ

కొన్ని మెదడు కణుతులలో, పుర్రెలో ఒక చిన్న కీహోల్ తయారు చేసి రంధ్రం ద్వారా దానిలో ఒక సన్నని గొట్టం ఉంచుతారు. ఈ ట్యూబ్ ని న్యూరో ఎండోస్కోప్ అని పిలుస్తారు. ఇది మెదడు లోపలి భాగాల్ని చాలా స్పష్టంగా, పెద్దఆకారంలో చూడడానికి వీలు కల్పిస్తుంది. సర్జన్ దీనిలోంచి చూస్తూ చాలా ఖచ్చితత్వంతోనూ, ఒక చిన్న కోతతోనూ ఆపరేషన్ చేయడానికి వీలు కల్పిస్తుంది. న్యూరో సర్జన్ సూక్ష్మదర్శిని చివరిలో ఉన్న పరికరాల సహాయంతో కణితిని కత్తిరించి తొలగించగలరే.

బయాప్సీ

పైన చర్చించినట్లుగా బయాప్సీ అనేది కొన్ని సందర్భాల్లో చేసే సర్జికల్ ఆపరేషన్ మాత్రమే. బయాప్సీ ఓపెన్ బయాప్సీ కావచ్చు. ఎముకలోని ఒక చిన్న భాగాన్ని తీయడానికి రంధ్రం చేసి దాని ద్వారా తీస్తారు. దాని ద్వారా కణితి నమూనా తీసుకుంటారు. ఇతర సందర్భాల్లో, బయోప్సీ సమయంలో CT లేదా MRI మార్గదర్శకాలను ఉపయోగించి స్టీరియోటాక్టిక్ బయాప్సీ చేస్తారు. పూర్తి పరికరాన్నీ, సిస్టమ్ నీ ఉపయోగించే న్యూరల్ నేవిగేషన్ అనే మరొక పద్ధతి కూడా ఉపయోగించబడుతుంది. ఇది బయాప్సీకి సూదిని గుచ్చడంలో సర్జన్ కి గైడ్ చేస్తుంది.

పిట్యూటరీ సర్జరీ

ఇతర మెదడు కణుతుల చికిత్సతో పోలిస్తే పిట్యుటరీ గ్రంథి కణితిని తొలగించేందుకు వేరొక పద్ధతిలో శస్త్రచికిత్స జరుగుతుంది. పిట్యూటరీ గ్రంథి ఉన్న మెదడులోని ఆ భాగానికి ముక్కు ద్వారా చేరుకోవడమే సాధారణంగా ఉపయోగించే పద్ధతి.

క్యాన్సర్ కణాల్ని నాశనం చేయడానికి అధిక శక్తి గల x-రేస్ ని వాడడమే రేడియోథెరపీ. ఈ x- రేస్ క్యాన్సర్ కణాల DNA ని నష్టపరిచి, తద్వారా వాటిని చంపుతాయి. రేడియేషన్ అనేది స్థానిక చికిత్స. ఇది ఇచ్చిన ప్రాంతంలో దాని ప్రభావాన్ని కలిగి ఉంటుంది. x- రేస్ ని ఉత్పత్తి చేసే ఒక పెద్ద యంత్రాన్ని (లీనియర్ యాక్సిలరేటర్) ఉపయోగించి రోగికి చికిత్సను అందిస్తారు. ప్రొటాన్ థెరపీ కూడా రేడియోథెరపీ యొక్క మరో రూపం. ఈ పద్ధతులను ఎక్స్టెర్నల్ బీమ్ థెరపీ (బాహ్య కిరణ వైద్యం)గా పిలుస్తారు.

రేడియోథెరపీ మెదడు కణితులకు చేసే చికిత్సలో ఒక ముఖ్యమైన భాగంగా ఉంటుంది. ఏ రకం రేడియోథెరపీ ఇవ్వాలీ అనేది ఆ మెదడు కణితి రకాన్ని బట్టీ, అది ఉన్న స్థానాన్ని బట్టీ, చికిత్సను తట్టుకోగల రోగి సామర్థ్యాన్ని బట్టీ ఉంటుంది.

రేడియోథెరపీ ప్రక్రియ

మెదడుకు రేడియోథెరపీ అనేది దశల వారీ జరిపే ప్రక్రియ.

మాస్క్ తయారీ

చికిత్స ప్రక్రియలో మొదటి భాగం ముసుగుని తయారు చేసి, ముసుగు వేసి స్కాన్లు తీయడం జరుగుతుంది. ఈ మాస్క్ ని సాధారణంగా ప్లాస్టిక్ తో తయారు చేస్తారు. ఇది వేడిచేసి కావలసిన ఆకారంలోకి మారుస్తారు.

రోగి (అతను/ఆమె) చికిత్స తీసుకుంటున్నప్పుడు ఒకే స్థితిలో పడుకోవలసి ఉంటుంది. చికిత్స ఇచ్చే రేడియోగ్రాఫర్లు ఒక థర్మోప్లాస్టిక్ షెల్ షీట్ తీసుకొని దానిని వేడినీటిలో నానబెడతారు. కొంత సమయం తరువాత, షీట్ వెచ్చగా అయినప్పుడు, దాన్ని ముఖం చుట్టూ చుట్టి, మెల్లగా ముఖం ఆకారంలోకి మారుస్తారు. మొత్తం చికిత్స జరిగినంతసేపూ అదే స్థితిలో తలని పట్టుకోవడం, చికిత్స చాలా ఖచ్చితమైన విధంగా జరిగేలా చూడడం మాస్క్ ప్రయోజనం. అందువలన, మాస్క్ ముఖానికి చాలా బిగుతుగా పట్టుకుని ఉండడం ముఖ్యం. ఒకసారి ఖచ్చితమైన పొజిషన్ లో ఉన్న తర్వాత మాస్క్ తొలగించబడింది, దాన్ని మళ్లీ చల్లబరచడం జరుగుతుంది. చల్లబడిన మాస్క్ ముఖాకారాన్ని కలిగి ఉంటుంది. ఈ మాస్క్ ని ప్రతి రోజు చికిత్స సమయంలో ధరిస్తారు.

CT స్కాన్ ప్లానింగ్

మాస్క్ తయారైన తర్వాత రేడియోథెరపీ ప్లానింగ్ CT స్కాన్ చేయబడుతుంది. ఈ స్కాన్ లో డాక్టర్ వ్యాధిని చూసి రేడియేషన్ ని ప్లాన్ చేసేందుకు వీలుంటుంది. సాధారణంగా, రోగికి ముందు CT లేదా MRI గానీ ఉండాలి. కానీ చికిత్స పొందే స్థితిలో ఉన్న రోగికి కూడా ప్లానింగ్ స్కాన్ అవసరమవుతుంది. కొంతమంది రోగుల విషయంలో MRI ప్లానింగ్ స్కాన్ కూడా చేయవచ్చు.

రేడియోథెరపీ ప్లానింగ్

స్కాన్ పూర్తయిన తర్వాత, వైద్యులు, ఫిజిసిస్టులు చికిత్స ప్రారంభించడానికి కొన్ని రోజుల సమయం తీసుకుంటారు.

రేడియోథెరపీ రకాలు

పైన చెప్పినట్లుగా, రేడియోథెరపీ అధిక శక్తి గల x- రే ని ఉపయోగించి చేస్తారు. చికిత్స చేసే పద్ధతుల్లో వైవిధ్యం వల్ల వివిధ రకాల రేడియోథెరపీలు ఉన్నాయి. ఈ క్రింద వాటి గురించి తెలియజేయడం జరిగింది. రేడియోథెరపీ ప్రోటాన్స్ ని ఉపయోగించి కూడా ఇవ్వవచ్చు.

స్టాండర్డ్ ఫ్రాక్షన్డ్ రేడియోథెరపీ

రేడియో థెరపీ చికిత్స సాధారణంగా రోజుకి ఒకసారి చొప్పున కొన్నిరోజుల వరకు ఇవ్వబడుతుంది. ప్రతి రోజూ ఇచ్చే చికిత్సని ఫ్రాక్షన్ (భాగం) అని పిలుస్తారు. అంటే మొత్తం రేడియోథెరపీ మోతాదులో ఆ రోజుకి ఇవ్వవలసిన భాగం ఇవ్వబడుతుంది. స్టాండర్డ్ రేడియోథెరపీ ప్రతి రోజూ ఇవ్వబడుతుంది. మెదడు కణితి రకాన్ని బట్టి స్టాండర్డ్ రేడియోథెరపీ 3-6 వారాలపాటు వారానికి 5 రోజుల వరకు ఉంటుంది. ఈ రకమైన చికిత్సను 3D కన్ఫర్మల్ స్టాండర్డ్ రేడియోథెరపీ, ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియోథెరపీ (IMRT) లేదా ఆర్క్ థెరపీ (రాపిడ్ ఆర్క్, VMAT), సైబర్నైఫ్ లేదా ప్రొటాన్ థెరపీగా ఇస్తారు. ఈ రకం రేడియో థెరపీయే సాధారణంగా అందరూ ఉపయోగించే పద్ధతి.

స్టీరియోటాక్టిక్ రేడియోసర్జరీ (SRS)

స్టీరియోటాక్టిక్ రేడియోసర్జరీ రేడియోథెరపీలో ఒక రూపం, ఒకే సిట్టింగ్ లో ఒక ఫ్రాక్షన్ (భాగం) చికిత్స ఇవ్వబడుతుంది. ఈ చికిత్సలో చాలా ఖచ్చితంగా ఒక చిన్న ప్రాంతానికి రేడియోథెరపీ అధిక మోతాదులో ఇవ్వడం ఉంటుంది. మెనింజియోమాలు, అకౌస్టిక్ న్యూరోమా లేదా ష్వన్నోమాలు, పిట్యూటరీ అడెనోమాలు, బ్రెయిన్ మెటాస్టేజ్ లు, మరికొన్ని ఇతర రకాల మెదడు కణుతుల చికిత్సకు ఈ రకం చికిత్స ఉపయోగపడుతుంది. మొత్తం చికిత్సని ఒక ఫ్రాక్షన్ లో మాత్రమే ఇవ్వబడడం వల్ల ఈ చికిత్స ఉపయోగించినప్పుడు మరింత ఖచ్చితత్వం అవసరమవుతుంది. అందువల్ల, ఇందులో ప్రత్యేక రేడియోథెరపీ పరికరాలు, పద్ధతులు ఉపయోగిస్తారు. ఈ చికిత్స మొత్తం వ్యవధి 20-45 నిమిషాలు. ఒక లీనియర్ యాక్సిలరేటర్ (నోవాలిస్, ట్రూబీమ్, ఎడ్జ్ సిస్టమ్స్) లేదా గామా నైఫ్ లేదా సైబర్ నైఫ్ సిస్టమ్ తో చికిత్స చేసినప్పుడు 40-120 నిమిషాల వ్యవధిలో చికిత్స చేయబడుతుంది.

గామా నైఫ్ అనేది ఒక ప్రత్యేకమైన రేడియో థెరపీ యంత్రం, దీన్ని ఉపయోగించి మెదడుకు స్టీరియోటాక్టిక్ రేడియోథెరపీని అందిస్తారు. గామా నైఫ్ ఉపయోగించినప్పుడు, తలని చాలా స్థిరంగా ఉంచడానికి ఒక ప్రత్యేకమైన స్టీరియోటాక్టిక్ ఫ్రేమ్ అవసరమవుతుంది.
స్టీరియోటాక్టిక్ రేడియోథెరపీని ఇవ్వడానికి పైన పేర్కొన్న కొత్త రేడియోథెరపీ యంత్రాలకి స్టీరియోటాక్టిక్ ఫ్రేమ్ అవసరం లేకుండానే ఇస్తాయి. ప్రామాణిక రేడియోథెరపీలో మాస్క్ (ముసుగు) ఉపయోగించబడుతుంది. దీనిని ఫ్రేమ్‌ లెస్ రేడియోసర్జరీ అని కూడా పిలుస్తారు.

ఫ్రాక్షనేటెడ్ స్టీరియోటాక్టిక్ రేడియోథెరపీ (SRT)

ఇందులో, రేడియోధార్మిక పద్ధతులు, ఖచ్చితత్వం, సూచనలు అన్నీ కూడా స్టీరియోటాక్టిక్ రేడియోసర్జరీ మాదిరిగానే ఉంటాయి. ప్రధానమైన తేడా ఏమిటంటే, ఒక మోతాదుని కొన్ని చిన్న మోతాదులుగా ఇవ్వడం జరుగుతుంది. రేడియోసర్జరీ ఉపయోగించాలా లేదా ఫ్రాక్షనేటెడ్ స్టీరియోటాక్టిక్ రేడియోథెరపీని ఉపయోగించాలా అనే నిర్ణయం కణితి రకం, పరిమాణం, సంఖ్య, అది వచ్చిన ప్రదేశం, అలాగే ఆ చికిత్స వల్ల కలిగే అవకాశం ఉన్న దుష్ప్రభావాలపై ఆధారపడి ఉంటుంది.

బ్రెయిన్ రేడియోథెరపీకి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్

మెదడుకు రేడియోథెరపీ ఇస్తే ఈ క్రింద ఇవ్వబడిన కొన్ని దుష్ప్రభావాలు కలగవచ్చు.

జుట్టు ఊడడం

సాధారణంగా ఇది మెదడు రేడియోథెరపీకి వచ్చే సైడ్ ఎఫెక్ట్. తలపై జుట్టు కోల్పోతుంది. ఈ జుట్టు కోల్పోవడం అక్కడక్కడా బాగా ఊడిపోవచ్చు, రేడియోథెరపీ మెదడులోకి వెళ్ళిన ప్రదేశాలకు మాత్రమే పరిమితమై ఉంటుంది. రేడియోథెరపీ మోతాదుని బట్టి జుట్టు రాలిపోవడం తాత్కాలికంగా నైనా కావచ్చు లేదా శాశ్వతంగా కూడా పోవచ్చు.

చర్మం మార్పులు

తలపై చర్మం ఎర్రగా మారవచ్చు, చాలా నొప్పిగా ఉండవచ్చు. ఈ చికిత్స పూర్తయిన కొన్ని వారాల తరువాత ఇది మామూలు స్థితికి వచ్చేస్తుంది.

తలనొప్పి, అలసట

ఇవి రేడియోథెరపీకి వచ్చే సాధారణ దుష్ప్రభావాలు. చికిత్స ముగిసిన కొన్ని వారాల తర్వాత ఈ లక్షణాలు తగ్గిపోతాయి.

వికారం, వాంతులు

ఈ ప్రభావాలు మెదడుకి రేడియోథెరపీ ఇచ్చిన కొందరు రోగులలో ఉంటాయి. చికిత్సకు 30 నిముషాల ముందు మాత్రలు తీసుకుంటే అవి ఈ లక్షణాలు రాకుండా నివారిస్తాయి.

పెరిగిన ఇంట్రాక్రానియల్ ప్రెషర్

మెదడుకు రేడియోథెరపీ ఇచ్చిన రోగులలో మెదడులో ఒత్తిడి పెరగవచ్చు. రోగి స్టెరాయిడ్లపై ఉంటే, ఈ మోతాదుని మరింత పెంచి ఈ సైడ్ ఎఫెక్ట్ ని తగ్గించవచ్చు.

ఎక్కువయ్యే నిద్రలేమి

ఈ సైడ్ ఎఫెక్ట్ చికిత్స ముగిసిన కొద్ది వారాల తరువాత జరుగుతుంది.

ఏకాగ్రత, జ్ఞాపకం తగ్గడం

మెదడు రేడియోథెరపీకి ఇది ఎక్కువగా వచ్చే ఒక దుష్ప్రభావం. ఇది చికిత్స మోతాదుపైన, మెదడులో చికిత్స చేసే చోటు పైన ఆధారపడి ఉంటుంది.

పిట్యూటరీ కార్యకలాపాలు తగ్గడం

మెదడు రేడియోథెరపీ ఇచ్చిన తరువాత కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాలకి సంభవించే ఒక దుష్ప్రభావం. మెదడులోని ఆ భాగంలో రేడియోథెరపీ ఇవ్వబడిన రోగులలో పిట్యూటరీ గ్రంథి పనితీరుని పరిశీలించవలసి ఉంటుంది.

లో గ్రేడ్ గ్లియోమాల్లో పైలోసైటిక్ ఆస్ట్రోసైటోమాలు, ఒలిగోడెండ్రోగ్లియోమాలు, డిఫ్యూజ్ ఆస్ట్రోసైటోమాలు, గ్యాంగ్లియోగ్లియోమాలు అనే రకాలున్నాయి. లో గ్రేడ్ గ్లియోమాల చికిత్స ఎంపికల్లో శస్త్రచికిత్స, రేడియోథెరపీ, కెమోథెరపీ మరియు పరిశీలన ఉన్నాయి. ఈ ఆప్షన్లని క్రింద వివరంగా చర్చించడం జరిగింది.

లో గ్రేడ్ గ్లియోమాకి సర్జరీ

గ్లియోమాని శస్త్రచికిత్స ద్వారా తొలగించడమనేది దాని చికిత్సలో ఒక ముఖ్యమైన భాగం. కణితిని పూర్తిగా రిసెక్షన్ (విచ్ఛేదం) చేసి తొలగించినపుడు ఫలితం చాలా బాగుంటుంది, కొన్ని సందర్భాల్లో, కణితి స్థానాన్ని బట్టి, డీబల్కింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఇక్కడ గడ్డని తొలగించడం సాధ్యపడదు, కేవలం కణితిలో కొంత భాగం మాత్రమే తొలగించబడుతుంది. ఇతర పరిస్థితులలో, డీబల్కింగ్ ప్రక్రియ కూడా సాధ్యం కాదు, దానికి కేవలం బయాప్సీ మాత్రమే చేయడం సాధ్యపడుతుంది. మొత్తంమీద, అధ్యయనాల ప్రకారం, మరిన్ని శస్త్రచికిత్సలు జరిగితే మెరుగైన ఫలితాలు వస్తాయని తేలింది. అయితే శస్త్రచికిత్సల ఫలితంగా ఏర్పడే దుష్ప్రభావాలు, అలాగే కార్యకలాపాల్ని నిర్వహించలేని స్థితుల్ని సరిగా బ్యాలెన్స్ చేసుకోగలగాలి. చిన్న కణుతులు ఉండి, లక్షణాలు కనిపించని రోగులకి చెందిన ఒక చిన్నసమూహానికి, వేరే సమయంలో తర్వాత ఎప్పుడో కొంచెం ఆలస్యంగా శస్త్రచికిత్స చేసినా ఫరవాలేదు.

రేడియోథెరపీ

రేడియోథెరపీ లేదా రేడియేషన్ థెరపీ అంటే క్యాన్సర్ల చికిత్స కోసం అధిక శక్తి గల x- రే ని ఉపయోగించడం. లో గ్రేడ్ గ్లియోమా కేన్సర్లలో సర్జరీ చేసి, వెంటనే రేడియోథెరపీ ఇస్తే మెరుగైన ఫలితాలు వస్తాయి. కణితి పెరుగుదలని ఆలస్యం చేయడానికి కూడా ఇలా చేయవచ్చు. ఈ సెట్టింగ్ లో ఇచ్చే రేడియోథెరపీ ప్రతిరోజూ ఇస్తారు, ఇలా వారానికి 5 రోజుల చొప్పున 6 వారాలపాటు జరుగుతుంది. శస్త్రచికిత్స తర్వాత వెంటనే (వీలైనంత త్వరగా) ఈ చికిత్స చేయవచ్చు లేదా కొంతమందికి రోగులకి సర్జరీ(ఆలస్యమైన) చేసిన తర్వాత కొంత కాలానికి మళ్లీ ఖచ్చితంగా క్యాన్సర్ పెరుగుతుందనుకున్నపుడు ఈ చికిత్స చేయవచ్చు. కణితి, రోగి లక్షణాలు, రోగి కోరిక ఆధారంగా చికిత్సకి అవసరమైన ఖచ్చితమైన సమయం నిర్ణయించబడుతుంది. ముందుగానే రేడియోథెరపీ ఇస్తే రోగులలో రోగ లక్షణాలను తగ్గుతున్నట్టు చూపించబడింది కానీ ఆలస్యంగా చేసిన చికిత్సతో పోలిస్తే వారు ఎక్కువ కాలం బ్రతికినట్లు చూపబడలేదు.

మెదడు రేడియోథెరపీకి ఉండే సాధారణ దుష్ప్రభావాల్లో అలసట, జుట్టు ఊడడం, వికారం, ఆకలి లేకపోవడం, రకరకాల తలనొప్పులు, తలనొప్పులు, ఇంకా అవయవ బలహీనత లేదా మూర్ఛల వంటి ప్రారంభ లక్షణాలు తీవ్రతరం కావడం వంటివి ఉన్నాయి. రేడియోథెరపీకి చెందిన కొన్ని దీర్ఘకాలిక ప్రభావాల్లో ఏకాగ్రత, ‌‌జ్ఞాపకశక్తి తగ్గడం కూడా ఉన్నాయి.

క్యాన్సర్ కి కెమోథెరపీ

చికిత్స చేయడానికి కెమోథెరపీని మాత్రలు, ఇంజక్షన్ల రూపంలో మందులు ఇస్తారు. లో (తక్కువ) గ్రేడ్ గ్లియోమా కేన్సర్ల చికిత్సలో కెమోథెరపీ ఒక ముఖ్యమైన భాగం.

ఇక్కడ కెమోథెరపీ సాధారణంగా రేడియోథెరపీ పూర్తి అయిన తర్వాత ఇవ్వబడుతుంది. కేవలం రేడియో థెరపీతో పోలిస్తే తర్వాత రేడియోథెరపీ తర్వాత కెమోథెరపీ ఇస్తే మెరుగైన ప్రయోజనం ఉంటుంది. దీనికి ఉపయోగించాల్సిన మందులు ప్రొకార్బజన్, లోమస్టిన్, విన్క్రిస్టిన్ (PCV) లేదా టెమోజోలోమైడ్. ఒలిగోడెండ్రోగ్లియోమా కేన్సర్ ఉన్న రోగులకి, రేడియోథెరపీ మాత్రమే కాక శస్త్రచికిత్స తర్వాత కెమోథెరపీ ఇవ్వడమే సరైన ఎంపిక. కెమోథెరపీ, అలాగే మనుగడ ప్రతిస్పందనని అంచనా వేసే జన్యు మార్పుల కోసం చూడడానికి కణితి నమూనాని తీసినపుడు కొన్ని ప్రత్యేకమైన జన్యు పరీక్షలు చేయబడతాయి. ఈ పరీక్ష క్రోమోజోమ్ 1p 19q కోడెలేషన్ ని చూస్తుంది, ఒకవేళ అది ఉంటే, కెమోథెరపీ వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

శస్త్రచికిత్సతో బాటు రేడియోథెరపీ, కెమోథెరపీలతో చికిత్స ప్రారంభించిన తర్వాత కేన్సర్ మళ్లీ వస్తే కీమోథెరపీ మళ్లీ ఉపయోగించబడుతుంది. ఈ సెట్టింగ్ లో ఇవ్వబడే కెమోథెరపీని సెకండ్ లైన్ థెరపీ అని అంటారు. దీని చికిత్సకి PCV లేదా టెమోజోలోమైడ్ వంటి ఇతర మందుల్ని ఎంపిక చేసుకోవలసి ఉంటుంది.

గ్లియోమాల్లో హై గ్రేడ్ అంటే బయాప్సీలో 3 లేదా 4 గ్రేడ్ ఇవ్వబడితే హై గ్రేడ్ గ్లియోమోలోకి వస్తుంది. హై గ్రేడ్ గ్లియోమోల్లో అనాప్లాస్టిక్ ఒలిగోడెండ్రోగ్లియోమా, అనాప్లాస్టిక్ ఆస్ట్రోసైటోమా, గ్లియోబ్లాస్టోమా ఉన్నాయి. హై గ్రేడ్ గ్లియోమోల్ని నిర్వహించడం, లో గ్రేడ్ గ్లియోమాల నిర్వహణ కంటే భిన్నంగా ఉంటుంది. హై గ్రేడ్ గ్లియోమోలకి ఈ క్రింద చికిత్స ఎంపికలు ఉన్నాయి.

సర్జరీ

చాలామంది రోగులు, హై గ్రేడ్ గ్లియోమా అని నిర్ధారించబడిన తర్వాత కణితిని శస్త్రచికిత్స ద్వారా తొలగించడాన్నే మొదటి చికిత్సా ఎంపికగా ఎంచుకుంటారు. మెదడు కణుతుల్లో శస్త్రచికిత్స గురించి మరిన్ని వివరాల కోసం, బ్రెయిన్ ట్యూమర్ల సర్జరీ (మెదడు కణుతుల శస్త్రచికిత్స) విభాగాన్ని చూడండి.

రేడియోథెరపీ

కేన్సర్ల చికిత్సకి అధిక శక్తి గల x- రే లని ఉపయోగించడమే రేడియోథెరపీ లేదా రేడియేషన్ థెరపీ. రేడియోథెరపీ అనేది హై గ్రేడ్ గ్లియోమా కేన్సర్ చికిత్సకి ఒక ఎంపిక. కణితిని తీసివేయడానికి శస్త్రచికిత్స తర్వాత చేసిన తర్వాత ఇది ఇవ్వబడుతుంది. హై (అధిక) గ్రేడ్ గ్లియోమాలో, మళ్లీ కణితి పెరగకుండా నివారించడానికి శస్త్రచికిత్స చేసిన తర్వాత వెంటనే రేడియోథెరపీ ప్రారంభించాల్సిన అవసరం ఉంది. ఈ చికిత్స 6 వారాల వ్యవధికి ఇవ్వబడుతుంది, టెమోజోలోమైడ్ అని పిలవబడే కెమోథెరపీ మందుతో పాటు ఇది ఇవ్వబడుతుంది. ఈ ఔషధాన్ని రేడియోథెరపీ జరుగుతున్నపుడూ, అలాగే పూర్తి అయిన తరువాత కూడా ఇవ్వబడుతుంది. రోగులు బలంగా లేకపోయినా, పెద్దవయసువారైనా, రేడియోథెరపీ తక్కువ వ్యవధికి ఇవ్వబడుతుంది, దాంతో ఒకోసారి కెమోథెరపీ ఇస్తారు లేదా ఇవ్వకుండా కూడా చేస్తారు.

మెదడు రేడియోథెరపీకి కలిగే సాధారణ దుష్ప్రభావాల్లో అలసట, జుట్టు ఊడడం, వికారం, ఆకలి లేకపోవడం, తలనొప్పులు, ఇంకా అవయవ బలహీనత లేదా మూర్ఛల వంటి ప్రారంభ లక్షణాలు తీవ్రతరం కావడం. రేడియోథెరపీలో కనిపించే కొన్ని దీర్ఘకాలిక ప్రభావాల్లో ఏకాగ్రత, ‌జ్ఞాపకశక్తి తగ్గడం, రోజూ చేసే పనులు కూడా చేయడానికి కష్టపడడం.

కెమోథెరపీ

హై గ్రేడ్ గ్లియోమా కేన్సర్ల చికిత్సకు కెమోథెరపీని ఉపయోగిస్తారు. కెమోథెరపీలో కేన్సర్ ని తగ్గించడానికీ, నియంత్రించడానికీ మాత్రలు, ఇంజక్షన్లు లేదా డ్రిప్స్ రూపంలో ఔషధాల్ని ఇవ్వడం జరుగుతుంది. హై గ్రేడ్ గ్లియోమాల్లో, కెమోథెరపీ చికిత్సలో రేడియోథెరపీతో బాటు టెమోజోలోమైడ్ ని ఉపయోగిస్తారు. రేడియోథెరపీ సమయంలోనూ, రేడియోథెరపీ పూర్తి చేసిన తర్వాత 6-12 నెలల వరకు కూడా ఈ మందు తీసుకోవాలి. రేడియోథెరపీ తర్వాత ఇవ్వబడిన మందుని ప్రతి నెలా 5 రోజుల పాటు ఇస్తారు.

ఈ విధంగా ఇచ్చిన చికిత్స కణితిని చాలా బాగా నియంత్రించడానికి సహాయపడుతుంది. రేడియోథెరపీని మాత్రమే ఉపయోగించాలా లేదా రేడియోథెరపీ మరియు కెమోథెరపీల్ని కలిపి ఉపయోగించాలా అనే అంశాన్ని రోగుల బలాన్ని అంచనా వేసిన తరువాతే అంకాలజిస్టు ఒక నిర్ణయం తీసుకుంటారు. వృద్ధ రోగులు లేదా శారీరిక బలం లేని రోగులకి శస్త్రచికిత్స తర్వాత రేడియోథెరపీ లేదా టెమోజోలోమైడ్ లలో సరిపోయే ఏదో ఒకటి ఉపయోగించబడుతుంది.

ప్రారంభ చికిత్స తర్వాత వ్యాధి మళ్లీ తిరగబెడితే కూడా కెమోథెరపీని ఉపయోగిస్తారు. దీనికి ఉపయోగించాల్సిన మందుల్లో ప్రోకార్బాజైన్, లోమస్టిన్, విన్క్రిస్టైన్ (PCV), కార్బోప్లాటిన్, ఇరినోటెకాన్, బెవాసిజుమాబ్ వంటివి కూడా ఉన్నాయి.

బెవాసిజుమాబ్ అనేది మోనోక్లోనల్ యాంటీబాడీ మరియు కొత్త రక్త నాళాలు అభివృద్ధి చెందడాన్ని ఆపుతుంది. గ్లయోబ్లాస్టోమా లాంటి అధిక గ్రేడ్ గ్లయోమాస్ చికిత్సలో దానిని సొంతంగా లేదా ఇరినోటెకాన్ మరియు లోముస్టైన్ లాంటి కీమోథెరపితో సమ్మేళనంగా చికిత్స చేసేందుకు దీనిని ఉపయోగిస్తారు. బెవాసిజుమాబ్ యొక్క దుష్ప్రభావాల్లో అధిక రక్త పోటు, రక్తస్రావం అపాయం మరియు గాయాలు మానడంలో జాప్యం జరగడం ఉంటాయి.

ఇతరులు

అధిక గ్రేడ్ గ్లయోమాస్ గల చాలా కొద్ది మంది రోగులకు ఎన్టిఆర్కె జీన్స్లో ఫ్యూజన్స్ లాంటి కణితిలో జన్యుపరమైన మార్పులు ఉంటాయి. ఈ రోగులు లారోట్రెక్టినిబ్ మరియు ఎంట్రెక్టినిబ్ లాంటి కొత్త బయోలాజికల్ ఏజెంట్ల నుంచి ప్రయోజనం పొందవచ్చు.

మెదడు కణితులు గల రోగులకు సపోర్టివ్ కేర్

మెదడు కణితులు గల రోగులకు అనేక అవసరాలు, అంగవైకల్యాలు మరియు ఇతర క్యాన్సర్లు గల రోగుల కంటే భిన్నంగా ఉండే సమస్యలు ఉండొచ్చు. రోగులు తమ చికిత్సను పూర్తిచేసిన తరువాత వాళ్ళు సర్వోత్తమంగా పనిచేస్తారని నిర్థారించుకునేందుకు తగినంత మరియు ప్రణాళిక చేసిన సపోర్టివ్ కేర్ అవసరం.

స్టీరాయిడ్లను ఉపయోగించుట
స్టీరాయిడ్లు అనేవి మెదడు కణితులు లేదా క్యాన్సర్లు గల రోగుల్లో మామూలుగా ఉపయోగించే డ్రగ్స్. అత్యంత సామాన్యంగా ఉపయోగించే స్టీరాయిడ్ డెక్సామెథాసోన్. మెదడులో కణితి చుట్టూ ఫ్లూయిడ్ జమకావడాన్ని తగ్గించడానికి, తద్వారా తలలో పీడనం తగ్గించి లక్షణాలను మెరుగుపరచడానికి స్టీరాయిడ్స్ సహాయపడతాయి. డెక్సామెథాసోన్ని ఎంత మొత్తంలో ఉపయోగిస్తారనేది రోగి యొక్క స్థితిపై ఆధారపడి ఉంటుంది. ఈ మోతాదును డాక్టరు పెంచుతారు మరియు తగ్గిస్తారు. డాక్టరు సలహాను రోగి కచ్చితంగా పాటించడం ముఖ్యం. స్టీరాయిడ్లను అకస్మాత్తుగా ఆపేయకూడదు, ప్రత్యేకించి వాటిని 2 వారాల కంటే ఎక్కువ సమయం తీసుకుంటే, స్టీరాయిడ్ల మోతాదును క్రమేపీ తగ్గిస్తాయి మరియు దీని గురించి డాక్టరు సలహా ఇస్తారు. స్టీరాయిడ్లను దీర్ఘ కాలం పాటు ఉపయోగించడం వల్ల కలిగే దుష్ప్రభావాల్లో బరువు పెరగడం, ముఖం వాపు, చర్మం సులభంగా కమలడం, ఇన్ఫెక్షన్ ప్రమాదం, డయాబెటీస్ గల రోగుల్లో చక్కెర స్థాయిలు పెరగడం, ఆకలి పెరగడం మరియు కండరాల్లో బలహీనత కలిగి మెట్లు ఎక్కడంలో కష్టం కలగడం ఉంటాయి. ఈ దుష్ప్రభావాలు ఉన్నప్పటికీ, మెదడు కణితిలు గల రోగుల్లో స్టీరాయిడ్లు కీలక పాత్ర పోషిస్తాయి.

ఫిట్స్ నిరోధక మందులు
మెదడు కణితులు గల అనేక మంది రోగులకు ఫిట్స్ వచ్చే అపాయాన్ని తగ్గించేందుకు మూర్ఛనిరోధకాలు అనే మందులు ప్రిస్క్రయిబ్ చేయబడతాయి. ఫిట్స్ గల రోగులకు మరియు ఫిట్స్ ఏవీ లేని వారికి వీటిని ఇవ్వవచ్చు. ఫిట్స్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకునేందుకు రోగులు ఈ మందులు తీసుకోవడం ముఖ్యం. ఈ మందులు తీసుకున్నప్పటికీ ఫిట్స్ కొనసాగుతూనే ఉంటే ఈ మందుల మోతాదులను మార్చవలసిన లేదా ప్రత్యామ్నాయ మందులను ఇవ్వవలసిన అవసరం ఉంటుంది.

ఫిజియోథెరపి, ఆక్యుపేషనల్ థెరపి మరియు ఇతరవి
మెదడు కణితులు గల రోగులకు కదలిక, మాట లేదా రోజువారీ పనులు చేయగల సామర్థ్యం తగ్గడం కలగవచ్చు. చికిత్స సమయంలో మరియు పూర్తయిన తరువాత, రోగి యొక్క కదలికను మెరుగుపరచడానికి సముచితమైన ఫిజియోథెరపి ఇవ్వవలసి ఉంటుంది, రోగి యొక్క లక్షణాలను బట్టి, రోగి స్వతంత్రంగా ఉండేందుకు ఆక్యుపేషనల్ థెరపి, స్పీచ్ మరియు భాష థెరపి, మింగుడు మదింపు తదితరవి కూడా రోగులకు అవసరం కావచ్చు.

ప్రాథమిక సిఎన్ఎస్ లింఫోమా అనేది మెదడులో లేదా కళ్ళు, వెన్నెముక లేదా మెదడులోని మెనింజెస్ లాంటి ఇతర అవయవాల్లో ప్రారంభమవుతుంది. దీని విశిష్టతలు, ప్రవర్తన మరియు చికిత్స శరీరంలోని ఇతర భాగాల్లో ప్రారంభమయ్యే లింఫోమాస్ కి భిన్నంగా ఉంటాయి.

ప్రాథమిక సిఎన్ఎస్ లింఫోమా లక్షణాలు

ఈ రకమైన లింఫోమా మెదడుకు సంబంధించిన లక్షణాలను ఉత్పత్తిచేస్తుంది. మామూలు లక్షణాల్లో తలనొప్పి, ఫిట్స్, తికమక, జ్ఞాపకశక్తి తగ్గడం, పర్సనాలిటిలో మార్పు, కంటిచూపు తగ్గడం, వాంతులు మరియు శరీరంలోని విభిన్న భాగాల్లో బలహీనత ఉంటాయి.

ప్రాథమిక సిఎన్ఎస్ లింఫోమాకు పరిశోధనలు

ఈ రకమైన క్యాన్సరును అనుమానించినప్పుడు లేదా రోగి పై లక్షణాలను ప్రదర్శించినప్పుడు, ఈ కింది పరీక్షలు చేయబడతాయి.

ఎంఆర్ఐ స్కాన్

రోగి పై లక్షణాలను ప్రదర్శించినప్పుడు మెదడులో అసాధారణతల కోసం చూసేందుకు మెదడుకు ఎంఆర్ఐ స్కాన్ మామూలుగా చేయబడుతుంది. సిఎన్ఎస్ లింఫోమా ఈ లక్షణాలకు గల సంభావ్య కారణాల్లో ఒకటి మరియు ఎంఆర్ఐ స్కానులో కనిపిస్తుంది.

సిటి స్కాన్

ఎంఆర్ఐ స్కాన్ లభించని చోట, మెదడులో అసాధారణతలను చూసేందుకు సిటి స్కాన్ తీస్తారు.

సిఎస్ఎఫ్ విశ్లేషణ

సిఎస్ఎఫ్ లేదా సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అనేది మెదడు మరియు వెన్నెముకలోని వెంట్రికల్స్ లో ఉండే ఫ్లూయిడ్. ఈ ఫ్లూయిడ్ శాంపిల్ ని తీసుకొని పరిశోధనల్లో భాగంగా లింఫోమా సెల్స్ ఉన్నాయేమో తెలుసుకునేందుకు పరీక్షించబడుతుంది.

బయాప్సీ

సిఎన్ఎస్ లింఫోమా నిర్థారణను ధ్రువీకరించేందుకు మెదడులోని అసాధారణ ప్రాంతానికి బయాప్సీ చేయబడుతుంది.

ప్రాథమిక సిఎన్ఎస్ లింఫోమాకు చికిత్స

ఈ స్థితికి చికిత్స ప్రధానంగా రోగి వయస్సు మరియు ఫిట్ నెస్ పై ఆధారపడి ఉంటుంది.

కీమోథెరపి

యవ్వనంలో మరియు ఫిట్ గా ఉన్న రోగులకు, సంయోజన కీమోథెరపి చికిత్స ఎంపిక. ఈ కీమోథెరపిలో మెథోట్రెక్సేట్, సైటరాబైన్ మరియు రిటూక్సిమాబ్ లాంటి ఔషధాలు ఉంటాయి. ఈ చికిత్స అనేక దుష్ప్రభావాలు కలిగించవచ్చు కాబట్టి ఈ గ్రూపు రోగుల్లో మాత్రమే ఇవ్వబడుతుంది. చికిత్సకు సంపూర్ణ స్పందన గల రోగులకు, మరింతగా చికిత్స అవసరం లేకపోవచ్చు.

మరొక వైపు, స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంట్ లేదా కీమోథెరపి లేదా కన్సాలిడేషన్ కీమోథెరపి లాంటి చికిత్సను కొంతమంది డాక్టర్లు సూచించవచ్చు. కీమోథెరపి కోర్సును వెన్నెముక కెనాల్ లోకి కూడా ఇవ్వవచ్చు మరియు ఇంట్రాథెకాల్ కీమోథెరపి అని కూడా అంటారు.

ఫిట్ గా లేని లేదా 50 సంవత్సరాలకు పైగా వయస్సు గల రోగుల వ్యాధికి చికిత్స చేసేందుకు టెమోజోలోమైడ్ రిటూక్సిమాబ్ లాంటి తక్కువ తీవ్రత గల కీమోథెరపిని ఇస్తారు.

రేడియోథెరపి

ఈ స్థితి గల రోగులకు రేడియోథెరపి చికిత్స ఎంపిక. రేడియోథెరపి దానంతటది రోగనాశక చికిత్స కాదు. కీమోథెరపికి పూర్తి స్పందన లేని, కీమోథెరపి చేయించుకునేందుకు కావలసినంత ఫిట్ గా లేని లేదా కీమోథెరపి తరువాత క్యాన్సరు తిరిగి కలిగిన రోగుల్లో రేడియోథెరపి సాధారణంగా ఒక చికిత్స ఎంపిక. రేడియోథెరపి కోర్సు అది ఉపయోగించబడుతున్న స్థితిని బట్టి 3-5 వారాలు ఉండొచ్చు.

చికిత్స పూర్తయిన రోగులు ఔట్ పేషెంట్ క్లినిక్ లో రెగ్యులర్ గా కనిపిస్తూ ఉండడమే ఫాలో అప్ ప్రక్రియ. వ్యాధిలో ఏదైనా పెరుగుదల కనిపిస్తే ముందుగానే పసికట్టి, దానికి తగ్గ చికిత్స తీసుకోవడానికి ఇది ముఖ్యమైనది. అలాగే, చికిత్స ఫలితంగా సంభవించిన ఏవైనా దుష్ప్రభావాలను పర్యవేక్షించడానికి వైద్యుడికి అవకాశం ఉంటుంది. వివిధ మెదడు కణుతులకు వేర్వేరు ఫాలో అప్ షెడ్యూల్స్ ఉంటాయి. ఈ ప్రక్రియ ప్రారంభంలో ప్రతి ౩ నెలలకి ఒకసారి వైద్యుడిని సందర్శించాలి, క్రమంగా సందర్శనల మధ్య విరామం పెరుగుతూ ఉంటుంది. రేడియోథెరపీ ముగిసిన 2-3 నెలల తర్వాత MRI లేదా CT స్కాన్ చేయబడుతుంది, ఈ స్కాన్ ని భవిష్యత్ స్కాన్లతో పోల్చడానికి బేస్ లైన్ గా ఉపయోగిస్తారు. ప్రారంభంలో ప్రతి 3-6 నెలలకీ రెగ్యులర్ స్కాన్లు జరుగుతాయి, ప్రతి సంవత్సరం తరువాత కణితిని పరిశీలించడం జరుగుతుంది. పిట్యూటరీ గ్రంథి పనితీరును పర్యవేక్షించడానికి రక్త పరీక్షలు కూడా తరచూ జరుగుతాయి.