Biological Therapy

బయోలాజికల్ థెరపీ

కేన్సర్‌లో బయోలాజికల్ థెరపీ అంటే ఏమిటి?


బయోలాజికల్ థెరపీ అంటే కేన్సర్ కణాలూ మరియు దాని వాతావరణంలోని నిర్దిష్ట ప్రాంతాల్నీ లక్ష్యంగా చేసుకునే మందుల వాడకం. గత 15 సంవత్సరాలుగా, కేన్సర్ చికిత్సలో బయోలాజికల్ (జీవసంబంధమైన) ఏజెంట్ల వాడకంలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. బయోలాజికల్ థెరపీలో యాంజియోజెనిసిస్ ఇన్హిబిటర్స్, మోనోక్లోనల్ యాంటీబాడీస్, ఇమ్యునోథెరపీ, జీన్ థెరపీ, వేక్సిన్ (టీకా) థెరపీ, సైటోకిన్ థెరపీ, టార్గెటెడ్ డ్రగ్ థెరపీ వంటి అనేక చికిత్సలు ఉన్నాయి.

ఈ బయోలాజికల్ చికిత్సలను విస్తృతంగా రెండు సమూహాలుగా “నిబ్స్” మరియు “మాబ్స్” గా విభజించవచ్చు.

కేన్సర్ కణ మార్గంలో నిర్దిష్ట గ్రాహకాల (రిసెప్టార్స్) ను లక్ష్యంగా చేసుకుని, కేన్సర్ కణాలు విభజించడం, పెంచడం అనే పనులు చేయకుండా నిరోధించే ఏజెంట్లు “నిబ్స్”. సాధారణంగా కేన్సర్ నిర్దిష్ట మార్గాలను ఉపయోగించి పెరుగుతుంది, అభివృద్ధి చెందుతుంది. శరీరంలోని సాధారణ కణాల పెరుగుదలలో కూడా ఈ మార్గాలు ఉంటాయి, అయితే కొన్ని కేన్సర్లు ఈ మార్గాల విస్తరణ ప్రక్రియలను అభివృద్ధి చేసి వాటిని వేగంగా పెరిగేలా చేస్తాయి. ఈ మందులకు “నిబ్” తో ముగిసే పేర్లు ఉంటాయి. ఉదాహరణకు సునిటినిబ్, సోరాఫెనిబ్, ఎర్లోటినిబ్ మొదలైనవి.

“మాబ్స్” అనేది కూడా కేన్సర్ కణంలోని నిర్దిష్ట ప్రాంతాలను లేదా దాని మార్గాలను లక్ష్యంగా చేసుకునే మందుల రకాలు. మాబ్స్ ఈ ప్రాంతాలలో నిర్దిష్ట లక్ష్యాలు అభివృద్ధి చెందకుండా చూసే ప్రతిరోధకాలు (యాంటీబాడీస్). కేన్సర్ మార్గాల్లోని వివిధ ప్రాంతాలలో వివిధ రకాల మాబ్‌లు పనిచేస్తాయి. వీటిల్లో రిటుక్సిమాబ్, బెవాసిజుమాబ్, ట్రాస్టూజుమాబ్ మొదలైన సాధారణ మాబ్స్ కొన్ని ఉన్నాయి.

కణంలో ఉన్న కేన్సర్ కణాలు మరియు సాధారణ కణాల్లో కొన్ని మార్గాల్లో పరిమాణం పెరగడం, సంఖ్య పెరగడం ఎలా ఉంటుందో ఈ క్రింది చిత్రం చూపిస్తుంది. బయోలాజికల్ మందులు ఈ మార్గంలో నిర్దిష్ట ప్రాంతాలపై పనిచేసి, దానిని అడ్డుకుంటాయి.

ఇతర ఏజెంట్లు

కేన్సర్ మార్గాల్లో వివిధ భాగాలపై పనిచేసే ఇతర బయోలాజికల్ ఏజెంట్లు “మిబ్స్”. ఉదాహరణకు, మైలోమా రకం కేన్సర్ లో ఉపయోగించే బోర్టోజోమిబ్, కార్ఫిల్జోమిబ్.

బయోలాజికల్ థెరపీలు కెమోథెరపీ కంటే తక్కువ దుష్ప్రభావాలను కలిగిస్తాయా?

చాలా వరకు, కణంలోని నిర్దిష్ట లక్ష్యాలపై పనిచేస్తాయి కాబట్టి బయోలాజికల్ థెరపీలు కెమోథెరపీ కంటే తక్కువ దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి. అయినప్పటికీ, అవి దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి వాటిలో కొన్ని తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగిస్తాయి. కాబట్టి, ఈ మందులు విషపూరితం కాదని అనుకోవడం సురక్షితం కాదు. కెమోథెరపీలో ఉన్నవారికి ఎలాంటి జాగ్రత్త, శ్రద్ధ తీసుకుంటారో, ఈ ఔషధాల్ని తీసుకునే రోగులకు కూడా అదే జాగ్రత్త, శ్రద్ధ ఉండాలి.

కెమోథెరపీకి బదులుగా బయోలాజికల్ థెరపీలను ఉపయోగించవచ్చా?

కొన్ని సందర్భాల్లో, కెమోథెరపీకీ, బయోలాజికల్ ఏజెంట్ కీ మధ్య ఎంపిక ఉంది. ఇతర కేసుల్లో, రెండు చికిత్సల్నీ ఉపయోగించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. కాబట్టి, ఏ చికిత్సను ఉపయోగించాలీ అనేది కేన్సర్ రకం, దాని దశ, కేన్సర్ కణంలో కొన్ని జన్యు మార్పుల ఉనికి, చికిత్స ఖర్చు, రోగి ఫిట్నెస్ మీద ఆధారపడి ఉంటుంది.

కెమోథెరపీ కంటే బయోలాజికల్ థెరపీలు ఖరీదైనవిగా ఉన్నాయా?

ఉపయోగించే ఔషధం, అది ఉపయోగించిన దేశాన్ని బట్టి బయోలాజికల్ థెరపీల ఖర్చు మారుతుంది. కొన్ని బయోలాజికల్ డ్రగ్స్ ఖరీదైనవి కావు, కానీ మరికొన్ని చాలా ఖరీదైనవి. మొత్తం మీద, కెమోథెరపీ కంటే సగటు బయోలాజికల్ థెరపీ ఖరీదైనదే.

బయోలాజికల్ ఏజెంట్లు ఎలా ఇవ్వబడతాయి?

బయోలాజికల్ ఏజెంట్లు టాబ్లెట్ ఇంజెక్షన్ రూపాల్లో ఉంటాయి. ఇంజెక్షన్ రూపంలో ఉన్నవారికి సిర (వెయిన్) ద్వారా గానీ లేదా చర్మం క్రింద గానీ ఇవ్వబడుతుంది. టాబ్లెట్ రూపంలో ఉన్నవి నోటి ద్వారా తీసుకోబడతాయి.

వాటిని ఎంత తరచుగా ఇస్తారు?

కొన్ని మందులు ముఖ్యంగా టాబ్లెట్లను రోజూ ఇస్తారు. మిగతా వాటిని వారానికి ఒకసారి గానీ, ప్రతి 3-4 వారాలకు ఒకసారి గానీ ఇస్తారు.