Cancer and depression

క్యాన్సర్ మరియు డిప్రెషన్(నిరాశ)

రచన: డాక్టర్ నీలిమా జంపన, MBBS, MRCPsych, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, పీటర్‌బరో, UK

ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల రుగ్మతలకు డిప్రెషన్ అనేది ఒక ప్రధాన కారణం. క్యాన్సర్ రోగులలో తేలికపాటి నుండి అధిక డిప్రెషన్ అనేది సర్వ సాధారణం. క్యాన్సర్ రోగులు చికిత్స తీసుకుంటున్నప్పుడు, వారిలో 24% వరకు నిరాశ కలిగి ఉంటారు. క్యాన్సర్ చివరిదశలో ఉన్న రోగులు మరియు పాలియేటివ్ కేర్ (ఉపశమన సంరక్షణలో) ఉన్నవారికి కూడా డిప్రెషన్ ఉన్నట్లు తెలుస్తుంది. డిప్రెషన్ కలిగి ఉండటం క్యాన్సర్ యొక్క చికిత్సను చాలా ప్రభావితం చేస్తుంది మరియు దానికి అనుగుణంగా చికిత్సను చేయాల్సి ఉంటుంది. ఇది అనారోగ్య భారాన్ని తట్టుకోగల రోగి యొక్క సామర్థ్యాన్ని కూడా తగ్గించవచ్చు. లక్షణాలను బట్టి త్వరగా రోగ నిర్ధారణ పరీక్షలు చేయడం మరియు డిప్రెషన్ ను తగ్గించడానికి చికిత్సను మొదలుపెట్టడం అనేవి క్యాన్సర్ రోగ నిరూపణ మరియు జీవిత నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

డిప్రెషన్ అనేది అసంతృప్తిగా ఉండటం లేదా కొన్ని రోజులు విసుగు చెందడం కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. కనీసం 2 వారాల పాటు మానసిక స్థితి సరిగ్గా లేనప్పుడు, నీరసంగా అనిపిస్తున్నప్పుడు మరియు ఏ పని చేయాలన్నా ఆసక్తి లేకపోవడం వంటి విషయాలను బట్టి డిప్రెషన్ నిర్ధారణ చేయబడుతుంది. అసంతృప్తి మరియు డిప్రెషన్ మధ్య గల అతి సన్నని గీత ఏమిటంటే, అది తరువాతి రోజులలో వారి దైనందిన జీవన విధానంలో అంతరాయాన్ని కలిగిస్తుంది. ఇది నిద్ర, ఆకలి మరియు ఏకాగ్రత స్థాయిలను కూడా ప్రభావితం చేయవచ్చు. ఆందోళన, కన్నీటిని ఆపుకోలేకపోవడం, తక్కువ ఆత్మగౌరవం, అపరాధ భావాలు, నిరాశావాద ఆలోచనలు, నిస్సహాయత మరియు ఆత్మహత్య ఆలోచనలు వంటివి మధ్యస్తం నుండి తీవ్రమైన డిప్రెషన్ ఉన్నవారిలో కనిపిస్తాయి.

క్యాన్సర్ నిర్ధారణకు రోగి స్పందించే విధానం, జీవనశైలి మార్పులకు సర్దుబాటు, చికిత్స దుష్ప్రభావాలు మరియు భవిష్యత్తు యొక్క అనిశ్చితి వంటి అనేక కారణాలు క్యాన్సర్ రోగులలో డిప్రెషన్ కు దారితీయవచ్చు. ఎక్కువగా చింతించే మరియు ఇతరుల మీద ఆధారపడే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు, వారు ఇంతకుముందు డిప్రెషన్ కలిగివుండటం లేదా కుటుంబ సభ్యులలో ఎవరికైనా డిప్రెషన్ చరిత్ర కలిగినవారు ఉండటం, సామాజిక-ఆర్ధిక స్థితిగతులు మరియు సామాజిక మద్దతు లేనివారు డిప్రెషన్ కు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

క్యాన్సర్ రోగులలో డిప్రెషన్ నిర్ధారించడం కష్టం, ఎందుకంటే క్యాన్సర్ మరియు దాని చికిత్స వలన కలిగే శారీరక ఆరోగ్య లక్షణాల అతివ్యాప్తి కారణంగా వారిలో డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తాయి. సోమరితనం, ఆందోళన, ఆకలి లేకపోవడం, నొప్పి, వికారం మరియు శ్వాస తీసుకోకపోవడం వంటివి డిప్రెషన్ మరియు క్యాన్సర్ లలో గమనించే సెకండరీ లక్షణాలు. రోగి, వారి కుటుంబం మరియు వైద్యుడు అలాంటి లక్షణాలను గమనించడం, తరువాత వివరణాత్మక అంచనా వేయడం రోగ నిర్ధారణ చేయడంలో సహాయపడుతాయి.

డిప్రెషన్ కు చికిత్స చాలా అందుబాటులో ఉంది మరియు డిప్రెషన్ ఉన్నవారికి యాంటిడిప్రెసెంట్లు సాధారణంగా సూచించే మందులు. పాత వాటితో పోలిస్తే కొత్త యాంటిడిప్రెసెంట్లు బాగా తట్టుకోగలవు. యాంటిడిప్రెసెంట్లు మీద చాలా కాలంగా ఒక అపవాదు ఉంది, అది ఎక్కువకాలం పాటు రోగులు యాంటిడిప్రెసెంట్లు వాడినట్లైతే, వారు మాదకద్రవ్యాలు మరియు వాటిపై ఆధారపడతారు అని, కాని అది నిజం కాదు. అవి మానసికంగా ఆధారపడటానికి [తృష్ణ] కారణం కావు మరియు కొత్త మందులు ఎక్కువగా మత్తుని కలిగించవు. క్యాన్సర్ రోగులలో యాంటిడిప్రెసెంట్ల యొక్క మోతాదు డిప్రెషన్ యొక్క తీవ్రత, శారీరక ఆరోగ్య సమస్యలు మరియు వారి బలహీనతలను బట్టి పరిగణించబడుతుంది.

యాంటిడిప్రెసెంట్లు తీసుకునే రోగులలో ఎక్కువమంది వాటి నుండి ప్రయోజనాన్ని పొందుతారు. రోగిలో కొంత ప్రతిస్పందనను చూపించడానికి వాటికి 2 నుండి 8 వారాలు పట్టవచ్చు, అందువల్ల వాటి ప్రభావాన్ని అంచనా వేయడానికి ముందు కనీసం 2 నెలలు వాడమని సూచిస్తారు. యాంటిడిప్రెసెంట్లు యొక్క దుష్ప్రభావాలు మందుల రకం మరియు మోతాదును బట్టి మారుతూ ఉంటాయి. కొన్ని దుష్ప్రభావాలు వారం తరువాత కనిపించవచ్చు. కనిపించనట్లైతే, ప్రత్యామ్నాయ యాంటిడిప్రెసెంట్‌ను పరిగణించవచ్చు. యాంటిడిప్రెసెంట్ మోతాదు సాధారణంగా తక్కువ మోతాదుతో ప్రారంభమవుతుంది మరియు రోగి యొక్క సహనాన్ని బట్టి క్రమంగా పెరుగుతుంది. అకస్మాత్తుగా వాటిని ఆపడం అనేది రోగిలో చిరాకు మరియు ఆందోళన వంటి లక్షణాలకు కారణం కావచ్చు. అందువల్ల, డాక్టర్ సలహా మేరకు వాటిని నెమ్మదిగా తగ్గించాలి.

అనేక రకాల మానసిక చికిత్సలు లేదా మాట్లాడుతూ చేసే చికిత్సలు ఉన్నాయి, ఇవి డిప్రెషన్ నుండి బయటపడటానికి సహాయపడతాయి. డిప్రెషన్ ఉన్న క్యాన్సర్ రోగులలో సాధారణంగా కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ [CBT]ని ఉపయోగించి చికిత్స చేస్తారు. CBT లో, చికిత్సకుడు రోగి యొక్క ప్రవర్తన, ఆలోచనలు మరియు భావాల మధ్య గల సంబంధాన్ని గుర్తించడానికి సహాయపడుతుంది. లక్షణాలను తగ్గించడానికి సహాయపడే నిర్మాణాత్మక వ్యూహాలను వారు సిఫారసు చేస్తారు. రోగులు ప్రతికూల ఆలోచనలను మరియు భావాలను గుర్తించడం నేర్చుకుంటారు, అలాగే ఇంటివద్ద చేసే అభ్యాసం, మానసిక వ్యాయామాల ద్వారా చికిత్సకుడి మార్గదర్శకత్వంలో వాటిని నియంత్రించగలుగుతారు.

ECT, ఎలెక్ట్రో కన్వల్సివ్ థెరపీ అనేది తీవ్రమైన/ ఎక్కువ డిప్రెషన్ ఉన్న వారికి చేసే చికిత్స యొక్క ఒక రూపం. యాంటిడిప్రెసెంట్లు సరిగ్గా పనిచేయని సందర్భంలో ఇది డిప్రెషన్ కోసం సూచించబడుతుంది. తీవ్రమైన నిరాశలో రోగులు తినడం, నిద్రపోవడం లేదా ఇతర వ్యక్తులతో మాట్లాడటం మానేయవచ్చు. నిజ జీవితంలో వాస్తవానికి జరగని విషయాలను వారు ఊహించవచ్చు, ఇది అనుమానాస్పద, ఆత్మహత్య ఆలోచనలు మరియు దూకుడు ప్రవర్తనకు దారితీస్తుంది. ఈ పరిస్థితులలో, యాంటిడిప్రెసెంట్ల కంటే ECT వేగంగా పనిచేస్తుంది. క్యాన్సర్ రోగులు ECT కి అనుకూలంగా ఉన్నట్లైతే దానిని అంచనా వేయవచ్చు.

ECT ఒక రోజు ప్రక్రియగా ఆసుపత్రిలో ఇవ్వబడుతుంది మరియు సాధారణంగా రోగులు కోలుకుంటారు మరియు సెషన్ ముగిసిన 8 గంటల్లో ఇంటికి తిరిగి వస్తారు. ప్రక్రియ సమయంలో రోగులకు కండరాలకు విశ్రాంతినిచ్చేది మరియు మత్తు కలిగించే ఏజెంట్ ఇవ్వబడుతుంది, ఇది సుమారు 10 నిమిషాలు నిద్రపోయేలా చేస్తుంది. రోగి తప్పనిసరిగా అపస్మారక స్థితిలోకి వెళ్ళడానికి, వారికి కొన్ని సెకన్ల పాటు తక్కువ మరియు నియంత్రిత విద్యుత్ ప్రేరణలను అందించడానికి రోగి తలపై ఎలక్ట్రోడ్లు అమర్చబడతాయి., ఇది మెదడులోని కొన్ని రసాయనాలను పెంచడానికి సహాయపడుతుంది. చికిత్స సమయంలో రోగులు అపస్మారక స్థితి లేదా ఏదైనా సంబంధిత నొప్పిని అనుభూతి చెందరు. స్వల్పకాలిక గందరగోళం మరియు తలనొప్పి అనేవి ECT యొక్క దుష్ప్రభావాలు.

క్యాన్సర్ రోగుల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి సంరక్షకుని విద్య మరియు మద్దతు, ఆందోళన నిర్వహణ మరియు సంపూర్ణ విచక్షణ లాంటి ఇతర చికిత్సలు సహాయపడుతాయి. రోగికి సంరక్షకుని మద్దతు మరియు విశ్రాంతి చాలా అవసరం. జీవిత భాగస్వామి మరియు దగ్గరి కుటుంబ సభ్యులపై క్యాన్సర్ నిర్ధారణ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. సంరక్షకులకు వారి ఒత్తిడి మరియు భావాలను బయటకు తీసే అవకాశం మరియు స్థలం ఇవ్వాలి. సంరక్షకుడు వారి జీవితంలో కొంత సాధారణతను కొనసాగించాలని మరియు సంరక్షణ పాత్రకు కొంత సమయం అవసరమని గుర్తుంచుకోవాలి. సంరక్షణ ఏజెన్సీల నుండి అదనపు మద్దతు, ఇతర కుటుంబసభ్యుల మద్దతు మరియు / లేదా స్వల్ప విరామంతో దీన్ని సులభతరం చేయవచ్చు. క్యాన్సర్‌తో పోరాడుతున్న వారి ప్రియమైన వ్యక్తికి మద్దతు ఇవ్వడానికి అవసరమైన మానసిక మరియు శారీరక బలాన్ని మెరుగుపర్చడానికి, విశ్రాంతి వారికి సహాయపడుతుంది.

క్యాన్సర్ నిర్ధారణ మరియు దాని పర్యవసానాలు కుటుంబ సభ్యులలో చర్చకు అత్యంత సున్నితమైన అంశంగా మారతాయి. ఇది భావోద్వేగ ప్రకోపాలకు మరియు పరస్పర సంబంధాలను దెబ్బతీసే వాదనలకు దారితీస్తుంది. రోగ నిరూపణ, చికిత్స ప్రణాళికలు మరియు భవిష్యత్ ప్రణాళిక గురించి చర్చలు అవసరమైతే కౌన్సిలర్ ద్వారా సూచనలు మరియు మద్దతు అందించబడతాయి.

మానసిక ఆరోగ్య సమస్యలతో సంబంధం ఉన్న అపవాదు గత దశాబ్దంలో తగ్గిపోయింది. ప్రస్తుతం ఎక్కువ మంది ప్రజలకు డిప్రెషన్ గురించి తెలుసు మరియు చికిత్సను పొందటానికి ముందుకు వస్తున్నారు. క్యాన్సర్ రోగులలో డిప్రెషన్ ను గుర్తించడం మరియు చికిత్స చేయడం చాలా ముఖ్యం. డిప్రెషన్ ఉన్న రోగులకు సహాయపడటానికి మనోరోగ వైద్యులు, మనస్తత్వవేత్తలు మరియు సంపూర్ణ చికిత్సకులు అందించే అనేక రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగులకు సహాయాన్ని అందించడంలో ఆన్‌లైన్ స్వయం సహాయక మరియు స్వచ్ఛంద సేవలు కూడా గణనీయమైన పాత్ర పోషిస్తున్నాయి.