Cancer surgery

కేన్సర్ శస్త్రచికిత్సలో తరచుగా అడిగే ప్రశ్నలు

కేన్సర్‌లో శస్త్రచికిత్స ఎప్పుడు ఉపయోగించబడుతుంది?

కేన్సర్‌లో శస్త్రచికిత్సను వివిధ సందర్భాల్లో ఉపయోగిస్తారు.

క్యురేటివ్ (నివారణ) సర్జరీ

పరీక్షలలో కనిపించే కేన్సర్ అంతటినీ తొలగించడమే నివారణ శస్త్రచికిత్స లక్ష్యం. ఈ రకమైన శస్త్రచికిత్స కేన్సర్ నుండి నివారణను అనుమతిస్తుంది. నివారణ శస్త్రచికిత్స కేన్సర్ ప్రారంభ దశలో చేస్తారు, అలాగే కొన్ని కేసుల్లో కేన్సర్ దశ 3 లో కూడా చేస్తారు. నివారణ శస్త్రచికిత్సని విడిగా ఆ ఒక్కదాన్నైనా చేయడం జరుగుతుంది లేదా శస్త్రచికిత్స తర్వాత కెమోథెరపీ మరియు/లేదా రేడియోథెరపీతో కలిపి జరుగుతుంది. శస్త్రచికిత్సతో పోల్చినప్పుడు ఈ చికిత్సలు నయమయ్యే అవకాశాలను పెంచుతాయి. ఈ అదనపు చికిత్సలు ఎక్కడ ఉపయోగించబడుతున్నాయో అది చికిత్స సమయంలో కేన్సర్ రకం, దశపై ఆధారపడి ఉంటుంది.

నాన్-క్యూరేటివ్ సర్జరీ (పాలియేటివ్ సర్జరీ)

రోగిని నయం చేయడం కాకుండా లక్షణాలను నియంత్రించడం ద్వారా రోగిని మెరుగైన అనుభూతి కలిగించాలనే ఉద్దేశ్యంతో ఈ శస్త్రచికిత్స జరుగుతుంది. కేన్సర్ మరీ ఎక్కువగా అభివృద్ధి చెంది, దాన్ని పూర్తిగా తొలగించడం సాధ్యం కాదన్న రోగులకు గానీ లేదా కేన్సర్ శరీరంలోని వివిధ భాగాలకు (దశ 4) వ్యాపించినందువల్ల నయం కాని పరిస్థితి ఉన్న రోగులకి గానీ ఈ రకమైన శస్త్రచికిత్స జరుగుతుంది. ఈ రకమైన శస్త్రచికిత్సకు ఉదాహరణలు, నిరోధించబడిన ప్రేగుని బైపాస్ చేయడం, డీబల్కింగ్ సర్జరీ– రోగి లక్షణాలను మెరుగుపరచడానికి కేన్సర్‌లో ఎక్కువ భాగాన్ని తగ్గించడం.

పొటెన్షియల్లీ క్యూరేటివ్ సర్జరీ

గతంలో క్యూరేటివ్ చికిత్సలు చేసిన కొంతమంది రోగులకు శరీరంలోని ఒక ప్రాంతంలో వారి కేన్సర్ పునరావృతమవుతుంది. చికిత్సా ఎంపికలు చర్చించబడతాయి, ఈ పునరావృతమైన కేన్సర్ వేరుచేయబడడానికీ, ఆపరేట్ చేయడానికీ వీలుంటే, ఈ పొటెన్షియల్లీ క్యూరేటివ్ సర్జరీ జరుగుతుంది. నివారణ అవకాశంతో కేన్సర్ నియంత్రణను పెంచడమే దీని లక్ష్యం.

రోగనిర్ధారణ (డయాగ్నస్టిక్) శస్త్రచికిత్స

ఈ రకమైన శస్త్రచికిత్స కేన్సర్ నిర్ధారణకీ, అదే సమయంలో ట్రీట్‌మెంట్‌ కీ కూడా సహాయపడుతుంది. ఒక పెద్ద శస్త్రచికిత్స చేయడానికి ముందు సాధారణంగా బయాప్సీ జరుగుతుంది, అయితే కొన్ని పరిస్థితులలో ఈ రెండింటినీ ఒకే సమయంలో చేయవచ్చు.

ప్రివెంటివ్ (నివారణ) శస్త్రచికిత్స

ఇందులో రోగికి కేన్సర్ నిర్ధారణకి ముందు శస్త్రచికిత్స జరుగుతుంది. ఈ రకమైన శస్త్రచికిత్స ఒక రకమైన కేన్సర్ వచ్చే అత్యధిక ప్రమాదం ఉన్న రోగులకు మాత్రమే వర్తిస్తుంది. ఉదాహరణకు, రొమ్ము కేన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్న BRCA జీన్ -(జన్యు) క్యారియర్‌లో వక్షోజాల తొలగింపు.

పునరుద్ధరణ (రెస్టోరేటివ్)/సౌందర్య/పునర్నిర్మాణ (రీ కన్స్ట్రక్టివ్) శస్త్రచికిత్స

ఈ రకమైన శస్త్రచికిత్స సాధారణంగా తల, మెడ ప్రాంతం, రొమ్ము, అవయవ కేన్సర్లలో జరుగుతుంది. సాధారణంగా ఈ శస్త్రచికిత్సలు క్యూరేటివ్ కేన్సర్ శస్త్రచికిత్సలతో పాటు లేదా గానీ లేదా తరువాత గానీ జరుగుతాయి. పెద్ద శస్త్రచికిత్స తర్వాత ఆపరేషన్ చేయబడిన అవయవం పనితీరును పునరుద్ధరించడానికీ లేదా సౌందర్య ఫలితాన్ని మెరుగుపరచడానికీ ఇవి ఉపయోగించబడతాయి.

కేన్సర్‌లో శస్త్రచికిత్సలో ఉపయోగించే వివిధ పద్ధతులు ఏమిటి?

కేన్సర్‌కు చికిత్స చేయడానికి వివిధ రూపాల్లో శస్త్రచికిత్స చేస్తారు.

ఓపెన్ సర్జరీ

ఇది ప్రామాణిక శస్త్రచికిత్స రూపం. ఇందులో చికిత్స చేయవలసిన ప్రదేశంలో కోత పెట్టబడుతుంది, దాని ద్వారా కేన్సర్ తొలగించబడుతుంది. ఉదాహరణకు, కేన్సర్ పొత్తికడుపులో ఉంటే, ఆపరేషన్ జరగడానికి పొత్తికడుపు వద్ద పెద్ద కోత పెట్టడం జరుగుతుంది. ఈ పద్ధతిలో ఉన్న ప్రయోజనాలు ఏమిటంటే, ఇది సాంకేతికంగా చాలా సులభం. కొన్ని సందర్భాల్లో ఉన్న ఏకైక ఎంపిక ఇదే అవుతుంది. ఇతర పద్ధతులతో పోలిస్తే రికవరీ వ్యవధి ఎక్కువ.

లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స

ఇది ఒక రకమైన శస్త్రచికిత్స, ఇందులో 1-2 సెం.మీ పరిమాణంలో 3-4 చిన్న రంధ్రాలు తయారు చేయబడతాయి, వాటి ద్వారానే ఆపరేషన్ జరుగుతుంది. లాప్రోస్కోప్ అనేది కెమెరాతో కూడిన పరికరం, దాన్ని ఆ రంధ్రాలలో ఒకదానిలో నుంచి లోపలికి పంపడం జరుగుతుంది. ఈ పరికరంతో ఆపరేట్ చేసే సర్జన్ శరీరం లోపలి భాగాన్ని (శస్త్రచికిత్స ప్రాంతం) చూడగలుగుతారు. ఆపరేట్ చేసే పరికరాల్ని ఇతర రంధ్రాల నుంచి లోపలికి ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ టెక్నిక్ ప్రయోజనం ఏమిటంటే, మచ్చ చిన్నదిగా ఉంటుంది, త్వరగా నయమవుతుంది. అన్ని కేన్సర్ శస్త్రచికిత్సలకీ ఈ టెక్నిక్ తగినది కాదు. ప్రతికూలతలు ఏమిటంటే, ఆపరేషన్ చేసే వ్యవధి ఓపెన్ మెథడ్ కంటే ఎక్కువసేపు ఉంటుంది. ఇందులో అనుభవం పొందడానికి ప్రత్యేక శిక్షణ, నైపుణ్యాలు అవసరం.

రోబోటిక్ సర్జరీ

ఇది లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్సలో మరొక రూపం, అయితే ఇందులో రోబోటిక్ వ్యవస్థ సహాయంతో పరికరాలను నియంత్రించడం జరుగుతుంది. ఇందులో, లాప్రోస్కోపీ మాదిరిగా, శస్త్రచికిత్స చేసే ప్రాంతంలో చిన్న రంధ్రాలు తయారు చేయబడతాయి. సర్జన్ రోగికి దూరంగా ఉన్న కన్సోల్ మీద కూర్చుని, ఆపరేషన్ చేయడానికి కంప్యూటర్‌ను ఉపయోగిస్తాడు. సర్జన్ చేస్తున్న మూవ్‌మెంట్స్ అన్నీ రోబోటిక్ వ్యవస్థ ద్వారా సాధనాలకు బదిలీ చేయబడతాయి. ఈ పద్ధతి కొన్ని రకాల కేన్సర్లను చికిత్స చేయడానికి ఉపయోగించబడుతుంది. లాప్రోస్కోపీ లాగానే రోగులు త్వరగా కోలుకోవడానికి ఈ చికిత్స సహాయపడుతుంది. కొన్ని రకాల కేన్సర్ శస్త్రచికిత్సల్లో ఇతర రకాల శస్త్రచికిత్సల కంటే దుష్ప్రభావాలు కూడా తక్కువగా ఉండవచ్చు. ఈ పద్ధతి ఇతర ఎంపికల కంటే చాలా ఖరీదైనది.

తక్కువ ప్రాచుర్యం పొందిన శస్త్రచికిత్సలు

కేన్సర్ చికిత్సకు అంతగా ప్రచారంలో లేని కొన్ని రకాల శస్త్రచికిత్సల్లో ఇవి కూడా ఉన్నాయి.

లేజర్ సర్జరీ-ఇందులో కేన్సర్ కణాలను కాల్చడానికి లేజర్లను ఉపయోగిస్తారు. గర్భాశయ, పాయువు (గుదం) మొదలైన కొన్ని ప్రారంభ దశ కేన్సర్లకు చికిత్స చేయడానికి దీనిని ఉపయోగిస్తారు.

క్రియోథెరపీ-కేన్సర్‌లో ప్రోబ్ (పరిశోధించే పరికరం) చొప్పించబడుతుంది. అత్యంత చల్లని ఉష్ణోగ్రత వద్ద కేన్సర్ కణాలు స్తంభింపజేయబడతాయి.

రేడియోఫ్రీక్వెన్సీ అబ్లేషన్-కేన్సర్‌లో ఒక ప్రోబ్ చొప్పించబడుతుంది, దీని ద్వారా అధిక శక్తి గల రేడియోవేవ్‌లు పంపబడతాయి. ఇవి కేన్సర్ కణాలను వేడి చేసి చంపేస్తాయి.
ఈ పద్ధతులు చాలా పరిమిత సంఖ్యలోని కేన్సర్లకు మాత్రమే ఉపయోగించబడుతున్నాయని గమనించడం ముఖ్యం.

శస్త్రచికిత్స కోసం నిర్ణయం తీసుకున్న తర్వాత ఏం జరుగుతుంది?

వైద్యుడు మరియు రోగి ఒక రకమైన శస్త్రచికిత్స కోసం నిర్ణయించుకున్న తర్వాత, రోగికి కొన్ని రకాల రక్త పరీక్షలతో పాటు చేసే, ఆ ఆపరేషన్ ని రోగి తట్టుకోగలడా లేదా అని అంచనా వేయడానికి మత్తుమందు బృందం, ఇంకా వైద్యులు లేదా కార్డియాలజిస్టుల వంటి ఇతర నిపుణులతో సంప్రదించడం జరుగుతుంది.

కేన్సర్ సర్జరీ చేసే సమయంలో ఏ రకమైన అనస్థీషియాను ఉపయోగిస్తారు?

శస్త్రచికిత్సతో సంబంధం ఉన్న అసౌకర్యాన్నీ, నొప్పినీ తగ్గించడానికి మందులను వాడడమే అనస్థీషియా. అనస్థీషియా అనేక రకాల ఉంటుంది, సాధారణ అనస్థీషియాల గురించి ఈ క్రింద ఇవ్వబడింది.

స్థానిక (లోకల్)

స్థానిక అనస్థీషియా అంటే శస్త్రచికిత్స చేయాల్సిన ప్రాంతంలో మందుని ఇంజెక్ట్ చేయడం. శస్త్రచికిత్స జరిగినపుడు రోగికి ఎలాంటి నొప్పీ రాకుండా ఉండటానికి ఆ మందు ఆ ప్రాంతాన్ని తిమ్మిరి ఎక్కేలా చేస్తుంది. శస్త్రచికిత్స జరిగిన కొద్ది నిమిషాలు లేదా గంటల తర్వాత మందు ప్రభావం తగ్గిపోతుంది.

ప్రాంతీయ

ఈ రకమైన అనస్థీషియాలో, స్థానిక అనస్థీషియా కంటే ఎక్కువ భాగం తిమ్మిరి ఎక్కేలా మందు ఇవ్వబడుతుంది. తేలికపాటి నిద్ర వచ్చేలా చేసే మందులను ప్రాంతీయ అనస్థీషియాతో కూడా ఉపయోగించవచ్చు. ఈ రకమైన అనస్థీషియా ఒక నెర్వ్ (నరాలు) బ్లాక్ లేదా స్పైనల్ (వెన్నెముక) అనస్థీషియా.

జనరల్

ఇది రోగిని ఇంజెక్షన్‌తో నిద్రపోయేలా చేసే ఒక రకమైన అనస్థీషియా. రోగికి ఊపిరి పీల్చుకోవడానికి శ్వాసనాళంలోకి ఒక గొట్టం చొప్పించబడుతుంది. క్యాన్సర్ శస్త్రచికిత్సకు ఉపయోగించే అనస్థీషియాల్లో ఇది అత్యంత సాధారణ రకం.

శస్త్రచికిత్స తరువాత ఏం జరుగుతుంది?

శస్త్రచికిత్స తర్వాత, రోగి కొన్ని రోజులు ఆసుపత్రిలో ఉంటాడు. శస్త్రచికిత్స జరిగిన స్థలంలో సేకరించబడే ఏదైనా ద్రవాన్ని హరించడానికి ఆపరేషన్ ప్రదేశంలో డ్రైన్లు (గొట్టాలు) ఉంచబడతాయి. ద్రవం ప్రవహించడం ఆగిపోయిన కొన్ని రోజుల తరువాత ఇవి తొలగించబడతాయి. రోగి తినడం ప్రారంభించి, తనకు నయంగా ఉన్నట్టు అనిపిస్తే అతడు/ఆమె ఇంటికి డిశ్చార్జ్ చేయబడతారు, అలాగే ఆపరేషన్ సమయంలో వేసిన కుట్లు లేదా సర్జరీ క్లిప్‌లను తొలగింపజేసుకోవడానికి రెండు వారాలలో అవుట్‌ పేషెంట్ క్లినిక్‌ కి వెళ్లాల్సి ఉంటుంది.

సర్జరీ ఫలితం, హిస్టాలజీ రిపోర్టు గురించి సర్జన్ ఆ సందర్శనలో రోగికి వివరిస్తాడు. ఈ రిపోర్టు కేన్సర్ గురించి వివరంగా వివరిస్తుంది, తదుపరి చికిత్స అవసరమా అనే దానిపై మార్గనిర్దేశం చేస్తుంది.

కేన్సర్ శస్త్రచికిత్సలో రావడానికి అవకాశం ఉన్న సమస్యలు ఏమిటి?

ఇతర శస్త్రచికిత్సల మాదిరిగానే, కేన్సర్ శస్త్రచికిత్స కూడా దుష్ప్రభావాలు మరియు సమస్యలతో ముడిపడి ఉంటుంది. వీటిలో చాలావరకు చేయబడుతున్న శస్త్రచికిత్స రకానికి ప్రత్యేకమైనవి కాని శస్త్రచికిత్సతో సంబంధం ఉన్న కొన్ని సాధారణ సమస్యల్లో ఇవి కూడా ఉన్నాయి-

సంక్రమణ (ఇన్ఫెక్షన్)

సంక్రమణ అనేది ఏదైనా శస్త్రచికిత్సతో సంబంధం ఉన్న ఒక ముఖ్యమైన సమస్య. ఆపరేట్ చేసిన ప్రాంతంలో గానీ లేదా ఊపిరితిత్తులు లేదా మూత్ర మార్గము వంటి ఇతర ప్రాంతాలలో గానీ సంక్రమణ సంభవిస్తుంది. సాధారణంగా, సంక్రమణ ప్రమాదాన్ని తగ్గించడానికి శస్త్రచికిత్సకు ముందూ, చేస్తున్న సమయంలోనూ, శస్త్రచికిత్స చేసిన తరువాత కూడా తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ తీసుకుంటారు.

నొప్పి

నొప్పి అనేది శస్త్రచికిత్స చేసినపుడు కలిగే సాధారణ దుష్ప్రభావం. కానీ మంచి పెయిన్ కిల్లర్స్ తో నియంత్రించవచ్చు.

రక్తం కోల్పోవడం

శస్త్రచికిత్స సమయంలో పోయే రక్తం సాధారణంగా చాలా తక్కువగానే ఉంటుంది, కానీ కొన్నిసార్లు శస్త్రచికిత్స సమయంలో గానీ లేదా తరువాత గానీ రక్త మార్పిడి అవసరం.