Chemotherapy

కెమోథెరపీ

కెమోథెరపీ అంటే ఏమిటి?

కెమోథెరపీ అంటే కేన్సర్‌కు చికిత్స చేయడానికి మాత్రలు, ఇంజెక్షన్లు, డ్రిప్స్ రూపంలో మందులను వాడడం. ఈ డ్రగ్స్ ని సింగిల్ ఏజెంట్లు లేదా వాటి కాంబినేషన్లలో ఇస్తారు.

కెమోథెరపీ ఎలా పనిచేస్తుంది?

వివిధ కెమోథెరపీ మందులు కేన్సర్ కణాలను చంపడానికి వివిధ మార్గాలను కలిగి ఉంటాయి. ఉదాహరణకు, కొన్ని మందులు కణ కుడ్యాన్ని (గోడ) దెబ్బతీస్తాయి, మరికొన్ని కణాల పెరుగుదలను ఆపివేస్తాయి. మరికొన్ని కణాలు DNA ని దెబ్బతీసి కణాల మరణానికి కారణమవుతాయి.

కెమోథెరపీ ఎంత తరచుగా ఇవ్వబడుతుంది?

కెమోథెరపీని సైకిల్స్ లో ఇస్తారు. ఒక సాధారణ సైకిల్ మూడు వారాలు ఉంటుంది. కానీ అది ప్రతి వారం లేదా ప్రతి రెండు లేదా నాలుగు వారాలు ఉండవచ్చు. సాధారణంగా ఇటువంటి 4-6 సైకిల్స్ ని ఉపయోగిస్తారు. ఉదాహరణకు, ఒక సైకిల్ ప్రతి 3 వారాలూ అయితే, అలా 6 సైకిల్స్ అవసరమైతే, ఆ కెమోథెరపీ 18 వారాలు లేదా 4.5 నెలలు ఉంటుంది. దీనిని కోర్సుగా పిలుస్తారు.

కెమోథెరపీ ఇవ్వడానికి ఎంత సమయం పడుతుంది?

కెమోథెరపీ ఇచ్చే వ్యవధి ఏ రకమైన మందులు వాడుతున్నారనే అంశం మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని మందులు ఒక నిమిషం కన్నా తక్కువ సమయం తీసుకుంటాయి, మరికొన్ని ఒక గంట నుండి కొన్ని గంటల వరకు ఇవ్వబడతాయి. కొన్ని కెమోథెరపీ షెడ్యూల్స్‌లో నిరంతర డ్రగ్ ఇన్ఫ్యూజన్ అనేక వారాల పాటు ఉంటుంది.

కెమోథెరపీని ఎప్పుడు ఉపయోగిస్తారు?

కెమోథెరపీని కేన్సర్ చికిత్స ప్రక్రియలో వివిధ దశలలో ఉపయోగించవచ్చు. మొదట, బయాప్సీతో కేన్సర్ నిర్ధారణ నిర్ధారించబడుతుంది. ఆ తరువాత స్కాన్లతో సహా అన్ని పరీక్షల ఫలితాల ఆధారంగా కేన్సర్ దశ నిర్ణయించబడుతుంది. కేన్సర్ రకం, రోగి ఫిట్నెస్ కేన్సర్ దశ ఆధారంగా చికిత్స ఎంపికలు చేయబడతాయి. కేన్సర్ సాధారణంగా నయమయ్యే స్వభావం కలిగినదా లేదా అనే విషయం సర్వసాధారణంగా నిర్ణయించబడుతుంది.

నయం చేయగల అవకాశాలున్న కేన్సర్

ఇలాంటి కేసుల్లో, కేన్సర్ కోసం అందించే చికిత్స రోగాన్ని పూర్తిగా నయం చేసే అవకాశం ఉంది. ఈ సెట్టింగ్ లో, కెమోథెరపీని ఈ క్రింది మార్గాల్లో ఉపయోగిస్తారు.

నియో-అడ్జువెంట్ – ఇది కేన్సర్‌ కి శస్త్రచికిత్స లేదా రేడియోథెరపీ వంటి ఖచ్చితమైన చికిత్స చేసే ముందు కెమోథెరపీని ఉపయోగించే ఒక సెట్టింగ్. కెమోథెరపీ ప్రయోజనం ఖచ్చితంగా చేయబోయే చికిత్స ప్రభావాన్ని పెంచడం.

అడ్జువెంట్ – శస్త్రచికిత్స లేదా రేడియోథెరపీ వంటి ఖచ్చితమైన చికిత్స చేసిన తర్వాత ఇందులో కెమోథెరపీని ఉపయోగిస్తారు. అయితే, ఇందులో ఖచ్చితమైన చికిత్స ప్రభావాన్ని పెంచడమే కెమోథెరపీ ప్రయోజనం.

కంకరెంట్ (ఏకకాలిక)-ఇందులో కెమోథెరపీని ఖచ్చితమైన చికిత్స ఇచ్చే సమయంలోనే ఇస్తారు, సాధారణంగా ఇది రేడియోథెరపీయే అవుతుంది. ఈ రకమైన చికిత్సను కంకరెంట్ కెమో రేడియోథెరపీ అంటారు.

కెమోథెరపీ ఒక్కటే- రక్తం లేదా శోషరస వ్యవస్థలో ఉత్పన్నమయ్యే కొన్ని కేన్సర్లను కెమోథెరపీతో చికిత్స చేస్తారు. ఈ కేసుల్లో ఈ చికిత్సే చాలా ముఖ్యమైనది లేదా ఇంకోలా చెప్పాలంటే, ఇదొక్కటే చికిత్సా విధానం.

నయం చేయలేని కేన్సర్

4 వ దశలో ఉన్న కేన్సర్లు లేదా నయం చేయలేని కేన్సర్ల కేసుల్లో కేన్సర్‌ను నియంత్రించడానికీ, లక్షణాలను మెరుగుపరచడానికీ జీవితకాలాన్ని పొడిగించడానికీ కెమోథెరపీ చాలా ముఖ్యమైన ఆప్షన్ ని అందిస్తుంది. ఈ కెమోథెరపీ రూపాన్ని పాలియేటివ్ కెమోథెరపీ అని పిలుస్తారు. నయం చేయడం సాధ్యం కానందున దీని లక్ష్యం నయం చేయడం కాదు.

కెమోథెరపీ తీసుకోవడానికి నాకు సెంట్రల్ లైన్ చొప్పించాల్సిన అవసరం ఉందా?

సాధారణంగా, కెమోథెరపీని చేతి వెనుక లేదా ముంజేతిపై సిర (వెయిన్) కి ఇస్తారు. సిరలు దొరకడం కష్టంగా ఉన్న పరిస్థితుల్లో లేదా కెమోథెరపీ కోర్సు చాలా కాలం సాగించాల్సి ఉన్నప్పుడు లేదా కెమోథెరపీ కంటిన్యువస్ (నిరంతర) ఇన్ఫ్యూషన్ అవసరమైనప్పుడు, సులభంగా చికిత్స అందించడానికి ఒక సెంట్రల్ లైన్ ని ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. క్లుప్తంగా ఈ క్రింద వివరించిన వివిధ రకాలైన లైన్స్ ఉండవచ్చు. మరిన్ని వివరాల కోసం, కెమోథెరపీ లైన్స్ లో తరచుగా అడిగే ప్రశ్నలు చూడండి.

కెమోథెరపీ దుష్ప్రభావాలు ఏమిటి?

కెమోథెరపీలో అనేక మందులు ఉంటాయి. ప్రతి మందూ వేర్వేరు దుష్ప్రభావాలను కలిగిస్తుంది. ఇచ్చే కెమోథెరపీ రకంపై రోగి అనుభవించే దుష్ప్రభావాలు ఆధారపడి ఉంటాయి. అనేక రకాల మందుల వల్ల కలిగే కొన్ని సాధారణ దుష్ప్రభావాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి. నిర్దిష్ట ఔషధాల దుష్ప్రభావాల గురించి తెలుసుకోవడానికి దయచేసి ఉపయోగించిన మందు ఉత్పత్తుల కరపత్రాన్ని చూడండి.

వికారం మరియు వాంతులు- వాంతులు కెమోథెరపీ వల్ల కలిగే దుష్ప్రభావమే. అందువల్ల ఈ దుష్ప్రభావాన్ని నివారించడానికి కెమోథెరపీకి ముందు మంచి మందులు ఇవ్వబడతాయి. వాంతులు రాకుండా ఉండడానికి కెమోథెరపీ తర్వాత కొన్ని రోజుల పాటు మాత్రలు తీసుకోవాలి.

జుట్టు రాలడం-ఇది కొన్ని కెమోథెరపీ మందుల వల్ల సాధారణంగా కలిగే దుష్ప్రభావం. అది జరిగే అవకాశం ఉంటే మీ డాక్టర్ మీకు వివరిస్తారు. జుట్టు రాలడం సంభవిస్తే, 1 వ కెమోథెరపీ సైకిల్‌ జరిగిన తర్వాత 2 వ మరియు 3 వ వారాల్లో జరుగుతుంది. కెమోథెరపీ పూర్తయిన తర్వాత జుట్టు మామూలుగా పెరుగుతుంది.

సంక్రమణ ప్రమాదం- కెమోథెరపీ రక్తం (తెల్ల రక్త కణాలు) లోని కణాల సంఖ్యను తగ్గిస్తుంది. అందువల్ల, చికిత్స సమయంలో సంక్రమణ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. రోగికి 100 F కంటే ఎక్కువ జ్వరం వచ్చినా లేదా అనారోగ్యంగా అనిపించినా, అంటువ్యాధులు త్వరగా పెరిగే అవకాశం ఉన్నందున రోగి అత్యవసరంగా వైద్య సలహా తీసుకోవాలి.

రక్తస్రావ ప్రమాదం- కెమోథెరపీ తర్వాత, తెల్ల రక్త కణాల మాదిరిగానే ప్లేట్‌లెట్స్ అని పిలవబడే రక్తంలోని ఇతర కణాలు కూడా తగ్గుతాయి. ఇది రక్తస్రావ ప్రమాదాన్ని పెంచుతుంది. అందువల్ల ఏదైనా రక్తస్రావం లక్షణాలు కనిపిస్తే, అత్యవసరంగా వైద్యుడికి నివేదించాలి.

రక్తహీనత – ఎనీమియాగా పిలవబడే రక్తంలో హిమోగ్లోబిన్ (హెచ్‌బి) తగ్గే లక్షణం కెమోథెరపీ దుష్ప్రభావం.

రుచి కోల్పోవడం- కెమోథెరపీ నాలుకపై రుచి మొగ్గల సంఖ్యను తగ్గిస్తుంది, అందువల్ల ఆహారం మునుపటిలా రుచిగా అనిపించదు. ఇది ఆకలిని తగ్గిస్తుంది, తినడం చాలా కష్టంగా ఉంటుంది.

అలసట, బలహీనత-ఇది కెమోథెరపీ వల్ల కలిగే సాధారణ దుష్ప్రభావం. ఉపయోగించే మందులు, రోగి ఫిట్‌నెస్‌ లను బట్టి ఇవి వివిధ రకాలుగా ఉంటాయి.

నెలసరిపై ప్రభావం-కెమోథెరపీ ఇచ్చిన మహిళలకు నెలసరి తాత్కాలికంగా గానీ లేదా శాశ్వతంగా గానీ ఆగిపోతుంది. మెనోపాజ్ కి దగ్గరగా ఉన్న వయసు మీరిన మహిళలకి నెలసరి శాశ్వతంగా ఆగిపోతుంది. యవ్వనంలో ఉన్న మహిళల్లో, నెలసరి తాత్కాలికంగా ఆగిపోవచ్చు. కానీ ఇవి కెమోథెరపీని పూర్తి చేసిన కొద్ది నెలల్లో తిరిగి రావచ్చు.

సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గడం- కెమోథెరపీ వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది, అంటే అది ఇచ్చినట్లయితే తరువాత బిడ్డ పుట్టే అవకాశాలు బాగా తగ్గుతాయి. అందువల్ల, ఇంకా సంతానం కనని రోగులకు కెమోథెరపీ చేయాల్సిన అందుబాటులో ఉన్న ఎంపిక (ఆప్షన్) లను చర్చించడానికి సంతానోత్పత్తి నిపుణుడిని చూడాలి. సంతానోత్పత్తి సంరక్షణ ఎంపికల్లో పురుషుడి విషయంలో అయితే స్పెర్మ్ బ్యాంకింగ్ ఉన్నాయి. చికిత్స ప్రారంభించడానికి ముందు వీర్యం సేకరించి నిల్వ చేయబడుతుంది. మహిళల ఎంపికల్లో అయితే, ఓసైట్స్ (గుడ్డు) నిల్వ లేదా పిండాల నిల్వ ఉన్నాయి.

డ్రగ్ ఆధారిత దుష్ప్రభావాలు- సంభవించే కొన్ని దుష్ప్రభావాలు కెమోథెరపీగా ఉపయోగించే మందుల రకాన్ని బట్టి ఉంటాయి, వాటిల్లో సర్వసాధారణమైనవి ఈ క్రింద ఇవ్వబడ్డాయి.

ప్లాటినం మందులు- సిస్ప్లాటిన్, కార్బోప్లాటిన్ వంటి ప్లాటినం మందులు మూత్రపిండాలను ప్రభావితం చేస్తాయి. మూత్రపిండాల పనితీరును పర్యవేక్షించే విధుల్ని పనిచేయకుండా చేస్తాయి. సిస్ప్లాటిన్ వల్ల వినికిడి తగ్గుతుంది. ఆక్సాలిప్లాటిన్ చేతులు, కాళ్ళలో జలదరింపు, తిమ్మిరి, మంటతో కూడిన దురదలకు దారితీసే న్యూరోపతికి కారణమవుతుంది.

టాక్సేన్స్-డోసెటాక్సెల్, పాక్లిటాక్సెల్ వంటి సాధారణ టాక్సేన్ మందులు ఇది చేతులు, కాళ్ళలో జలదరింపు, తిమ్మిరి, మంటతో కూడిన దురదలను పెంచే న్యూరోపతికి కారణమవుతుంది. ఇవి మ్యూకోసిటిస్ కూడా దారితీయవచ్చు, దాంతో నోటిలో పుండ్లు పడటం, కడుపు నొప్పి, నీళ్ల విరేచనాలు కూడా రావచ్చు. జుట్టు రాలడం, గోళ్ళలో మార్పులు సంభవించడం కూడా జరుగుతుంది.

కాపెసిటాబైన్ ఫ్లోరోరాసిల్- ఇవి సాధారణంగా వాడే మందులు. నోటిలో పుండ్లు పడటం, నీళ్ల విరేచనాలు, చేతులు, కాళ్ల మీద పుండ్లు పడటం, చర్మం పొడిబారడం, చర్మం పగుళ్లు ఏర్పడతాయి.

ఆంత్రాసైక్లిన్స్- ఈ మందులు దీర్ఘకాలికంగా గుండెను ప్రభావితం చేస్తాయి. ఈ మందులు వాడిన ఎవరైనా వారి గుండె పనితీరు సరిగా ఉందో లేదో తెలుసుకోవడానికి, ఎకోకార్డియోగ్రామ్, ఇసిజి తీయించుకోవాలి.

కెమోథెరపీకి ఎంత ఖర్చవుతుంది?

కెమోథెరపీలో టాబ్లెట్లు, ఇంజెక్షన్లు, డ్రిప్స్ తో సహా వివిధ రూపాల్లో ఇచ్చే అనేక మందులు ఉన్నాయి. ఉపయోగించే ఈ ఔషధాల్లో ప్రతిదానికీ ఒక ధర ఉంటుంది. ఈ ఔషధాల్లో కొన్నింటి ధర చాలా తక్కువగా, రూ.100 కన్నా తక్కువగా ఉంటుంది. మరికొన్ని మందులకి రూ.100,000 లేదా అంతకంటే ఎక్కువ ధర కూడా ఉండవచ్చు. అందువల్ల, కెమోథెరపీ చికిత్స ఖర్చు, కేన్సర్ చికిత్సకు ఉపయోగించే మందుల మీద ఆధారపడి ఉంటుంది. ఔషధాల ధరతో పాటు, బెడ్ ఛార్జీలు, నర్సింగ్ ఛార్జీలు, డాక్టర్ ఛార్జీలు వంటి ఇతర ఛార్జీలు కూడా చేర్చబడతాయి. చికిత్స ప్రారంభించే ముందు కెమోథెరపీ ప్రతి సైకిల్‌ కీ సుమారుగా అయ్యే ఖర్చు గురించి డాక్టర్ ని అడగడం చాలా ముఖ్యం.

కెమోథెరపీ సమయంలో సంభవించే ఇతర ఖర్చులను పరిగణనలోకి తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. చికిత్స ఏదైనా దుష్ప్రభావాలను మేనేజ్ చేయడానికి ఆసుపత్రిలో అడ్మిట్ చేయాల్సి వస్తే, దానికి సంబంధించిన ఖర్చులు కూడా వీటిలో చేర్చే ఉన్నాయి.

కెమోథెరపీ పనిచేస్తుందో లేదో నాకు ఎలా తెలుస్తుంది?

సాధారణంగా రెండు లేదా మూడు సైకిల్స్ చికిత్స తర్వాత ఒక స్కాన్ తీయడం జరుగుతుంది. దీన్ని చికిత్స ప్రారంభానికి ముందు తీసిన స్కాన్‌తో పోల్చబడుతుంది. ఈ చికిత్స పనిచేస్తుందో లేదో చెప్పడానికి ఇది మాకు సహాయపడుతుంది. రొమ్ము, ప్రోస్టేట్, అండాశయం, పెద్దప్రేగు లేదా ప్యాంక్రియాటిక్ కేన్సర్ వంటి కొన్ని కేన్సర్లలో ట్యూమర్ (కణితి) మార్కర్ రక్త పరీక్షలు ఉన్నాయి, ఇవి కేన్సర్ చికిత్సకు ప్రతిస్పందిస్తున్నాయా లేదా అనే విషయాన్ని కూడా తెలియజేస్తాయి.