How is Treatment for Cancer Decided ?

కేన్సర్ కి చికిత్స ఎలా నిర్ణయించబడుతుంది?

కేన్సర్ కోసం అనేక చికిత్సా ఎంపికలు ఉన్నాయి. శస్త్రచికిత్స, రేడియోథెరపీ, కెమోథెరపీ, బయోలాజికల్ థెరపీ, ఇమ్యునోథెరపీ, సపోర్టివ్ కేర్ తో సహా చికిత్సలో అత్యంత సాధారణ ఎంపికలు ఉన్నాయి. కొన్ని నిర్దిష్ట కేన్సర్ సెట్టింగ్ లలో ఉపయోగించే చికిత్సలో ఇతర ఎంపికలు చాలా ఉన్నాయి.

రోగికి ఏ చికిత్స లేదా చికిత్స కాంబినేషన్ చాలా సముచితమో నిర్ణయించే కారకాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి. ఇది ఆంకాలజిస్ట్ నిర్ణయం తీసుకునే ప్రక్రియకు ఒక సరైన ఆలోచన కలగజేస్తుంది.

బయాప్సీ ఫలితం

బయాప్సీ ఫలితం కేన్సర్ ఉనికినీ, ఊపిరితిత్తుల కేన్సర్, రొమ్ము కేన్సర్ వంటి కేన్సర్ రకాన్నీ నిర్ధారిస్తుంది. ఆ ఫలితం ఆ కేన్సర్ రకం గురించీ, అలాగే ఏదైనా మాలిక్యులర్ (పరమాణు) లేదా జెనెటిక్ (జన్యు) మార్పుల గురించి కూడా తెలియజేస్తుంది. చికిత్స గురించి నిర్ణయం తీసుకోవడానికి ఈ ఫలితాలన్నీ చాలా ముఖ్యమైనవి.

కేన్సర్ దశ

ఈ వెబ్‌సైట్‌లో వివరంగా చర్చించినట్లుగా, ప్రతి కేన్సర్‌ కీ, అది ఉన్న స్థానాన్ని బట్టీ, శరీరంలో అది వ్యాప్తి చెందుతున్న విధానం ఆధారంగానూ ఒక స్టేజి నిర్ణయించబడుతుంది. చాలా కేన్సర్లు 1 స్టేజి నుండి 4 స్టేజి వరకు ఇవ్వబడతాయి. ఇందులో 4 వ దశ చాలా ముదిరిపోయిన దశ లేదా మెటాస్టాటిక్ దశ. చికిత్స ఎంపికలను నిర్ణయించడంలో కేన్సర్ స్టేజి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

రోగి పనితీరు స్థితి

కేన్సర్ చికిత్సను నిర్ణయించేటప్పుడు రోగి ఫిట్నెస్ చాలా ముఖ్యమైన అంశాల్లో ఒకటి. రోగి ఎంత ఫిట్ గా ఉంటే, ఆ చికిత్సకి మరిన్ని ఎంపికలు పరిగణించబడతాయి. రోగి పనితీరు స్థితిని అంచనా వేయడం ద్వారా ఈ ఫిట్‌నెస్ అంచనా వేయబడుతుంది. WHO, ECOG కర్నోఫ్స్కీ వంటి విభిన్న స్కోరింగ్ వ్యవస్థలు ఈ ప్రక్రియలో సహాయపడతాయి. WHO స్కోరింగ్ విధానం క్రింద ఇవ్వబడింది.

WHO పనితీరు స్థితి

గ్రేడ్ కార్యాచరణ వివరణ
0 రోగి పూర్తిగా చురుకుగా ఉన్నాడు, రోగం రాకముందు ఉన్న పనితీరు అంతటినీ ఎలాంటి పరిమితీ లేకుండా కొనసాగించగలడు
1 రోగి శారీరకంగా పరిశ్రమ చేస్తుంటే అలిసిపోతున్నాడు. కానీ కదలడం మరియు చిన్న, తేలికపాటి పనులు చేయగలుగుతున్నాడు లేదా ఇంటి పని గానీ, ఆఫీసు పని గానీ ఉత్సాహం లేకుండా నిర్వహించగలడు.
2 నడుస్తున్నాడు (అంబులేటరీ), తన పనులు తాను చూసుకోగలడు, కానీ పనులకి సంబంధించిన ఎలాంటి కార్యకలాపాలూ చేయలేడు. రోగి 50% కంటే ఎక్కువ గంటలు మేల్కొని ఉంటున్నాడు.
3 ​మంచం లేదా కుర్చీకి పరిమితమై తన సంరక్షణ మాత్రం చూసుకోగల సామర్థ్యం ఉంది, 50% కంటే ఎక్కువ గంటలు మేల్కొని ఉంటున్నాడు.
4 బొత్తిగా ఏమీ చేయలేకపోతున్నాడు. తన సంరక్షణని తాను చూసుకోలేడు. పూర్తిగా మంచం లేదా కుర్చీకి పరిమితమై ఉన్నాడు.

పనితీరు స్థితి 3 లేదా 4 ఉన్న రోగులకు, కేన్సర్ దశతో సంబంధం లేకుండా పరిమితమైన చికిత్స ఎంపికలు ఉన్నాయి.

ఇతర అనారోగ్యాలు

రోగికి ఉన్న ఇతర అనారోగ్యాలపై కూడా చికిత్స ఎంపికలపై నిర్ణయం ఆధారపడి ఉంటుంది. సాధారణంగా వీటిలో గుండె జబ్బులు, మూత్రపిండాలు, కాలేయం, మధుమేహం లేదా ఇతర వ్యాధులు ఉన్నాయి. ఎందుకంటే ఈ పరిస్థితులు కేన్సర్ చికిత్సలను మరింత విషపూరితంగానూ, కష్టతరంగానూ చేస్తాయి.

రోగి ఎంపిక

చికిత్స నిర్ణయాలు తీసుకోవడంలో రోగి ఎంచుకునే ఎంపిక చాలా కీలకమైన పాత్రని పోషిస్తుంది. కేన్సర్ చికిత్సలో రెండు వేర్వేరు ఎంపికలు ప్రభావంలో చాలా పోలి ఉంటాయి కానీ దుష్ప్రభావాల్లో భిన్నంగా ఉంటాయి. ఆ పరిస్థితుల్లో, తమకు ఏ ఎంపిక బాగా సరిపోతుందో రోగి స్వయంగా నిర్ణయించాల్సి ఉంటుంది. డాక్టర్ మరియు కుటుంబం మార్గదర్శక సూచనలతో ఇది జరుగుతుంది. కొంతమంది రోగులు తమ కేన్సర్‌కు ఎటువంటి చికిత్సా చేయించుకోకూడదని ఎంచుకుంటారు. మరికొందరు ఫలితాలతో సంబంధం లేకుండా అన్ని ఎంపికలనూ అనుసరించాలని కోరుకుంటారు. అందువల్ల, చికిత్సను నిర్ణయించేటప్పుడు వైద్యులు రోగి ఎంపికను పరిగణనలోకి తీసుకుంటారు.

ఆర్థిక వ్యవహారాలు, ఖర్చుల ప్రభావం

చికిత్స ఖర్చుని బట్టి ఏ చికిత్సని ఎంచుకోవాలో నిర్ణయించుకోవచ్చు. కొన్ని చికిత్స ఎంపికలు, ముఖ్యంగా ఫీజు చెల్లించే రోగులకు, ఇతర ఎంపికల కన్నా ఖరీదైనవి. చికిత్సల ఎంపికలు చేసేటప్పుడు కొంచెం తక్కువ ఖర్చు అయ్యే ఎంపికల్ని పరిగణించడం జరుగుతుంది.