Radiotherapy

రేడియోథెరపీ తరచుగా అడిగే ప్రశ్నలు

రేడియోథెరపీ అంటే ఏమిటి?

రేడియోథెరపీ అంటే కేన్సర్ కణాలను చంపడానికి ఇచ్చే హై ఎనర్జీ ఎక్స్-రేలని ఉపయోగించడం. ఈ ఎక్స్ రేలు కేన్సర్ కణాల DNA కి నష్టం కలిగించడం ద్వారా వాటిని చంపుతాయి. రేడియోథెరపీ అనేది స్థానిక చికిత్స. అది ఏ ప్రాంతానికి ఇస్తే అక్కడ దాని ప్రభావం కలిగి ఉంటుంది. రేడియోథెరపీ వివిధ రకాలు. రేడియోథెరపీ ప్రామాణిక రూపం క్రింది చిత్రంలో చూపిన విధంగా ఒక లీనియర్ యాక్సిలరేటర్ అని పిలవబడే యంత్రం ద్వారా అందించబడుతుంది. ఈ రకమైన యంత్రం రెండు రకాల కిరణాలను అందిస్తుంది. ఒకటి ఫోటాన్లు అని పిలవబడే అధిక శక్తి ఎక్స్-రేలు మరొకటి ఎలక్ట్రాన్లు. కోబాల్ట్ -60 అనే యంత్రం గామా కిరణాలను అందించే మరొక రకమైన రేడియోథెరపీ యంత్రం. ఈ యంత్రాలు ఇప్పుడు అంత సాధారణంగా వాడబడడం లేదు. ప్రోటాన్ థెరపీ మెషిన్ కూడా రేడియోథెరపీ యంత్రమే. అయితే కేన్సర్‌కు చికిత్స చేయడానికి ఉపయోగించే ప్రోటాన్‌లను అందిస్తుంది. వీటన్నింటినీ ఎక్స్టర్నల్ బీమ్ రేడియోథెరపీ అంటారు.

రేడియోథెరపీ మరొక రూపం బ్రాకీథెరపీ. ఇందులో రేడియోయాక్టివ్ సోర్సెస్ (వనరులు)శరీరం కుహరాల్లోకీ లేదా కేన్సర్లలోకీ ఇన్సర్ట్ చేయబడతాయి. ఈ రేడియోయాక్టివ్ వనరులైన అయోడిన్ 125 (I125), సీసియం 137, ఇరిడియం లేదా ఇతరాలు విత్తనాలు, పిన్స్, వైర్లు మొదలైన రూపాల్లో లభిస్తాయి, వీటిని ఇన్సర్ట్ చేయడానికి ఉపయోగిస్తారు.
రేడియోథెరపీని ఫ్రాక్షన్లుగా పిలవబడే మోతాదుల్లో ఇస్తారు. ఒక ఫ్రాక్షన్ అంటే ఒక రేడియోథెరపీ చికిత్స మోతాదు. ఇది కొన్ని నిమిషాలపాటు జరుగుతుంది. సాధారణంగా, ఈ ఫ్రాక్షన్లు వారానికి 5 రోజులు ఇస్తారు. కొన్నిసార్లు రోజుకు రెండు ఫ్రాక్షన్లు ఇవ్వబడతాయి. రేడియోథెరపీ కోర్సులో అనేక ఫ్రాక్షన్లు ఉండవచ్చు. కొన్ని కోర్సులు ఏడు వారాల వరకు ఉంటాయి.

రేడియోథెరపీ ఎలా పనిచేస్తుంది?

ప్రామాణిక రేడియోథెరపీ మెషిన్ (లీనియర్ యాక్సిలరేటర్) నుండి ఉత్పత్తి చేయబడిన అధిక శక్తి ఎక్స్-రేలు కేన్సర్ కణాల్లో DNA కి నష్టం కలిగించడం ద్వారా ఆ కణాలను చంపుతాయి. శరీరంలోని సాధారణ కణాలు రేడియోథెరపీ ద్వారా కూడా దెబ్బతింటాయి కాని కేన్సర్ కణాల కంటే మరమ్మత్తు చేసుకుని, తిరిగి కోలుకునే మంచి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. రేడియోథెరపీ వల్ల సాధారణ కణాల నశించడం వల్ల రేడియోథెరపీ దుష్ప్రభావాలకు కారణమవుతుంది.

రేడియోథెరపీ రకాలు ఏంటి?

రేడియోథెరపీ (ఎక్స్టర్నల్ బీమ్) అవసరాన్ని బట్టి అందుబాటులో ఉన్న యంత్ర మరియు సాంకేతిక రకాన్ని బట్టి వివిధ మార్గాల్లో ఇవ్వవచ్చు. కేన్సర్‌కు చికిత్స చేయడంలోనూ, దుష్ప్రభావాలను పరిమితం చేయడంలోనూ కొన్ని పద్ధతులు మిగతా వాటి కన్నా మంచివి. వీటి గురించి క్లుప్తంగా ఈ క్రింద వివరించబడింది.

3D కన్ఫర్మల్ రేడియోథెరపీ

రేడియోథెరపీని ప్లాన్ చేయడానికీ, ఇవ్వడానికీ ఇది ఒక మార్గం. ఇందులో కేన్సర్ 3D చిత్రాన్ని తీయడానికి CT, MRI స్కాన్‌లను ఉపయోగిస్తారు. ఇది ప్లాన్ ప్రక్రియను మూడు కోణాల్లో చేయడానికి వీలు కల్పిస్తుంది.
ఇది రేడియేషన్ చికిత్సను ప్రామాణిక 2 డి రేడియోథెరపీ కంటే ఖచ్చితంగా ఉండేలా చూస్తుంది. 3 డి కన్ఫర్మల్ రేడియోథెరపీ ఈ రోజుల్లో ఈ చికిత్సకి సాధారణ కనీస ప్రమాణం.

ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియోథెరపీ (IMRT)

IMRT అనేది ఒక రకమైన 3D కన్ఫర్మల్ ట్రీట్మెంట్ ప్లానింగ్ మరియు డెలివరీ పద్ధతి. ఇందులో రేడియేషన్ కిరణాలు కణితి ఆకారానికి తగినట్లుగా ఖచ్చితమైన ఆకారంలో ఉంటాయి. శరీరంలోని సాధారణ నిర్మాణాలకు కలిగే దుష్ప్రభావాలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. IMRT మరియు 3D కన్ఫర్మల్ రేడియోథెరపీకీ మధ్య గల తేడా ఏమిటంటే, IMRT కేన్సర్‌ను మరింత ఖచ్చితంగా లక్ష్యంగా చేసుకొని దుష్ప్రభావాలను తగ్గిస్తుంది. అలాగే, IMRT తో ఒకే కణితిలోని వివిధ భాగాలకు రేడియోథెరపీ యొక్క వివిధ మోతాదులను అందించే అవకాశం ఉంది. వివిధ కోణాల నుండి ట్యూమర్ మీద రేడియేషన్ కిరణాలను ఉపయోగించడం ద్వారా IMRT జరుగుతుంది.

ఆర్క్ ఆధారిత చికిత్స

ఆర్క్ బేస్డ్ థెరపీ (Rapid Arc, VMAT) అనేది రేడియోథెరపీని డెలివరీ చేసే థెరపీ. ఇది లీనియర్ యాక్సిలరేటర్ తో ఆర్క్ మాదిరిగా రోగి చుట్టూ తిరుగుతుంది. ఈ రకమైన చికిత్స కూడా IMRT యే. కానీ కొన్ని సందర్భాల్లో ప్రామాణిక IMRT కన్నా ఖచ్చితమైనది. ఆర్క్ బేస్డ్ థెరపీ ప్రామాణిక IMRT కన్నా చాలా వేగంగా అందించబడుతుంది అందువల్ల రోగికి ప్రతి రోజూ చికిత్సా వ్యవధి చాలా తక్కువగా ఉంటుంది.

స్టీరియోటాక్టిక్ బాడీ రేడియోథెరపీ (SBRT) లేదా SABR (స్టీరియోటాక్టిక్ అబ్లేటివ్ రేడియోథెరపీ)

ఇది రేడియోథెరపీ క్రొత్త సాంకేతికత. ఇది ప్రారంభ దశలో ఊపిరితిత్తుల కేన్సర్లు కాలేయం, ప్రోస్టేట్, ప్యాంక్రియాస్, ఇంకా ఇతర కేన్సర్లకు చికిత్స చేయడానికి ఉపయోగించబడుతోంది. వెన్నెముక లేదా ఇతర ప్రాంతాల్లో పునరావృతమయ్యే కేన్సర్లకు చికిత్స చేయడానికి కూడా ఇది ఉపయోగించబడుతోంది. చికిత్సలో చాలా అధునాతన రేడియేషన్ ప్లానింగ్ టూల్స్ రేడియోథెరపీ యంత్రాలను ఉపయోగించడం జరుగుతుంది.l ఫలితంగా, రేడియోథెరపీ అందించే ప్రక్రియ అత్యంత ఖచ్చితంగా ఉంటుంది. అంకాలజిస్ట్ కణితికి చాలా ఎక్కువ మోతాదులో రేడియేషన్ ఇవ్వడానికి వీలు కల్పిస్తుంది. అదే సమయంలో చుట్టుపక్కల ఉన్న సాధారణ అవయవాలకు దుష్ప్రభావాలను తగ్గిస్తుంది. ప్రామాణిక రేడియోథెరపీకి 6 నుండి 7 వారాలతో పోలిస్తే SBRT తో ఊపిరితిత్తుల కేన్సర్‌లో చికిత్స వ్యవధి చాలా తక్కువగా ఒకటి నుండి రెండు వారాల వరకు ఉంటుంది.

ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ (IGRT)

ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ అంటే చికిత్స ఖచ్చితత్వాన్ని పర్యవేక్షించడానికి ఎక్స్-రేలు లేదా సిటి స్కానర్లు వంటి ఇమేజింగ్ వ్యవస్థలను ఉపయోగించడం. సాధారణంగా, ప్రామాణిక 3D కన్ఫర్మల్ రేడియోథెరపీలో, ప్లాన్ చేసుకునేందుకు, చికిత్స ప్రారంభించడానికి ముందు CT స్కాన్ చేయబడుతుంది. చికిత్స జరుగుతున్నపుడు చికిత్స ఖచ్చితత్వం మెగావోల్టేజ్ ఎక్స్-కిరణాలతో ఎప్పటికప్పుడు వెరిఫై చేయబడుతుంది. IGRT లో, చికిత్స ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి ప్రతి రేడియోథెరపీ చికిత్సకు ముందు CT స్కాన్ లేదా కిలోవోల్టేజ్ ఎక్స్-రే చేయవచ్చు. చాలా ఖచ్చితమైనదిగా ఉండటం వల్ల, చికిత్స దుష్ప్రభావాలు తక్కువగా ఉంటాయి, లక్ష్యాన్ని కోల్పోవడం జరగదు మరియు కేన్సర్‌ను చంపడానికి రేడియోథెరపీ అధిక మోతాదును అందించవచ్చు.

టోమోథెరపీ

టోమోథెరపీ అనేది టోమోథెరపీ అని పిలవబడే ఒక నిర్దిష్ట రకం యంత్రంతో ఇవ్వబడే ఎక్స్టర్నల్ బీమ్ రేడియోథెరపీ. ఇది అత్యంత అధునాతన లీనియర్ యాక్సిలరేటర్‌కు మరీ భిన్నంగా ఉండదు. టోమోథెరపీ యంత్రం IMRT మరియు IGRT చికిత్సలను చేయగలదు.

సైబర్‌నైఫ్

ఒక సైబర్‌నైఫ్ మెషీన్ యాక్సిలరేటర్ లాంటి ఎక్స్టర్నల్ బీమ్ రేడియోథెరపీ మెషీన్. ఈ మెషీన్ ఎక్స్-రే మోనిటరింగ్ ని ఉపయోగించి చికిత్స సమయంలో రోగిని రియల్ టైమ్ ట్రాకింగ్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ రకమైన ట్రాకింగ్ కొన్ని కేన్సర్‌లకు చాలా ఖచ్చితంగా చికిత్స చేయడానికి సైబర్‌నైఫ్‌ను అనుమతిస్తుంది. రియల్ టైమ్ ట్రాకింగ్ ఎంపికలు ఇతర రకాల లీనియర్ యాక్సిలరేటర్లలో కూడా అందుబాటులో ఉన్నాయి. అధునాతన లీనియర్ యాక్సిలరేటర్‌ల మాదిరిగా కాకుండా సైబర్క్‌నైఫ్‌లో CT ఆధారిత ఇమేజ్ గైడెన్స్ ఉండదు. ఏదేమైనా, ఎక్స్-రే ఆధారిత ఇమేజ్ గైడెన్స్ చాలా అధునాతనమైనది. అందువల్ల మెదడు, వెన్నెముక లేదా వెన్నెముకకు సమీపంలో ఉన్న కేన్సర్ల చికిత్స కోసం ఉపయోగిస్తారు. ఇందులో ఎక్స్-రేలు ఎముకలను ఖచ్చితంగా చిత్రించగలవు. సైబర్‌నైఫ్ చికిత్స ఫ్రాక్షన్ సాధారణంగా ఒక మంచి లీనియర్ యాక్సిలరేటర్ కంటే ఎక్కువ సమయం పడుతుంది.

స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ (SRS)

రేడియోథెరపీ అధిక మోతాదులను ఉపయోగించి చాలా ఖచ్చితంగా కేన్సర్ ఉన్న చిన్న ప్రాంతాలకు చికిత్స చేయడానికి అధిక శక్తి ఎక్స్-కిరణాలు (లీనియర్ యాక్సిలరేటర్, సైబర్‌నైఫ్, టోమోథెరపీ) లేదా గామా-కిరణాలను (గామా కత్తి యంత్రం) ఉపయోగించే రేడియోథెరపీ ఇది. ఈ టెక్నిక్ కొన్ని రకాల కేన్సర్‌లను బాగా తక్కువ వ్యవధిలో చాలా చక్కటి చికిత్స చేయడానికి వీలు కల్పిస్తుంది. రేడియోథెరపీ ఒక సింగిల్ ఫ్రాక్షన్ ని ఉపయోగించి చికిత్స జరుగుతుంది. ఈ సింగిల్ ఫ్రాక్షన్ వ్యవధి కొన్ని నిమిషాల నుండి గంట కంటే ఎక్కువ ఉంటుంది. అన్ని కేన్సర్లకూ ఈ పద్ధతిలో చికిత్స చేయలేరు.

ప్రోటాన్ థెరపీ

ప్రోటాన్ థెరపీ ఎక్స్టర్నల్ బీమ్ రేడియోథెరపీలో మరొక రూపం. లీనియర్ యాక్సిలరేటర్‌లో మాదిరిగానే ప్రోటాన్ థెరపీ ఫోటాన్‌లకు బదులుగా ప్రోటాన్‌లను ఉపయోగిస్తుంది. ప్రోటాన్ కిరణాల భౌతిక లక్షణాలు ఎలక్ట్రాన్ లేదా ఫోటాన్ కిరణాలకు భిన్నంగా ఉంటాయి. ఇది దుష్ప్రభావాలను కలిగించకుండా టార్గెన్ చేరుకోవడానికి కష్టంగా ఉన్న కొన్ని రకాల కేన్సర్లలో ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రోటాన్ కిరణాలను వీలు కల్పిస్తుంది. ఈ రకం కేన్సర్లు సాధారణంగా పిల్లల్లో కంటి వెనుక ఉండే కణుతులు, వెన్నెముకకు దగ్గరగా ఉంటాయి. ఇతర కేన్సర్ల విషయంలో, ప్రామాణిక రేడియోథెరపీ కంటే ప్రోటాన్ థెరపీ ప్రయోజనం చాలా తక్కువ.

రేడియోథెరపీకి ఉపయోగించే ఇతర పరిభాషలు ఏంటి?

క్యూరేటివ్ రేడియోథెరపీ

ఇందులో రేడియోథెరపీ అన్ని కేన్సర్ కణాలను చంపి కేన్సర్‌ను నయం చేయాలనే లక్ష్యంతో ఇవ్వబడుతుంది. కేన్సర్‌ను నయం చేస్తే కేన్సర్ మళ్లీ తిరిగి రాదని అర్థం.

పాలియేటివ్ రేడియోథెరపీ

ఏ చికిత్సా ఎంపికతోనైనా నివారణ సాధ్యం కానప్పుడు పాలియేటివ్ రేడియోథెరపీని ఉపయోగిస్తారు.
పాలియేటివ్ రేడియోథెరపీ లక్ష్యం కేన్సర్ నుండి వచ్చే లక్షణాలను నియంత్రించడం. ఇందులో లక్షణాలు నొప్పి, రక్తస్రావం, దగ్గు, అవరోధం, కేన్సర్ కారణంగా ఎముక పగులు మొదలైనవి ఉంటాయి.

రేడియోథెరపీ కోసం నిర్ణయం తీసుకున్న తర్వాత ఏం జరుగుతుంది

రేడియోథెరపీ ప్లానింగ్ (ఎక్స్టర్నల్ బీమ్ చికిత్స)

రేడియోథెరపీని ఇవ్వాలని డాక్టర్ నిర్ణయించిన తర్వాత రోగి చికిత్సకి అంగీకరించిన తరువాత, రేడియోథెరపీ ప్రణాళిక ప్రక్రియ ప్రారంభమవుతుంది.

మౌల్డ్ (అచ్చు)రూమ్

రేడియోథెరపీ చాలా ఖచ్చితంగా ఉండడానికి, రోగి చికిత్స జరిగినన్నాళ్లూ ఒకే స్థితిలో ఉండాలి. ఈ స్థానం మిల్లీమీటర్‌కు సమీపంగా ఉండేంత ఖచ్చితంగా ఉండాలి. ఇలా ఉండేలా చేయడానికి, చికిత్స సమయంలో రోగిని చాలా స్థిరంగా ఉంచడానికి వివిధ సాధనాలను ఉపయోగిస్తారు.
థర్మోప్లాస్టిక్ మాస్క్ సాధారణంగా శరీరానికి పైభాగంలో చికిత్స పొందిన రోగులకు ఉపయోగిస్తారు. వాక్యూమ్ జనరేటెడ్ బ్యాగ్స్, ఫోమ్ దిండ్లు, ప్యాడ్లు, మౌత్ బైట్స్ మొదలైనవి ఉపయోగిస్తారు. ఉపయోగించాల్సిన ఖచ్చితమైన వస్తువును డాక్టర్ నిర్ణయిస్తారు. ఇది మౌల్డ్ రూమ్ లో తయారు చేయబడుతుంది.

రేడియోథెరపీ ప్లానింగ్ స్కాన్

మౌల్డ్ (అచ్చు)రూమ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత, రోగిని స్కానింగ్ గదిలోకి తీసుకువెళతారు రేడియోథెరపీ ప్లానింగ్ CT లేదా PET-CT స్కాన్ చేస్తారు. ఈ స్కాన్ రోగి చికిత్స సమయంలో అతను/ఆమె ఒకే స్థితిలో ఉంటుంది. ఈ స్కాన్ వైద్యుడికి చికిత్స చేయవలసిన ప్రాంతాలను చూసుకోవడానికి వీలు కల్పిస్తుంది, చికిత్స చేయడానికి ఇది చాలా అవసరం. కొన్నిసార్లు ఈ ప్రక్రియలో MRI స్కాన్ కూడా జరుగుతుంది.

వాల్యూమ్ కాంటౌరింగ్

ప్లానింగ్ స్కాన్ పూర్తయిన తర్వాత, స్పెషలిస్ట్ సాఫ్ట్‌వేర్ ను ఉపయోగించి స్కాన్‌లో చికిత్స చేయవలసిన ప్రాంతాన్ని డాక్టర్ చెప్తారు.

రేడియోథెరపీ ఫిజిక్స్

డాక్టర్ ద్వారా కాంటౌరింగ్ పూర్తయిన తర్వాత, రేడియోథెరపీ ఫిజిక్స్ బృందం చికిత్స ప్రణాళికతో ముందుకు సాగుతుంది. ఇది చాలా ఆధునిక రేడియోథెరపీ ప్లానింగ్ సిస్టమ్స్ సహాయంతో జరుగుతుంది. కేన్సర్ కి రేడియోథెరపీ మోతాదును పెంచుతూ దాని చుట్టూ ఉన్న సాధారణ నిర్మాణాల (స్ట్రక్చర్ల) కూ, అవయవాలకూ కనీస మోతాదు అందేలా చూడడం మంచి ప్లానింగ్ లక్ష్యం. ప్లానింగ్ పూర్తయిన తర్వాత ఖచ్చితత్వాన్ని చూడడం కోసం క్వాలిటీ అష్యూరెన్స్ పరీక్ష చేయబడుతుంది.
పైన చెప్పినవన్నీ బాగా జరిగితే, చికిత్స ప్రారంభమవుతుంది. రేడియోథెరపీతో చికిత్స చేయాలనే నిర్ణయానికీ, చికిత్స ప్రారంభానికీ మధ్య కనీసం 2-3 రోజులు అవసరం.

రేడియోథెరపీ దుష్ప్రభావాలు

చికిత్స పొందుతున్న శరీర వైశాల్యాన్ని బట్టి రేడియోథెరపీ వివిధ రకాల దుష్ప్రభావాలను కలిగిస్తుంది.
చాలా రేడియోథెరపీ చికిత్సలతో సంభవించే కొన్ని సాధారణ దుష్ప్రభావాలు ఉన్నాయి. తరువాత వివిధ శరీర ఆకృతుల్ని బట్టి కొన్ని నిర్దిష్ట దుష్ప్రభావాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి. చికిత్స దుష్ప్రభావాల గురించి మాట్లాడేటప్పుడు, రోగులందరూ ఈ దుష్ప్రభావాలను అనుభవించరని అర్థం చేసుకోవాలి. ఒకే రకం చికిత్స పొందినా కొంతమంది రోగులకి ఇతరులకన్నా ఎక్కువ దుష్ప్రభావాలు కలుగుతాయి.

సాధారణ దుష్ప్రభావాలు

అలసట

చికిత్స ప్రారంభమైన కొన్ని రోజుల నుండి కొన్ని వారాల వరకు ఉంటుంది. చికిత్స పూర్తయిన కొన్ని వారాల తరువాత స్థిరపడుతుంది.

చర్మం మార్పులు

శరీరంలోని ఏ భాగానికి చికిత్స చేసినా, చర్మం చికిత్సలో ఉంటుంది. కొన్ని దుష్ప్రభావాలను కలిగి ఉంటుంది. ఈ ప్రభావాలు తక్కువ చికిత్సలకు తక్కువ చాలా వారాల పాటు జరిగే చికిత్సలకు ఎక్కువ ఉంటాయి. సాధారణ ప్రభావాల్లో ఈ క్రిందివి ఉంటాయి-
చర్మం పొడిబారడం, చర్మం దురద, చర్మం ఎర్రగా మారడం, అప్పుడప్పుడు చర్మం పగులు చూపడం, జుట్టు రాలడం, చర్మం రంగు మారడం, చర్మం గట్టిపడటం. చర్మం నుండి అరుదుగా స్రావాలు కనిపించడం.
చికిత్స పూర్తయిన కొన్ని వారాల తర్వాత ఈ చర్మ ప్రభావాలు చాలా వరకు తగ్గుతాయి. చర్మం రంగు పాలిపోవడమనే లక్షణం మామూలవడానికి కొన్ని నెలలు పడుతుంది.

జుట్టు రాలడం

రేడియోథెరపీ వల్ల చికిత్స పొందిన ప్రాంతంలో జుట్టు రాలడం జరుగుతుంది. సాధారణంగా, జుట్టు తిరిగి పెరుగుతుంది కాని అధిక మోతాదులో రేడియోథెరపీని ఉపయోగించినట్లయితే పూర్తిగా పెరగకపోవచ్చు.
చికిత్స పొందుతున్న ప్రాంతానికి ప్రత్యేకంగా వచ్చే ఇతర దుష్ప్రభావాలు వెబ్‌సైట్‌లోని ఇతర విభాగాల్లో ఇవ్వబడ్డాయి.