ప్రొస్టేట్ కేన్సర్

ప్రొస్టేట్ కేన్సర్

ప్రొస్టేట్ గ్రంథి

ప్రొస్టేట్ అనేది కడుపు దిగువ భాగంలో కటి అనే పేరుతో పిలవబడే ప్రాంతంలో ఉండే పురుష ప్రత్యుత్పత్తి గ్రంథి. ఇది పురీషనాళం ముందు (పెద్ద ప్రేగు దిగువ భాగం) మరియు మూత్రాశయం క్రింద ఉంటుంది. ఇది మూత్రాశయం ఎగువ భాగాన్ని చుట్టూ తిరిగి ఉంటుంది, ఇది దాదాపుగా ఆక్రోటు (వాల్నట్) పరిమాణంలో ఉంటుంది. ప్రొస్టేట్ గ్రంథి మందంగా, తెల్లగా ఉండే ద్రవాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది వీర్యకణాల (స్పెర్మ్)తో కలిసి వీర్యం (సెమన్) గా ఏర్పడుతుంది. సాధారణంగా వయస్సుతో బాటు ప్రొస్టేట్ గ్రంథి పరిమాణం పెరుగుతుంది. ప్రొస్టేట్ స్పెసిఫిక్ యాంటిజన్ (PSA) అని పిలవబడే ఒక ప్రోటీన్ ని ఇది ఉత్పత్తి చేస్తుంది.
ప్రొస్టేట్ గ్రంథి సాధారణంగా పెరుగుతున్న వయస్సుతో బాటు విస్తరిస్తుంది, ఈ విస్తరణతో సంబంధం ఉన్న మూత్ర లక్షణాలను ఉత్పత్తి చేస్తుంది. దీనిని బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ప్లాసియా (బిపిహెచ్) అంటారు. ఈ విధంగా పరిమాణంలో పెరుగుదలతో మూత్ర విసర్జన చేయడంలో ఇబ్బందులు ఏర్పడతాయి.

ప్రొస్టేట్ కేన్సర్

ప్రొస్టేట్ కేన్సర్ అనేది ప్రొస్టేట్ లో మొదలయ్యే కేన్సర్. ప్రొస్టేట్ గ్రంథి కణాల్లో కొన్ని నియంత్రణలో లేనప్పుడు ఈ కేన్సర్ వస్తుంది. ఈ కేన్సర్ సాధారణంగా అడెనోకార్సినోమా అయి ఉంటుంది, అరుదుగా లింఫోమాకి చెందిన స్మాల్ సెల్ కార్సినోమా వంటి ఇతర రకాలుగా కూడా ఉంటుంది.

గ్లోబోకాన్ డేటా 2018 ప్రకారం, 2018 లో భారతదేశంలో 25,696 కొత్త ప్రొస్టేట్ కేన్సర్ లు వచ్చాయి, ఈ విధంగా ఈ రకానికి చెందిన కేన్సర్లు మొత్తం 2.2% ఉన్నాయి.

ప్రొస్టేట్ కేన్సర్ కి సంబంధం ఉన్న ప్రమాద కారకాలు

వయసు

ప్రొస్టేట్ కేన్సర్ సాధారణంగా వృద్ధాప్య వర్గానికి వచ్చే ఒక కేన్సర్. వయసు పెరిగే కొద్దీ కేన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

జన్యుపరంగా

ప్రొస్టేట్ కేన్సర్లు 5-10% జన్యుపరంగా వచ్చేవి అయి ఉంటాయి, అంటే, కుటుంబాలలో తప్పు జన్యువుల వారసత్వం కారణంగా ఈ రకమైన కేన్సర్ సంభవిస్తుంది.

ఆహారం ద్వారా

కూరగాయలు, పండ్లు, జంతువుల క్రొవ్వులలో తక్కువగా ఉన్న ఆహారం ప్రొస్టేట్ కేన్సర్ కి దారితీసే ప్రమాద కారకంగా ఉండవచ్చు.

ప్రొస్టేట్ కేన్సర్ ప్రారంభ దశలో ఎటువంటి లక్షణాల్నీ బహిర్గతం చేయదు. ప్రొస్టేట్ గ్రంథి వయస్సుతో పెరుగుతున్నపుడు, అది సాధారణంగా కనిపించే కొన్ని మూత్రాశయ లక్షణాలను ఉత్పత్తి చేస్తుంది. వయస్సుతో బాటు పెరిగే గ్రంథి విస్తరణని బినైన్ (నిరపాయమైన) ప్రొస్టేటిక్ హైపర్ ప్లాసియా (బిపిహెచ్) అంటారు. ప్రొస్టేట్ కేన్సర్ ద్వారా ఉత్పత్తి అయ్యే లక్షణాలు, BPH లక్షణాల మాదిరిగానే ఉంటాయి. ఈ లక్షణాలు-

  • మూత్ర విసర్జనలో ఇబ్బంది
  • పగటిపూట లేదా రాత్రి సమయంలో మూత్ర విసర్జన కోసం తరచుగా మరుగుదొడ్డికి వెళ్లడం
  • మూత్ర విసర్జన చేసిన తర్వాత మూత్రాశయం పూర్తిగా ఖాళీ అయినట్లు అనిపించకపోవడం
  • మూత్ర విసర్జన చేస్తున్నపుడు నొప్పి లేదా చురుకు పోట్లుగా ఉండి మంటగా ఉండడం
  • మూత్రంలో రక్తం రావడం
  • అత్యవసరంగా మూత్రం పాస్ చేయాల్సిన అవసరం ఉందనిపిస్తుంది
  • మూత్ర ప్రవాహం చాలా అల్పంగా ఉండడం

ప్రొస్టేట్ కేన్సర్ ఎముకలకు వ్యాపించిన రోగుల విషయంలో, శరీరంలోని ఇతర భాగాల్లో, ముఖ్యంగా వెన్నెముకలో నొప్పి, పిరుదు ప్రాంతాల్లో నొప్పి ఉంటుంది. ప్రొస్టేట్ కేన్సర్ బాగా ముదిరిన కేసుల్లో, పాదాలు, కాళ్ల వాపు కూడా ఉంటుంది.

పైన తెలిపిన లక్షణాల్లో ఏవైనా మీకు ఉంటే, మీరు వాటిని మీ వైద్యునితో చెక్ చేయించుకోవడం చాలా అవసరం.

మలాశయ (రెక్టల్) పరీక్ష

ప్రొస్టేట్ కేన్సర్ అనుమానాన్ని పెంచే లక్షణాలు కనిపించిన తర్వాత, ప్రొస్టేట్ విస్తరించిందేమో పరిశీలించడానికి డాక్టర్ ఒక పరీక్ష చేస్తారు. అలా చేయడానికి, డాక్టర్ తన వ్రేలిని పురీషనాళంలో ఉంచి చూడడం ద్వారా, ప్రొస్టేట్ విస్తరించిందా లేదా, ఆ విధంగా విస్తరించడం బహుశా కేన్సర్ అయి ఉంటుందా కాదా అనే విషయాన్ని చెప్పగలుగుతారు.

అలాగే, PSA కి రక్త పరీక్ష జరుగుతుంది, ఇది ప్రొస్టేట్ గురించి అదనపు సమాచారాన్ని తెలియజేస్తుంది.

PSA

ఒక PSA పరీక్ష, సాధారణ PSA స్థాయిని గానీ లేదా అంతకంటే పై స్థాయిని గానీ చూపవచ్చు. వయస్సుతో బాటు PSA స్థాయి కొద్దిగా పెరుగుతుంది, PSA పెరిగిందంటే, కేన్సర్ ఉందని కాదు. PSA ఎక్కువ స్థాయిలో ఉంటే మాత్రం, కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. కొన్నిసార్లు, ప్రొస్టేట్ గ్రంథిలో సంక్రమణ కూడా PSA ని పెంచుతుంది.

MRI స్కాన్

ఒక PSA అసాధారణంగా ఉంటే లేదా పరీక్షలో ప్రొస్టేట్ కేన్సర్ ఉన్నట్లు అనుమానం ఉంటే, ప్రొస్టేట్ కేన్సర్ కి అనుగుణమైన మార్పుల కోసం కటి ప్రాంతం (పెల్విస్) లో MRI స్కాన్ చేయబడుతుంది. స్కాన్ ప్రొస్టేట్ పై కేన్సర్ ఉన్న ప్రాంతాలను గుర్తించడంలో సహాయపడుతుంది. బయాప్సీ చేస్తున్న వ్యక్తికి సరైన ప్రాంతాల్ని లక్ష్యంగా చేసుకునేలా మార్గనిర్దేశం చేస్తుంది. ఈ రకమైన స్కాన్ ని మల్టీపారామెట్రిక్ MRI అంటారు.

బయాప్సీ

ప్రొస్టేట్ కేన్సర్ ఉందని అనుమానం ఉంటే, పరీక్ష, మరియు/లేదా PSA మరియు MRI, ప్రొస్టేట్ గ్రంథి బయాప్సీ చేయబడుతుంది. ఇది సాధారణంగా అల్ట్రాసౌండ్ స్కాన్ సహాయంతో పురీషనాళం ద్వారా జరుగుతుంది. దీనిని ప్రొస్టేట్ ట్రాన్స్ రెక్టల్ బయాప్సీ (TRUS బయాప్సీ) అంటారు.

బయాప్సీ తరువాత, కొంతమందికి తేలికపాటి అసౌకర్యం కలగవచ్చు, మూత్రంలో రక్తం లేదా వీర్యం రావడాన్ని గమనించవచ్చు.

బయాప్సీ ఫలితం

బయాప్సీ జరిగిన కొన్ని రోజుల తరువాత, ప్రొస్టేట్ కేన్సర్ ఉనికిని నిర్ధారించే ఫలితం లభిస్తుంది. ప్రొస్టేట్ కేన్సర్ ఉనికి లభిస్తే, దానికి గ్లీసన్ (Gleason) గ్రేడ్ అనే గ్రేడ్ ని ఇస్తారు. ఈ గ్రేడ్ 6 నుండి 10 వరకు ఉంటుంది, 6 తక్కువ ఉద్రిక్తంగా ఉన్నట్టూ, అలాగే 10 ఎక్కువ ఉద్రిక్తంగానూ ఉన్నట్టూ తెలియజేస్తుంది. 6 నుండి 10 వరకు ఉన్న ఈ స్కోరు రెండు సంఖ్యల మొత్తంగా ఇవ్వబడుతుంది, ఉదాహరణకు గ్లీసన్ 10 అంటే 5+5.

గ్రేడ్ ఆధారంగా, కేన్సర్ ని లో (తక్కువ) గ్రేడ్ (గ్లీసన్ 6) అనీ, ఇంటర్మీడియట్ గ్రేడ్ (గ్లీసన్ 7) అనీ, హై గ్రేడ్ (గ్లీసన్ 8-10) అనీ వర్గీకరించవచ్చు.

ప్రొస్టేట్ కేన్సర్ అని నిర్ధారించబడితే, ఈ క్రింది పరీక్షలు చేయడం జరుగుతుంది.

MRI స్కాన్

బయాప్సీకి ముందు MRI చేయకపోతే, ప్రోస్టేట్ మరియు కటి భాగానికి MRI చేయబడుతుంది. MRI ప్రోస్టేట్ గ్రంథి గురించీ, అలాగే దాని పరిసర ప్రాంతాల గురించి స్పష్టమైన వివరాలను తెలియజేస్తుంది, అలాగే కేన్సర్‌ ని మేనేజ్ చేయడంలో ఎంతగానో సహాయపడుతుంది.

ఐసోటోప్ బోన్ స్కాన్

ఎముకలలో కేన్సర్ ఉందో లేదో తెలుసుకోవడానికి ఐసోటోప్ బోన్ స్కాన్ చేస్తారు. స్కాన్ చేయడానికి ముందు టెక్నీషియం 99 అనే రేడియో ఐసోటోప్ సిరలోకి చొప్పించబడుతుంది. ఎముకలలో కేన్సర్ గుర్తించినట్లయితే స్కాన్ పాజిటివ్‌గా నివేదించబడుతుంది. ఎముకలకు వ్యాపించే కేన్సర్లలో ప్రోస్టేట్ కేన్సర్ ఒకటి. కానీ ఎముకలకు వ్యాపించే ప్రమాదం కేన్సర్ స్వభావంపై ఆధారపడి ఉంటుంది. బోన్ స్కాన్ అవసరం ఇంటర్మీడియట్ మరియు హై రిస్క్ కేన్సర్ దశల్లో చేయమని సలహా ఇవ్వబడుతుంది తప్ప, లో (తక్కువ) రిస్క్ కేన్సర్ కి ఇది అవసరం లేదు. F18 బోన్ స్కాన్ అని పిలవబడే మరొక రకమైన బోన్ స్కాన్ కూడా జరుగుతుంది. F18 ఎముక స్కాన్ మరింత సూక్ష్మంగా ఉంటుంది, ఇది ఎముకల్లో కేన్సర్ వ్యాప్తిని కనుగొనడానికి చాలా బాగా పనిచేస్తుందని చెప్తారు. కేన్సర్ ఏ దశలో ఉందో కనుక్కోవడానికి ఈ స్కాన్లలో ఏది చేసినా మంచిదే.

CT స్కాన్

MRI స్కాన్ అందుబాటులో లేనపుడు గానీ లేదా హై రిస్క్ ప్రోస్టేట్ కేన్సర్‌ దశని నిర్ధారించడంలో భాగంగా, ముఖ్యంగా శరీరంలోని ఇతర భాగాలకి సోకిందేమో అంచనా వేయడానికీ CT స్కాన్ జరుగుతుంది. CT స్కాన్ శరీరానికి చెందిన స్పష్టమైన ఇమేజిలను తీయడానికి ఎక్స్-కిరణాల్ని ఉపయోగిస్తుంది.

PET CT

స్టాండర్డ్ (ప్రామాణిక) PET CT (18 FDG) లో ఉపయోగించే రేడియోయాక్టివ్ ట్రేసర్‌ ని కేన్సర్ కణాలు స్థిరంగా తీసుకోనందున ప్రోస్టేట్ కేన్సర్‌ దశని నిర్ధారించడానికి PET CT స్కాన్ ని రొటీన్ పద్ధతిలో సిఫార్సు చేయబడలేదు. 18 F-కోలిన్ PET లేదా PSMA PET వంటి సరికొత్త PET CT ట్రేసర్లు ఈ పరిస్థితికి మరింత ఉపయోగకరంగా ఉంటాయని భావించబడుతోంది.

కేన్సర్ స్టేజింగ్ అంటే శరీరంలోని కేన్సర్ పరిమాణం ఎంత ఉన్నదీ, ఏ స్థానంలో ఉన్నదీ వివరించడానికి ఉపయోగించే పదం.కేన్సర్ దశని తెలుసుకోవడం అనేది వైద్యులు అత్యంత ఉపయుక్తమైన చికిత్సను నిర్ణయించడానికి సహాయపడుతుంది. ప్రొస్టేట్ కేన్సర్ ఏ దశలో ఉన్నదీ నిర్ధారించడానికి TNM సిస్టమ్ లేదా నెంబర్ సిస్టమ్ ని ఉపయోగిస్తారు.

ఏ సిస్టమ్ ని ఉపయోగించినా దశల నిర్థారణ, ప్రొస్టేట్ లో కణితి ఎంత విస్తరించిందనే అంశం ఆధారంగానూ, ప్రొస్టేట్ లో స్థానికంగా కేన్సర్ వ్యాప్తి చెందిన స్థితిని బట్టీ, అలాగే లింఫు నోడ్స్ (శోషరస కణుపుల్లో) కి కేన్సర్ వ్యాపించిన స్థితిని బట్టీ శరీరంలోని ఇతర భాగాల్లో కేన్సర్ వ్యాపించిన స్థితిని బట్టీ జరుగుతుంది.

TNM స్టేజింగ్

T స్టేజింగ్

T1 కణితి పరీక్ష చేసినపుడు ఉన్నట్టు తెలియదు, స్కాన్ లో కూడా కనిపించదు
T1a తొలగించబడిన కణజాలంలో కణితి 5 % కన్నా తక్కువగా కనబడడం
T1b తొలగించబడిన కణజాలంలో కణితి 5 % కన్నా ఎక్కువగా కనబడడం
T1c బయాప్సీలో కణితి కనబడడం (P S A హై గా బయాప్సీ చేసినపుడు)
T2 కణితి ప్రొస్టేట్ గ్రంథి వరకే పరిమితమై ఉంది
T2a కణితి ప్రొస్టేట్ లోని ఒకటి లేదా అంతకి తక్కువ లంబిక (లోబ్) లో ఉంటుంది
T2b కణితి ఒక లంబికలో సగానికి పైగా ఉంటుంది
T2c కణితిలో ప్రొస్టేట్ ఒకటి లేదా అంత కంటే ఎక్కువ లంబికల్లో ఉంటుంది
T3 కణితి ప్రొస్టేట్ కేప్స్యూల్ కి వెలుపల విస్తరించి ఉంటుంది
T3a కణితి కేప్స్యూల్ వెలుపలకి చేరుకుంటుంది
T3b కణితి సెమినల్ వెసికిల్స్ లో ఉంటుంది
T4 కణితి ఇతర నిర్మాణాలపై దాడి చేస్తుంది లేదా స్థిరంగా ఉంటుంది

N స్టేజింగ్

Nx శోషరస కణుపులు అంచనా వేయబడలేదు
N0 శోషరస కణుపుల ప్రమేయం లేదు
N1 క్యాన్సర్‌తో శోషరస కణుపుల ప్రమేయం

M స్టేజింగ్

M0 మెటాస్టాటిక్ వ్యాధి లేదు
M1 మెటాస్టాటిక్ వ్యాధి ఉంది

దశలవారీ సంఖ్యని నిర్ధారించడం (నెంబర్ స్టేజింగ్)

I T1a-c N0 M0
T2a N0 M0
T1-2a N0 M0
IIA T1a-c N0 M0
T1a-c N0 M0
T2a N0 M0
T2a N0 M0
T2b N0 M0
T2b N0 M0
IIB T2 N0 M0
T1-2 N0 M0
T1-2 N0 M0
III T3a-b N0 M0
IV T4 N0 M0
ఏదైనా T N1 M0
ఏదైనా టి ఏదైనా Any N M1

ప్రొగ్నాస్టిక్ (విశ్లేషణాత్మక) గ్రూపులు

ప్రోస్టేట్ క్యాన్సర్‌ను T స్టేజ్, N స్టేజ్, గ్లీసన్ స్కోరు, P S A స్థాయిల్ని బట్టి తక్కువ, మధ్యస్థ, అధిక ప్రమాదకరమైన కేన్సర్లుగా కూడా వర్గీకరించవచ్చు. వివిధ గ్రూపుల లిమిటెడ్ వెర్షన్ ఇక్కడ ఉంది. చికిత్స నిర్ణయాలు ఈ ప్రమాద వర్గాలపై ఆధారపడి ఉంటాయి.

తక్కువ ప్రమాదం

  • P S A 10 కన్నా తక్కువ గానీ లేదా సమానంగా ఉన్నా గానీ
  • T1-T2a
  • గ్లీసన్ 6

మధ్యస్థ రకమైన ప్రమాదం

  • PSA 10-20
  • T2a-T2b
  • గ్లీసన్ 7

అధిక ప్రమాదం

  • PSA 20 కంటే ఎక్కువ
  • T2c లేదా అంతకంటే ఎక్కువ
  • గ్లీసన్ 8-10

ప్రొస్టేట్ కేన్సర్ చికిత్స రోగనిర్ధారణ సమయంలో కేన్సర్ ఏ దశలో ఉందన్న విషయం నిర్ధారించబడడంపై ఆధారపడి ఉంటుంది. కేన్సర్ తక్కువగా ఉందా, మధ్యస్థ దశలో ఉందా లేదా అధిక ప్రమాదంలో గానీ లేదా మెటాస్టాటిక్ దశలో ఉందా అన్న దానిపై ఆధారపడి ఉంటుంది.

ప్రతి వర్గానికి చికిత్స ఎంపికలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి.

లో (తక్కువ) రిస్కు గల ప్రొస్టేట్ కేన్సర్ కి చికిత్స

తక్కువ ప్రమాదం గల ప్రొస్టేట్ కేన్సర్ విషయంలో శరీరంలోని ఇతర భాగాలకు కేన్సర్ వ్యాప్తి చెందే ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఇతర గ్రూపుకి చెందిన కేన్సర్లతో పోల్చినప్పుడు ఈ కేన్సర్ ఉద్రిక్తత తక్కువగా ఉంటుంది. 10 కంటే తక్కువ PSA ఉండి, గ్లీసన్ స్కోరు 6 మరియు T1 దశలో ఉన్న రోగులకు తక్కువ ప్రమాదం గల ప్రొస్టేట్ కేన్సర్ ఉంటుంది.

చికిత్సకి గల వివిధ ఎంపికలు

యాక్టివ్ (క్రియాశీల) సర్విలెన్స్ (నిఘా)

కేన్సర్ పెరిగే ప్రమాదం లేదా వ్యాప్తి చెందే ప్రమాదం చాలా తక్కువగా ఉన్న కొంతమంది రోగులు చేసుకునే ఎంపికల్లో ఇది ఒక ఎంపిక. ఇక్కడ ఏ రకమైన రూపంలోనూ చికిత్స ఇవ్వబడదు. అయితే వ్యాధి పెరుగుతున్నట్టుగా సంకేతాలను చూపించే సమయం వచ్చేవరకు రోగిని క్రియాశీలక పర్యవేక్షణలో ఉంచుతారు. ఎన్నో రకాల అధ్యయనాల్లో వెల్లడించబడిన ఫలితాల్ని బట్టి చూస్తే ప్రొస్టేట్ కేన్సర్ ఉన్న రోగుల సమూహంలో ఆ కేన్సర్ చాలా సంవత్సరాల పాటు పెరగకుండానే ఉండిపోతుందని తేలింది. వారిని ఆ సమయంలో యాక్టివ్ సర్విలెన్స్ లో ఉంచుతారు. కేన్సర్ పెరుగుతున్నట్లు సంకేతాలు వచ్చిన సమయంలో నివారణ చికిత్సను అందించవచ్చు. ఇది మీ ఆంకాలజిస్ట్ తో చర్చించి ఈ విధమైన చికిత్సని ఎంపిక చేసుకోవాలి, ఎందుకంటే అందరికీ ఈ రకమైన చికిత్స ఇవ్వడం సరికాదు.

రాడికల్ ప్రొస్టాటెక్టమీ

ప్రొస్టేట్ కేన్సర్ చికిత్సకు ఇది శస్త్రచికిత్స ఎంపిక. ఇక్కడ కేన్సర్ ని నయం చేయడానికి కటి భాగంలోని లింఫు నోడ్స్ (శోషరస కణుపుల) తో పాటు ప్రొస్టేట్ తొలగించబడుతుంది. ఈ ఆపరేషన్ ఓపెన్ మెథడ్ (పద్ధతి) లో గానీ లేదా లాప్రోస్కోపిక్ పద్ధతి లేదా రోబోటిక్ పద్ధతి ద్వారా గానీ చేయవచ్చు. లాప్రోస్కోపిక్ లేదా రోబోటిక్ పద్ధతి తక్కువ ఉద్రిక్తంగా ఉంటుంది, రోగులు త్వరగా కోలుకుంటారు.
ఓపెన్ ప్రొస్టాటెక్టోమీలో, సర్జన్ ఉదరం దిగువ భాగంలో పొత్తి కడుపు మీద కోస్తారు. దీనిని రెట్రోప్యూబిక్ ప్రోస్టేటెక్టోమీ అంటారు. మరో ఎంపికగా ఉన్న పెరినియల్ విషయంలో, కొంతమంది సర్జన్లు, వృషణాలకూ, గుద ద్వారానికీ మధ్య గల ప్రదేశంలో కోత పెడతారు. ప్రొస్టేట్ వెనుక ఉన్న సెమినల్ వెసికిల్స్ పాటు ప్రొస్టేట్ గ్రంథిని కటి ప్రాంతంలో ఉన్న లింఫు నోడ్స్ తో సహా తొలగించడం జరుగుతుంది.

లాప్రోస్కోపిక్ ఆపరేషన్ లో, సర్జన్ లైటు కలిగిన ఒక ట్యూబ్ ని ఉపయోగిస్తారు. ఇది కెమెరాతో అనుసంధానించబడి ఉంటుంది. ఇది కడుపు లోపలి భాగాన్ని చూడటానికి సర్జన్ కి సహాయపడుతుంది. ఈ గొట్టాన్ని చొప్పించడానికి ఉదరం ప్రాంతంలోని ఒక చిన్న భాగంలో రంధ్రం చేస్తారు. శస్త్రచికిత్సలో ఉపయోగించే పరికరాలను చొప్పించడానికి ఉదర ప్రాంతంలోని ఇతర భాగాలలో మరి కొన్ని కట్స్ పెట్టడం జరుగుతుంది. పై విధానంలో ప్రొస్టేట్ మరియు ఇతర కణజాలాలను తొలగించడం జరుగుతుంది.

ప్రామాణిక శస్త్రచికిత్సతో పోలిస్తే ఈ పద్ధతి రక్తస్రావాన్ని తగ్గించడంతో పాటు ఆసుపత్రిలో ఉండే సమయాన్ని తగ్గించడం వంటి మరి కొన్ని ఫలితాలను కలిగి ఉంటుంది.

రోబోటిక్ పద్ధతిలో డా విన్సీ సిస్టమ్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఇది లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్సకి మరొక రూపం. ఇందులో సర్జన్ రోబోట్ సహాయం తీసుకుంటారు. ఇది 4 చేతులు కలిగిన యంత్రం. ఒక చేయి కెమెరా పుచ్చుకుని ఉంటుంది, మిగతా 3 చేతుల్లోనూ శస్త్రచికిత్సకి అవసరమైన పరికరాలు ఉంటాయి. సర్జన్ ఆపరేషన్ చేసే చోట ఒక ప్రత్యేకమైన కన్సోల్ మీద కూర్చుని ఉంటారు. ఈ పద్ధతి లాప్రోస్కోపిక్ సర్జరీ కంటే మంచిది కాకపోయినా కనీసం లాప్రోస్కోపిక్ ఆపరేషన్ తో సమానమైన ప్రభావాన్ని చూపగలదని తేలింది.

అన్ని చికిత్సల మాదిరిగానే, రాడికల్ ప్రొస్టేటెక్టోమీ దుష్ప్రభావాల్ని కలిగి ఉంటుంది. ఇవి నపుంసకత్వము, అదుపులేని మూత్ర విసర్జన రూపంలో ఉండవచ్చు. తొలిదశకి చెందిన ప్రొస్టేట్ కేన్సర్ విషయంలో, ఒక నెర్వ్ స్పేరింగ్ ప్రొస్టేటెక్టమీ చేయవచ్చు, ఇది శస్త్రచికిత్స జరిగిన తర్వాత నపుంసకత్వ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

రేడియోథెరపీ

ఈ రోగుల సమూహంలో రేడియోథెరపీ మరొక నివారణ చికిత్స ఎంపిక. రేడియోథెరపీలో, రేడియోథెరపీ ఇచ్చే రెండు ప్రధాన ప్రక్రియలు ఉన్నాయి.

రేడియోథెరపీని వెలుపల ఉన్న యంత్రంతో (ఎక్స్-రే యంత్రం వలె) ఇవ్వడాన్ని ఎక్స్టెర్నల్ బీమ్ రేడియోథెరపీ అంటారు. ఇది ప్రొస్టేట్ కి అధిక శక్తివంతమైన ఎక్స్-కిరణాలను అందిస్తుంది.

మరొక ఎంపిక బ్రాకీథెరపీ, ఇక్కడ రేడియోయాక్టివ్ వనరులు ప్రోస్టేట్‌లోకి చొప్పించబడతాయి, ఇక్కడ ఈ వనరులు రేడియేషన్‌ను అందిస్తాయి. రోగులందరికీ ఈ చికిత్స పద్ధతిలో బ్రాకీథెరపీని చేయడం కుదరదు. పెద్ద ప్రొస్టేట్ ఉన్న రోగులు మరియు ఇతర సమస్యలతోపాటు అతి మూత్ర లక్షణాలు ఉన్న రోగులకి ఈ విధానం సరిపడదు. కొన్నిసార్లు, ఎక్స్టెర్నల్ బీమ్ రేడియోథెరపీ మరియు బ్రాకీథెరపీ కాంబినేషన్ ని ఉపయోగిస్తారు. బ్రాకీథెరపీ ఎలా ఇవ్వబడుతుందో ఈ క్రింది చిత్రం వివరిస్తుంది.

ఎక్స్టర్నల్ బీమ్ రేడియోథెరపీలో, రేడియోథెరపీని అందించే వివిధ పద్ధతులు ఉన్నాయి.

3 డి కన్ఫర్మల్ రేడియోథెరపీ అనే పద్ధతిలో చికిత్సను ప్లాన్ చేయడానికి CT స్కాన్ ఉపయోగించబడుతుంది. ప్రొస్టేట్ ఆకారానికి తగినట్లుగా చికిత్స ఆకారం ఉంటుంది. ఇది పాత టెక్నిక్. ఈ పరిస్థితికి చికిత్స చేయడానికి పాటించే కనీస ప్రమాణం ఇది.

ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియోథెరపీ లేదా IMRT అనేది 3D కన్ఫర్మల్ ట్రీట్మెంట్ కంటే చాలా ప్రత్యేకమైన పద్ధతి, ఇందులో రేడియేషన్ తో చికిత్స పొందుతున్న ప్రాంత ఆకారం పై పద్ధతి కంటే మరింత ఖచ్చితమైన ఆకారంలో ఉంటుంది. ఇది దుష్ప్రభావాలను తగ్గించడానికీ, టార్గెట్ కి ఎక్కువ మోతాదులో రేడియేషన్ ఇవ్వడానికీ కూడా సహాయపడుతుంది.

రాపిడ్ ఆర్క్ లేదా VMAT అనేది ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియోథెరపీ ప్రత్యేక రూపం, ఇందులో చికిత్స ఆర్క్ రూపంలో ఇవ్వబడుతుంది. స్టాండర్డ్ ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియోథెరపీతో పోలిస్తే దీనిలో తక్కువ విషప్రక్రియ ఉంటుంది, పైగా మరింత ఖచ్చితంగా జరుగుతుంది.

సైబర్ నైఫ్ అనేది కూడా ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియోథెరపీలో ఒక రూపం, ఇది సైబర్ నైఫ్ అని పిలవబడే ఒక రకమైన యంత్రంతో ఇవ్వబడుతుంది. ఈ యంత్రం రాపిడ్ ఆర్క్ లేదా VMAT కి సమానమైన ఎక్స్టర్నల్ బీమ్ రేడియోథెరపీని అందిస్తుంది. కానీ సైబర్‌ నైఫ్ రేడియోథెరపీ వివిధ పద్ధతులను ఉపయోగించే పూర్తి భిన్నమైన రేడియోథెరపీ మెషీన్‌ కావడంతోనూ, అలాగే పై చికిత్సల మాదిరిగానే అత్యంత ఖచ్చితమైనవి కావడంతోనూ ఇది చాలా విలక్షణమైన థెరపీ. ప్రొస్టేట్ కేన్సర్‌ కి చికిత్స చేయడానికి ప్రోటాన్ బీమ్ రేడియోథెరపీని కూడా ఉపయోగిస్తారు.

ప్రొస్టేట్ కేన్సర్ కి ఎక్స్టర్నల్ బీమ్ రేడియోథెరపీని ఉపయోగించినపుడు, ప్రామాణిక చికిత్స ఏడున్నర వారాల పాటు జరుగుతుంది. కొత్త చికిత్సా పద్ధతులు అదే రేడియోథెరపీని 4 వారాలకు పైగా ఇస్తాయి, అలాగే తొలి దశలో ఉన్న ప్రొస్టేట్ కేన్సర్‌కు స్టీరియోటాక్టిక్ రేడియోథెరపీ (SBRT)ని ఉపయోగిస్తే, అది 2 వారాలకు పైగా జరుగుతుంది.

ప్రొస్టేట్ రేడియోథెరపీకి కలిగే దుష్ప్రభావాల్లో తేలికపాటి అలసట, మూత్ర విసర్జనలో మండుతున్న భావన, ఇలాంటి లక్షణాలు, పగలు, రాత్రి సమయాల్లోతరచుగా మూత్రవిసర్జన చేసే స్థితి బాగా పెరగడం,అత్యవసరంగామూత్రవిసర్జన చేయాల్సి రావడం, నీళ్ల విరేచనాలు, జిగట విరేచనాలు, తరచుగా విరేచనాలు అవుతూ ఉండే స్థితి పెరగడం, విరేచనాల్లో రక్తస్రావం, పైల్స్ ఉంటే, వాటి స్థితి తీవ్ర స్థాయికి చేరుకోవడం వంటివి ఉంటాయి. చికిత్స పూర్తయ్యేంత వరకు ఈ ప్రభావాలు చాలా ఎక్కువగా ఉంటాయి, చికిత్స తర్వాత కొన్ని వారాల్లో ఇవి సాధారణంగా తగ్గిపోతాయి. రేడియోథెరపీలో కొన్ని దీర్ఘకాలిక దుష్ప్రభావాలు కూడా సాధ్యమే. ఇవి మూత్ర మరియు ప్రేగు లక్షణాలకు సంబంధించినవి, ఇలాంటి దుష్ప్రభావాల్ని పొందే ప్రమాదం 10% లోపు ఉంటుంది. నపుంసకత్వం కూడా రేడియోథెరపీ తర్వాత వచ్చే దుష్ప్రభావంగా చెప్పుకోవచ్చు.

హార్మోన్ చికిత్స లేదా ఆర్కిడెక్టమీ

శస్త్రచికిత్సకిగానీ లేదా రేడియోథెరపీకి గానీ సరిపడని లో (తక్కువ) రిస్కు గల ప్రొస్టేట్ కేన్సర్ రోగుల చిన్న గ్రూపు విషయంలో అయితే మాత్రలు లేదా ఇంజెక్షన్లతో హార్మోన్ చికిత్స పొందడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. ఆర్కిడెక్టమీ (వృషణాల్ని తొలగించడం) ని ఎంపిక చేసుకోవడం ద్వారా హార్మోన్ల మందుల్ని ఉపయోగించకుండా ఉండే అవకాశం ఉంది. ఈ ఎంపికల్లో ఏ చికిత్స తీసుకున్నా ప్రొస్టేట్ కేన్సర్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది.

మధ్యస్థ ప్రమాదం ఉన్న ప్రొస్టేట్ కేన్సర్ కి చికిత్స

మధ్యస్థ ప్రమాదం ఉన్న ప్రొస్టేట్ కేన్సర్ రోగులు PSA10-20, లేదా గ్లీసన్ స్కోరు 7, స్టేజ్ IIa-IIb మధ్య ఉంటారు. ఈ సమూహంలోని రోగులు రాడికల్ ప్రొస్టేటెక్టమీ, రేడియోథెరపీ, హార్మోన్ చికిత్సల్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవచ్చు. ఈ రోగుల వర్గానికియాక్టివ్ సర్విలెన్స్ (క్రియాశీల నిఘా) సాధారణంగా ఒక ఎంపిక కాదు.

రేడియోథెరపీని ఎంచుకునే మధ్యస్థ ప్రమాదం గల ప్రొస్టేట్ కేన్సర్ రోగులకు,రేడియోథెరపీ జరిపే 2-3 నెలల ముందు మరియు రేడియోథెరపీ సమయంలోనూ కూడా LHRH అనలాగ్స్ రూపంలో హార్మోన్లు ఇవ్వబడతాయి. ఇది ప్రొస్టేట్ కేన్సర్‌పై మంచి నియంత్రణను సాధించడానికి సహాయపడుతుంది. ప్రొస్టాటెక్టమీని ఎంచుకునే రోగులకు సరైన ప్రయోజనాలు చూపబడనందున హార్మోన్ల ఎంపిక సిఫార్సు చేయబడలేదు.

శస్త్రచికిత్స లేదా రేడియోథెరపీ సరిపడని రోగులకి,హార్మోన్ల చికిత్స మాత్రమే ఏకైక ఎంపికగా ఉంటుంది.

అధిక ప్రమాదం ఉన్న ప్రొస్టేట్ కేన్సర్ చికిత్స

PSA 20కంటే ఎక్కువగా ఉన్నా,లేదా గ్లీసన్ స్కోరు 8 గానీ, అంతకంటే ఎక్కువగా గానీ ఉన్నపుడు గానీ, లేదా ఇదిTIIc స్టేజి (దశ) గానూలేదా అంతకంటే ఎక్కువగానూ ప్రొస్టేట్ కేన్సర్ అధిక ప్రమాదమని చెప్పబడుతోంది.

ఈ వ్యాధి ప్రొస్టేట్ గ్రంథికి పరిమితమని చెప్పబడినపుడు, అప్పటికీ రాడికల్ ప్రొస్టాటెక్టమీ చికిత్స మాత్రమే సరైన ఎంపిక అవుతుంది. అయితే, ప్రొస్టేట్ గ్రంథికి వెలుపల వ్యాధి విస్తరించి ఉన్నట్లు గుర్తించినపుడు, రేడియోథెరపీ అనేది చికిత్సల్లో ప్రధానంగా ఎంచుకునే ఎంపికగా ఉంటుంది. రేడియోథెరపీతో పాటు హార్మోన్ల చికిత్సను ఉపయోగిస్తారు. ఇది రేడియోథెరపీకి 3 నెలల ముందు, రేడియోథెరపీ జరిగే సమయంలోనూ, అలాగే మొత్తం వ్యవధిలో 2-3 సంవత్సరాల వరకు ఇవ్వబడుతుంది.

రేడియోథెరపీచేయకూడని రోగులలో, హార్మోన్ల చికిత్స ఒక్కటే ఇవ్వబడుతుంది. అలాగే ఆర్కిడెక్టమీ (వృషణాల తొలగింపు) కూడా మరో ఎంపికగా ఉంటుంది.

ప్రొస్టేట్ కేన్సర్ బాగా ముదిరిన పేషెంట్ల విషయంలో, ప్రొస్టేట్ చుట్టూ కేన్సర్ వ్యాపించి, శరీరంలో మిగతా ఏ అవయవాలకీ సోకకపోతే, స్టాండర్డ్ హార్మోన్ చికిత్స (LHRH అనలాగ్స్) తో బాటు డోసెటాక్సెల్ లేదా అబిరేటెరోన్ లేదా ఎంజలుటమైడ్ వంటి ఇతర హార్మోన్ల చికిత్సని కూడా అదనపు ప్రయోజనం కోసం పొందవచ్చు. ఆ విధంగా చేయవచ్చునా లేదా అనేది చికిత్స పూర్వాపరాల్ని డాక్టరుతోనూ, పేషెంట్ తోనూ చర్చించి మాత్రమే చేయాల్సి ఉంటుంది.

శరీరంలోని సుదూర ప్రదేశాలకు ప్రొస్టేట్ కేన్సర్ వ్యాప్తి చెందడాన్ని మెటాస్టాటిక్ ప్రొస్టేట్ కేన్సర్ అంటారు. మెటాస్టాటిక్ ప్రొస్టేట్ కేన్సర్ కి అందుబాటులో ఉన్న చికిత్సా ఎంపికలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.ఒకసారి, మెటాస్టాటిక్ ప్రొస్టేట్ కేన్సర్ గా నిర్ధారణ జరిగిన తర్వాత, చికిత్సా ఎంపికలు ప్రధానంగా వ్యాధిని నియంత్రించగలవు.

హార్మోన్ల చికిత్స

మెటాస్టాటిక్ ప్రొస్టేట్ కేన్సర్ నిర్వహణలో ఈ రకమైన చికిత్స ప్రధానమైనది. ఇందులో హార్మోన్లను మాత్రలు లేదా ఇంజెక్షన్లుగా ఇవ్వవచ్చు. సాధారణంగా మెటాస్టాటిక్ వ్యాధి నిర్ధారణ సమయం నుండి ఇలా ఇవ్వవచ్చు. ప్రొస్టేట్ కేన్సర్ శరీరంలో ఉత్పత్తి చేయబడే టెస్టోస్టెరాన్ ని తినడం ద్వారా పెరుగుతుంది. ఉపయోగించే హార్మోన్ల ఏజెంట్లు టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని తగ్గించడం ద్వారా గానీ లేదా టెస్టోస్టెరాన్ ప్రభావాలను నిరోధించడం ద్వారా సహాయపడతాయి.

ల్యూప్రోరెలిన్, గోసెరెలిన్, ట్రిప్టోరెలిన్ మరియు డెగారెలిక్స్ వంటి హార్మోన్ల ఏజెంట్లని ఉపయోగించడం జరుగుతుంది, ఇవి సాధారణంగా ప్రతి 1-3 నెలలకీ ఒకసారి ఇంజెక్షన్ల రూపంలో ఇవ్వబడతాయి. బికలుటామైడ్, సైప్రొటెరోన్, ఎంజలుటామైడ్, అబిరేటరోన్ వంటి ఇతర ఏజెంట్లను మాత్రలుగా ఇస్తారు. కేన్సర్ మళ్ళీ పెరగడానికి ప్రారంభమయ్యే లోపు హార్మోన్ల చికిత్స కొంతకాలం పాటు పనిచేస్తుంది, దీనిని హార్మోన్ రిఫ్రాక్టరీ కేన్సర్ అంటారు. హార్మోన్లు పనిచేసే సాధారణ కాల వ్యవధిని సంవత్సరాల్లో కొలుస్తారు.

ప్రొస్టేట్ కేన్సర్‌ను, ముఖ్యంగా రోగ నిర్ధారణ దశలోనే నియంత్రించడానికి రెండు వృషణాలను తొలగించే ఆర్కిడెక్టమీ, LHRH అనలాగ్‌లతో చేసే ఇంజెక్షన్లు పనిచేసినంత బాగానూ పని చేస్తుంది.. చికిత్సల్లో ఇది హార్మోన్ ఇంజెక్షన్ల కంటే చౌకైన ఎంపిక.

హార్మోన్ చికిత్సలు శరీరంలో టెస్టోస్టెరాన్ స్థాయిలను తగ్గించడం లేదా వాటి ప్రభావాన్ని తగ్గించడం వలన, టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గడానికి సంబంధించిన దుష్ప్రభావాలు కనబడతాయి. సాధారణ దుష్ప్రభావాల్లో చెమట, వేడి పొక్కులు, బరువు పెరగడం, శరీరంలో క్రొవ్వు పెరుగుదల, శరీరంలో కండరాలు తగ్గడం, శరీరమంతటా వెంట్రుకలు సన్నబడటం లేదా తగ్గడం. బైకలుటమైడ్ వంటి ఔషధాల దుష్ప్రభావం వల్ల వక్షోజాలు పెరుగుతాయి.

కెమోథెరపీ

ప్రొస్టేట్ కేన్సర్ చికిత్స కోసం కెమోథెరపీని తరచుగా ఉపయోగిస్తారు. ఇందులో సాధారణంగా డోసెటాక్సెల్, మిటోక్సాంట్రోన్, కాబాజిటాక్సెల్ మందుల్ని ఉపయోగిస్తారు . ఈ ఏజెంట్లను హార్మోన్ల చికిత్స చేసిన సమయంలోనే లేదా హార్మోన్ల చికిత్స పని చేసిన తర్వాత ఇవ్వవచ్చు. ఈ మందుల్ని ప్రొస్టేట్ కేన్సర్‌ను తగ్గించడానికి మరియు కేన్సర్‌తో సంబంధం ఉన్న లక్షణాల నుంచి బయట పడేటట్టు చేయడానికీ సహాయపడతాయి. ఇవి జీవిత కాలాన్ని పొడిగించడంలో సహాయపడతాయి. ప్రొస్టేట్ కేన్సర్‌లో కెమోథెరపీని ఇచ్చినపుడు, ప్రతి 21 రోజులకు ఒకసారి చొప్పున 6 నెలల వరకు ఇస్తారు. అటువంటి చికిత్సని PSA కొలతలు మరియు స్కాన్‌లతో చికిత్స పర్యవేక్షణ జరపబడుతుంది. ఈ ఔషధాల వల్ల కలిగే సాధారణ దుష్ప్రభావాల్లో జుట్టు ఊడిపోవడం, అలసట, నీళ్ల విరేచనాలు, సంక్రమణ ప్రమాదం, గోళ్ళలో మార్పులు, చేతులు మరియు కాళ్ళు తిమ్మిర్లు ఎక్కడం, నోరు ఎర్రబారి మంటగా ఉండడం వంటివి ఉంటాయి.

రేడియోథెరపీ

మెటాస్టాటిక్ ప్రొస్టేట్ కేన్సర్‌లో రేడియోథెరపీని ప్రధానంగా కేన్సర్ వల్ల ఉత్పత్తి చేయబడే లక్షణాలను నియంత్రించడానికి ఉపయోగిస్తారు. ఈ లక్షణాలు వైవిధ్యంగా ఉండవచ్చు, నొప్పి, రక్తస్రావం వంటివి ఉంటాయి. కేన్సర్ వల్ల ఎముకలలో కలిగే నొప్పిని చికిత్స చేయడంలో రేడియోథెరపీ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ స్థితిలో రేడియోథెరపీ వ్యవధి తక్కువ సమయానికి పరిమితం చేయబడి సాధారణంగా 1-10 చికిత్సల వరకు ఉంటుంది. ఎముకల వరకే వ్యాధి పరిమితమై ఉన్న రోగులలో ప్రొస్టేట్ చికిత్సకు 20 చికిత్సల వరకు రేడియోథెరపీని ఉపయోగిస్తారు.

ఇతర చికిత్సలు

మెటాస్టాటిక్ ప్రొస్టేట్ కేన్సర్‌లో ఉపయోగించే ఇతర చికిత్సలలో స్టెరాయిడ్స్, ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టెరాన్ ఉన్నాయి. ఎముక మెటాస్టేజ్‌ల చికిత్స కోసం రేడియోయాక్టివ్ వనరులైన స్ట్రోంటియం-89 మరియు రేడియం 223 లు ఉపయోగించబడతాయి.
ఎముకలలో వ్యాధి ఉన్న రోగులలో ఎముకలను బలోపేతం చేయడానికి బిస్ఫోఫోనేట్స్ మరియు డెనోసుమాబ్ అనే మందులను ఉపయోగిస్తారు. ఎముకలను బలోపేతం చేయడం వల్ల ఎముకల్లో నొప్పి మరియు ఎముకలు విరిగే ప్రమాదం వంటి బోన్ (ఎముక) మెటాస్టేజ్‌ల లక్షణాలు తగ్గుతాయి. ఈ మందులు ప్రతి 3-4 వారాలకు ఇవ్వబడతాయి.

మెటాస్టాటిక్ ప్రొస్టేట్ కేన్సర్‌లో వ్యాధిని పర్యవేక్షించడం సాధారణంగా సీరియల్ PSAలు మరియు స్కాన్‌ల సహాయంతో జరుగుతుంది. CT స్కాన్లు, ఐసోటోప్ ఎముక స్కాన్లు ఇందులో ఉపయోగించబడే స్కాన్లు. మెటాస్టాటిక్ వ్యాధిని క్రమం తప్పకుండా పర్యవేక్షించడానికి PET CT స్కాన్లు సాధారణంగా సిఫారసు చేయబడవు కానీ PSMA PET లేదా కోలిన్ PET వంటి కొత్త రకాల PET-CT ఉపయోగపడవచ్చు.