క్యాన్సరును నిరోధించుట

క్యాన్సర్ నివారణ

అనేక కారణాల వలన కేన్సర్ అభివృద్ధి చెందుతుంది. సాధారణంగా ఇది కొన్ని కారణాలు కలవడం కేన్సర్ పెరుగుదలకి దారితీస్తుంది. కొన్ని కారకాలు మన అదుపులో ఉండవు కానీ కొన్నింటిని మనం అదుపు చేయవచ్చు. కేన్సర్ నివారణ వ్యూహాలు మన అదుపులో ఉండే కారకాల్ని సవరించడం లేదా ఆ కారకాల్ని పూర్తిగా నివారించడంపై దృష్టి పెట్టాయి.

కేన్సర్ నివారణ వ్యూహాల్ని అమలు చేయడానికి నగరం/రాష్ట్రం/దేశం నడుం కట్టుకోవాలి, అలాగే ప్రజల వ్యక్తిగత ప్రయత్నాలూ కలిసి రావాలి. ఆ విధంగా కేన్సర్ పై పోరాటం ఒక సమిష్టి ప్రయత్నమై ఉండాలి. సమిష్టి ప్రయత్నాల్లో పర్యావరణ కాలుష్యం నియంత్రించటం, వృత్తిపరంగా కేన్సర్ కి దారితీసే రసాయనాలూ, ఉత్పత్తులతో పనిచేసేవారికి వాటికి ఎక్స్పోజ్ అయ్యే పరిస్థితుల్ని పరిమితం చేయడం, అజ్‌బెస్టాస్ మరియు దానికి సంబంధించిన ఉత్పత్తుల నిషేధం, కేన్సర్ నివారణ, పరీక్షలు, కేన్సర్ పై అవగాహన కల్పించడం వంటి అంశాల్లో రాష్ట్ర విధానాలు, జాతీయ విధానాలను కలిగి ఉండడంపై తప్పనిసరిగా దృష్టి పెట్టాలి.

ఈ విభాగం ప్రధానంగా కేన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవటానికి వ్యక్తులు తమకై తాముగా ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంపై దృష్టి సారించింది. కేన్సర్ ప్రమాదానికి గురి కాకుండా ఉండేందుకు వ్యక్తి దృష్టి పెట్టవలసిన ముఖ్యమైన అంశాలు –

  • ధూమపానం మరియు పొగాకు వాడకం ఆపడం
  • ఆల్కహాల్ ని పరిమితంగా తీసుకోవడం
  • ఒక ఆరోగ్యకరమైన ఆహారం నిర్వహించడం
  • క్రమం తప్పకుండా శారీరిక వ్యాయామాలు చేయడం
  • ఊబకాయం తగ్గించడం
  • కేన్సర్ టీకాలు
  • కేన్సర్ పరీక్షలు

ఆల్కహాల్ కేన్సర్ కి దారితీసే కారకాల్లో అతి ప్రధానమైన ప్రమాద కారకం. నోటి కేన్సర్, జీర్ణకోశ కేన్సర్ (గుల్లెట్), గొంతు కేన్సర్ మరియు స్వరపేటిక (వాయిస్ బాక్స్), కాలేయ కేన్సర్, ప్రేగు కేన్సర్ మరియు రొమ్ము కేన్సర్ వంటి అనేక రకాల కేన్సర్లు రావడానికీ ఆల్కహాల్ సేవనానికీ చాలా దగ్గర సంబంధం ఉంది.

ఆల్కహాల్ అనేక విధాలుగా కేన్సర్ కి కారణమవుతుంది. ఇది నోటి భాగంలోనూ, గొంతులోనూ కణ జాలాల్ని నాశనం చేసేంతగా మంట పుట్టిస్తుంది. ఒకసారి ఆల్కహాల్ తీసుకోవడం జరిగిందంటే, ఇక అది శరీరంలోని జీవక్రియల్లో భాగమైపోయి, దాని ఉప ఉత్పత్తుల్ని (బై ప్రొడక్ట్స్) తయారు చేస్తూ పోతుంది. ఈ ఉప ఉత్పత్తులు, ప్రేగులు మరియు కాలేయంలో కణాల్ని నాశనం చేసే రసాయనాల్లాగా పనిచేస్తాయి. ఆల్కహాల్ శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిల్ని కూడా పెంచుతుంది, ఇది క్రమంగా రొమ్ము కేన్సర్ గా తయారయ్యే ప్రమాదాన్ని రెట్టింపు చేస్తుంది.

విపరీతంగా ఆల్కహాల్ తీసుకుంటే ఫోలేట్ అనబడే విటమిన్ బి స్థాయిలు పడిపోతాయి. ఇది పెద్దప్రేగు మరియు రొమ్ము కేన్సర్ రాగల ప్రమాదాన్ని మరింతగా పెంచుతుంది.

ఆల్కహాల్ చిన్న మొత్తాలలో సేవించినా గానీ కేన్సర్ వచ్చే అవకాశం ఉంది. రోజుకు ఒక సారి డ్రింక్ చేస్తే 4% -7% కేన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఎక్కువగా మద్యం సేవిస్తే, కేన్సర్ వచ్చే రిస్క్ కూడా పెరుగుతుంది. ధూమపానం మరియు మద్యపానం అలవాటున్నవారికి పొగాకు, ఆల్కహాల్ కలిసి శరీరంపై ప్రతికూలంగా పనిచేయడం వలన మరింత త్వరగా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది.

మద్యపానానికి ఒక సురక్షితమైన పరిమితి అంటూ ఏమీ లేదు, కానీ స్త్రీ పురుషులెవరైనా గానీ రోజుకి 2 డ్రింక్స్ లేదా వారానికి 14 యూనిట్లకు పరిమితం చేస్తే రిస్కు కూడా పరిమితుల్లో ఉంటుంది. ఒక యూనిట్ మద్యం సుమారు 250 మిల్లీల బీరు లేదా ఒక చిన్న గ్లాసు వైన్ లేదా 25 మిల్లీల స్పిరిట్ కొలతకు సమానంగా ఉంటుంది.

ఆల్కహాల్ ని ఈ లెవల్స్ కంటే తగ్గించి తీసుకోగలిగితే, కేన్సర్ వచ్చే ప్రమాదాన్ని బాగా తగ్గించవచ్చు లేదా పూర్తిగా నివారించవచ్చు.

కేన్సర్ పెరగడంలో ఆహారం ఒక ముఖ్యమైన పాత్రని పోషిస్తుంది. అందువలన, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే కేన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గుతుంది.

ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం

ఆరోగ్యకయమైన భరియు సభతలయ ఆహాయం తినడం ముఖ్యం. ఇది కేనసర్ పెరిగే ప్రమాదాన్ని తగ్గుతుంది.

సమీకృత ఆహారం 40-60% పిండిపదార్ధాలు, 10-30% ప్రోటీన్లు మరియు 20-30% క్రొవ్వుల్ని కలిగి ఉండాలి.

బియ్యం, గోధుమ వంటి పిండిపదార్ధాల్ని వాడాలి. పొట్టు తీయని గింజల్లో కార్బోహైడ్రేట్లలో పీచుపదార్థం (ఫైబర్) అధిక మొత్తంలో ఉంటుంది, ఇవి రిఫైన్ చేయబడిన గింజల కంటే మెరుగైన పోషక విలువల్ని కలిగి ఉంటాయి.

శాకాహారంలో ప్రోటీన్లు బీన్స్, బఠానీలు, సోయా ఉత్పత్తులు లేదా అన్ సాల్టెడ్ (లవణరహిత) నట్స్ లోనూ, మాంసాహారంలో చేప, కోడిలోనూ లభ్యమవుతాయి. గొర్రె, మటన్, పంది మాంసం, గొడ్డు మాంసం వంటి ఎర్ర మాంసాలు, ప్రోసెస్ చేయబడిన ఆహారంలో క్రొవ్వు పదార్ధాలు అధికంగా ఉంటాయి కాబట్టి వాటిని కనీస మోతాదులోనే ఉంచాలి.

సంతృప్త కొవ్వుల (జున్ను, వెన్న, నెయ్యి, ఐస్ క్రీం, మాంసం నుండి తీసిన క్రొవ్వులు) నుండి 10% కన్నాతక్కువ కేలరీలు తీసుకోవాలి. చక్కెర పదార్థాలు ఎక్కువగా ఉండే బిస్కెట్లు, స్వీట్లు, మరియు క్రొవ్వు పదార్ధాలలో ఎక్కువగా ఉన్న ఆహారాల్నీ తక్కువగా తీసుకోవాలి.

పండ్లు మరియు కూరగాయలు

ఒక రోజు మొత్తంలో పండ్లు మరియు కూరగాయలు కనీసం ఐదు భాగాలు తీసుకోవడం మంచిదని పరిశోధనలు సూచిస్తున్నాయి. వాటిలో విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థాలు పుష్కలంగా లభ్యమవుతాయి. పుష్కలమైన పోషక పదార్థాలు లభించే పండ్లు, కూరగాయల ఆహారం పెద్దప్రేగు కాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

నిర్దిష్ట ఆహార పదార్థాల సేవనం మరియు ఆహార పదార్థాలు

కొన్ని రకాల కేన్సర్లని తగ్గించే నిర్దిష్ట ఆహార పదార్థాల గురించి సాధారణంగా ఇంటర్నెట్లో సమాచారం ఉంటుంది. మొత్తంమీద చెప్పుకోవాలంటే, ఫలానా ఆహార పదార్థాలు, ఫలానా అనుబంధ పదార్థాల్ని సేవిస్తే కేన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని ఖచ్చితంగా రుజువులు, సాక్ష్యాలతో నిరూపించగలిగే పరిశోధనలేవీ లేవు. పైన పేర్కొన్న ఆరోగ్యకరమైన సంతులిత ఆహారం తినడం ఒక్కటే మంచి పని.

శరీరంలో అదనపు బరువు ఉండటమే స్థూల (ఊబ) కాయం. అధిక బరువు లేదా స్థూలకాయం అనేది సాధారణ పరిధి కంటే ఎక్కువ బరువును సూచిస్తుంది. ఎవరైనా ఊబకాయంతో ఉన్నారా లేదా అనేది నిర్ణయించడానికి బాడీ మాస్ ఇండెక్స్ (BMI) ని ఉపయోగిస్తారు. మీ కిలోగ్రాముల బరువును ఎత్తుతో విభజించడం ద్వారా BMI లెక్కించబడుతుంది. BMI 25 కంటే ఎక్కువ మరియు 29.9kg/m2 కంటే తక్కువగా ఉంటే అధిక బరువుని కలిగి ఉండడంగా నిర్వచించబడింది. BMI 30kg/m2 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు స్థూలకాయంగా నిర్వచించబడుతుంది.

ఊబకాయం ఉంటే పెద్దప్రేగు, పురీషనాళం కేన్సర్, రొమ్ము కేన్సర్, అన్నవాహిక కేన్సర్, గర్భాశయ కేన్సర్ మరియు మూత్రపిండాల కేన్సర్ తో సహా అనేక రకాల కేన్సర్లను అభివృద్ధి చేసే రిస్కు ఉంది. పాశ్చాత్య ప్రపంచంలో, సుమారు 20% కేన్సర్లకు ఊబకాయమే కారణమవుతుందని అంచనా వేయబడింది. ప్రతి సంవత్సరం భారతదేశంలో స్థూలకాయం (ఒబిసిటీ) సమస్య పెరుగుతోంది.

స్థూలకాయం చికిత్స

స్థూలకాయానికి చికిత్స చేస్తే కేన్సర్ వచ్చే ప్రమాదాన్నీ, అలాగే డయాబెటీస్, అధిక రక్తపోటు లేదా గుండె జబ్బుల ప్రమాదాన్నీ కూడా తగ్గించవచ్చు.

తీసుకునే కేలరీల్ని తగ్గించడం లేదా కేలరీల్ని వ్యయం చేయడం ద్వారా స్థూలకాయానికి చికిత్స చేస్తారు. సాధారణంగా ఈ రెండు ఎంపికల్నీ మిశ్రమ పద్ధతిలో సమర్థవంతంగా ఉపయోగిస్తే బరువు తగ్గడానికి బాగా ఉపకరిస్తుంది.

కేలరీల్ని తగ్గించి తీసుకోవడం (ఆహార నియంత్రణ), అలాగే వ్యాయామం చేయడం ద్వారా స్థూలకాయ నివారణలో ప్రారంభ దశను విజయవంతంగా పూర్తిచేయవచ్చు.

ఆహార నియంత్రణ

సాధారణంగా పెద్దవారికి 1 కేజీ బరువు ఉండాలంటే 25 kcal అవసరం. అందువలన, ఒక 70 కేజీల బరువున్న వ్యక్తి విషయంలో ఇది 1750 kcal కు సమానం. వ్యక్తుల బరువుల్లో ఉండే తేడాల వల్ల ఈ సంఖ్యకు + లేదా- 20% చేర్చబడుతుంది. తక్కువ కేలరీలు కలిగి ఉన్న ఆహార ప్రణాళిక (25kcal/kg) బరువు తగ్గించేందుకు సహాయపడుతుంది.

వ్యాయామం

శారీరక శ్రమ చేస్తూ శక్తిని ఖర్చుచేస్తూ ఉండడాన్ని ఎక్కువ చేయడం ద్వారా దీర్ఘకాలికంగా బరువుని నిర్వహించడానికి బాగా ఉపయోగపడుతుంది.

సర్జరీ

ఇప్పుడు స్థూలకాయ చికిత్స(బారియాట్రిక్ శస్త్రచికిత్స) కు శస్త్రచికిత్స విధానాల్ని సర్వసాధారణంగా ఉపయోగిస్తున్నారు. ఇటువంటి శస్త్రచికిత్సల్ని తట్టుకోవడానికి రోగులకు 40 కి పైగా BMI ఉండాలి, స్థూలకాయం తగ్గడానికి గతంలో నాన్-సర్జికల్ విధానాల్లో చేసిన ప్రయత్నాలన్నీ విఫలమై ఉండాలి. అలాంటి వారికి ఈ విధానం గురించి వివరంగా సమాచారం తెలియజేయబడుతుంది. 40 కంటే తక్కువ BMI ఉన్న రోగుల బరువుని తగ్గించడానికి శస్త్రచికిత్స కూడా మంచి ప్రభావవంతమైన విధానం.

శారీరక శ్రమ తగ్గించుకుంటే కేన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కొద్దిపాటి శారీరక శ్రమతో పెద్దప్రేగు, రొమ్ము, ప్యాంక్రియాటిక్, కాలేయ మరియు ఉదర కేన్సర్ ప్రమాదాల్ని తగ్గించుకోవచ్చు.ఈ కేన్సర్లన్నింటిలోకీ రొమ్ము మరియు పెద్దప్రేగు కాన్సర్ల ప్రమాదాల్ని తగ్గించడానికి శారీరక శ్రమ బాగా ఎక్కువ ఉపయోగపడుతుంది.

ఈ ప్రమాదాల్ని తగ్గించడానికి గరిష్ఠంగా ఎంత శారీరిక శ్రమ చేయాల్సి ఉంటుందో ఖచ్చితంగా తెలియదు.

మరణానికి గల మొదటి ఐదు కారకాల్లో ధూమపానం లేదా ఇతర మార్గాల ద్వారా పొగాకుని వినియోగించడం ప్రధాన కారకాలుగా ఉన్నాయి. పొగాకుని ఉపయోగించడం వల్ల కేన్సర్, గుండె జబ్బులు, స్ట్రోక్, COPD, ఇంకా ఛాతీకి సంబంధించిన అంటురోగాలు వస్తున్నాయి. 2030 నాటికి, పొగాకు వాడకం సుమారు 8 మిలియన్ల ప్రజల మరణానికి కారణమవుతుందని అంచనా వేయబడింది, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా 10% మరణాలు సంభవిస్తున్నాయి.

ధూమపానం చేసేవారు జీవితంలో సగటున 10 సంవత్సరాల ఆయుర్దాయాన్ని కోల్పోతారు. అలాగే, ధూమపానం చేసేవారిలో దాదాపు 50% పొగాకు సంబంధిత వ్యాధులతో చనిపోతారు.

2010 లో ప్రపంచ ఆరోగ్య సంస్థ భారతదేశంలో GATS నిర్వహించిన సర్వేలో 35% కంటే ఎక్కువ మంది భారతదేశంలో పొగాకును ఏదో ఒక రూపంలో ఉపయోగిస్తున్నారని తేలింది. వాళ్ళలో మూడింట రెండో వంతు మంది స్మోక్‌లెస్ టుబాకో వాడుతున్నారు. ఖైనీ (పొగాకు, నిమ్మకాయ మిశ్రమం) స్మోక్‌లెస్ టుబాకోకి సాధారణ రూపం. దీనితో బాటు గుట్ఖా కూడా వాడతారు. ధూమపానం కోసం వాడే పొగాకులో సాధారణంగా బీడీ అనేది సిగరెట్ కంటే ఎక్కువగా ఉపయోగించబడుతోంది. పొగాకు నమలడం వల్ల నోటిలోనూ, గొంతులోనూ కాలానుగుణంగా మార్పుల్ని తీసుకోస్తుంది, ఈ మార్పులు కేన్సర్ కి దారితీస్తాయి.

ధూమపానం మరియు క్యాన్సరు

ధూమపానం మరియు కేన్సర్

ధూమపానం అనేది కేన్సర్ పెరగడానికి దారితీసే కారకాల్లో చాలా ప్రధానమైన ప్రమాద కారకం. ధూమపానం, ఊపిరితిత్తులు, ఆహారనాళం, మూత్రాశయం, నోరు, గొంతు, నాలుక మొదలైనవాటితో సహా తల, మెడ ప్రాంతం వద్ద కేన్సర్ పెరిగే ప్రమాదాన్ని ఎన్నో రెట్లు పెంచుతుంది. భారతదేశంలో స్మోక్ లెస్ టుబాకో వాడకం బాగా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కేన్సర్ నోటి ప్రాంతంలో వచ్చే అవకాశాలే బాగా ఎక్కువగా ఉంటాయి.

పొగాకు పొగలో వందల కొద్దీ ఉండే పేరు తెలియని ఇతర రసాయనాలతో సహా తెలిసిన రసాయనాల్లో కూడా సుమారు 70 దాకా కేన్సర్ కారకాలున్నాయి.

పొగాకు పొగలో కేన్సర్ కలిగించే రసాయనాల్లో ఇవి కూడా ఉన్నాయి

  • తారు
  • పోలోనియం-210
  • కాడ్మియం
  • బెంజీన్‌
  • నికెల్‌
  • ఆర్సెనిక్‌
  • ఫార్మాల్డిహైడ్
  • పోలీసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్లు
  • ఆక్రోలిన్‌
  • నైటోసమిన్లు
  • క్రోమియం
  • అలాగే ఇతర రసాయనాలు

అమోనియా, కార్బన్ మోనాక్సైడ్, నత్రజని ఆక్సైడ్లు, హైడ్రోజన్ సైనైడ్ ఇంకా అనేక రకాల ఇతర రసాయనాలు కూడా ఉన్నాయి.

ధూమపానం కేన్సర్ కి కారణమెలా అవుతుంది

పొగాకులోని రసాయనాల్ని పీల్చుకోవడం లేదా లోపలికి తీసుకోవడం చేస్తే అవి శరీరంలోని సాధారణ నిర్మాణాల్ని దెబ్బతీస్తాయి. ఉదాహరణకు, నత్రజని ఆక్సైడ్లు ఊపిరితిత్తుల్లో గాలి ప్రవేశ మార్గాల్ని ఇరుకుగా చేసి ఊపిరి సలపకుండా చేస్తాయి. హైడ్రోజన్ సైనేడ్, అమోనియా ఊపిరితిత్తుల్ని శుభ్రపరిచే కార్యకలాపాల్ని ప్రభావితం చేయడం ద్వారా ఊపిరితిత్తులలో ఉన్న విషాన్ని శుభ్రపరచనీయకుండా అడ్డుకుంటాయి. సిగరెట్ పొగలో ఉండే రేడియోధార్మిక పోలోనియం-210 వాయు మార్గాల్లో ఉండే కణాల్ని రేడియేషన్ కి గురి చేసి నష్టం కలుగజేస్తుంది.

ఈ కార్సినోజెన్లలో కొన్ని శరీరంలోకి శోషించుకోబడి, ఇతర అవయవాలను ప్రభావితం చేస్తాయి. ఈ స్థితి వల్ల ఆ అవయవాల్లో కేన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

రసాయనిక కార్సినోజెన్లు కణాలలో DNA తో కలిపి జన్యువులలో శాశ్వత మార్పుల్ని సృష్టిస్తాయి.

దీనితో కణంలో పెరుగుదలని నియంత్రించే ప్రక్రియలు దెబ్బతింటాయి, అందువల్ల ఇది కేన్సర్ దారితీస్తుంది. కేన్సర్ రావడానికీ ధూమపానానికీ నేరుగా సంబంధం ఉందని అనేకమంది విషయంలో రుజువైంది.

పొగాకు మత్తుని కలిగించే వ్యసనమా

పొగాకు ఖచ్చితంగా మత్తుని కలిగించే వ్యసనమే. పొగాకుని నమలినప్పుడు లేదా ధూమపానం చేసినప్పుడు, ఇది మత్తుని కలిగించే నికోటిన్ ని కలిగి ఉంటుంది. ఇది మత్తుని కలిగించే హెరాయిన్ లేదా కొకైన్ వంటి మాదకద్రవ్యాల్లాగానే మనిషిని బానిసగా చేసుకుంటుంది. సిగరెట్ పొగ పీల్చుకున్న వెంటనే, నికోటిన్ మెదడుకి చేరి, డోపామైన్ విడుదలను ప్రేరేపించడం వల్ల ఇది ఆనందంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ధూమపానం చేస్తే చాలా బాగుందనే మంచి అనుభూతి కలిగి ఆ రెండింటికీ మధ్య ఒక లింక్ ఏర్పడుతుంది. ఇది మెల్లగా అలవాటుగానూ ఆ తరువాత వ్యసనంగా మారడానికి దారితీస్తుంది. అకస్మాత్తుగా ధూమపానం ఆపితే చిరాకు, ధూమపానం చేయాలనే తహతహ, విశ్రాంతి లేకపోవడం, ఆందోళన, నిద్రపట్టక పోవడం, బరువు పెరుగుట వంటి ఉపసంహరణ ప్రభావ లక్షణాలు కనిపిస్తాయి.
ధూమపానం ఆపిన తరువాత, ఈ ఉపసంహరణ ప్రభావ లక్షణాలు మెల్లగా ఒక నెలలో సర్దుకుంటాయి.

ధూమపానం మానడం

ధూమపానం లేదా పొగాకును నమలడాన్ని నిలిపివేయడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. 10 సంవత్సరాలకి పైగా ధూమపానం మానేస్తే ఆ విధంగా పొగ పీల్చడం మానేసిన వ్యక్తికి కేన్సర్ తిరిగి వచ్చే ప్రమాదం తగ్గుతుంది. కేన్సర్ ప్రమాదాన్ని తగ్గించడమే కాకుండా, గుండె జబ్బులు. అలాగే గుండె పోటు వచ్చే ప్రమాదాల్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది.

ధూమపానం ఆపితే మామూలుగా ఆరోగ్యకరంగా జీవితం గడపవచ్చు, ఇది చాలా డబ్బును ఆదా చేస్తుంది.

కేన్సర్ ఉందని నిర్ధారించబడిన తర్వాత కూడా ధూమపానం ఆపితే కూడా అది మంచిదే. ఇది కేన్సర్ ని బాగా నియంత్రిస్తుంది మరియు తిరిగి కేన్సర్ రాగల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

మీరు ధూమపానం విడిచిపెట్టడానికి ఈ క్రింది చర్యలు తీసుకోవచ్చు

ధూమపానం మానడానికి ఒక ప్రారంభ తేదీని నిర్ధారించుకోండి

మీరు ధూమపానం వదిలివేస్తున్నట్లు స్నేహితులకీ కుటుంబ సభ్యులకీ చెప్పండి

ఇల్లు, పని ప్రదేశం, కారు మొదలైన చోట్ల సిగరెట్లు గానీ, ఇతర పొగాకు ఉత్పత్తులు గానీ లేకుండా చేయండి.

విడిచిపెట్టేటప్పుడు మరీ మానలేని క్లిష్ట పరిస్థితుల గురించి ఆలోచించి ప్రణాళిక సిద్ధం చేసుకోండి

క్రమం తప్పకుండా వ్యాయామం చేసుకోండి

ధూమపానం చేయకండి, లేదా ధూమపానంతో సంబంధం ఉన్న ప్రాంతాల నుండి దూరంగా ఉండండి

మీరు మళ్ళీ ధూమపానం ప్రారంభించినా కూడా ఆ అలవాటుని విడిచిపెట్టే ప్రయత్నం మానుకోవద్దు. విజయం సాధించే ముందు అనేక ప్రయత్నాలు చేయాల్సి రావడం సహజమే.

పొగాకు మానడానికి సహకరించే అనేక ఔషధాలు మరియు సహకరించే ఇతర చికిత్సలు ఉన్నాయి.

అవి ఈ క్రింద ఇవ్వబడుతున్నాయి.

ధూమపానం విడిచిపెట్టడానికి సహాయపడే మందులు

ధూమపానం మానడానికి అత్యంత ప్రభావవంతమైన చికిత్సలు నికోటిన్ రిప్లేస్మెంట్, బుప్రోపియన్ (జిబాన్) మరియు వరేనిక్లైన్ల వాడకం

నికోటిన్ రిప్లేస్మెంట్ ఒక పాచ్ రూపంలో అందుబాటులో ఉంటుంది, ఇది చర్మానికి రాసుకోవచ్చు, గమ్స్ న రూపంలో నమలవచ్చు, నికోటిన్ స్ప్రేలు, తీయని మాత్రల (లోజెంగెస్) రూపంలో తీసుకోవచ్చు. ఈ అంశీభూతాలు (ఏజెంట్లు) ధూమపానం ఆపటం వల్ల కలిగే ఉపసంహరణ ప్రభావాల్ని నియంత్రించడానికి సహాయపడతాయి. ఏ ఆప్షన్ ని ఉపయోగించాలో, ఉపయోగించడానికి సరైన శక్తివంతమైనదేదో డాక్టర్ తో మాట్లాడండి. పాచెస్ లేదా ఇంకా అరుదైన ఇతర ఫార్ములేషన్లను ఉపయోగించి నికోటిన్ పై ఆధారపడే అవకాశాన్ని కొనసాగించవచ్చు.

ధూమపానం విడిచిపెట్టడానికి సహాయంచేసే బుప్రోపియన్ మందుని ఉపయోగిస్తారు. “మానాలనుకున్న రోజు”కి ఒక వారం ముందు నుంచీ మొదలుపెట్టి వారం రోజుల వరకు రోజుకి ఒక మాత్ర వేసుకోవాలి. ఇది 12 వారాల పాటు తీసుకోవాలి. ధూమపానం మానడానికి ఈ మందు తీసుకోనివారితో పోలిస్తే, తీసుకున్నవారు రెట్టింపు వేగంతో మానే అవకాశం ఉంది.

వరేనిక్లైన్ ధూమపానాన్ని ఆపడానికి సహాయపడే మరొక ఔషధం. ధూమపానం విడిచిపెట్టడానికి ఒక వారం ముందు నుంచీ దీన్ని ప్రారంభించాలి.

ఈ మాత్రని రోజుకి ఒకటి వేసుకోవాలి. ఇది 12 వారాల పాటు ఇవ్వబడుతుంది. విజయవంతమైతే మరో 12 వారాల పాటు వాడవచ్చు.

ఈ చికిత్సలన్నీ దుష్ప్రభావాల్ని కలిగివుంటాయి, కాబట్టి ఈ చికిత్సలపై ముందు డాక్టర్ తో మాట్లాడటం ముఖ్యం.

ప్రత్యామ్నాయ చికిత్సలు

ధూమపానం ఆపడానికి వివిధ ప్రత్యామ్నాయ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ప్రవర్తనలో మార్పు తెచ్చే చికిత్స (కౌన్సిలింగ్), ఆక్యుపంక్చర్ మరియు హిప్నోథెరపీ అనే కొన్ని ఎంపికల్ని ప్రయత్నించవచ్చు.

కేవలం థెరపీ ఒక్కటే కాకుండా ప్రవర్తనలో మార్పు తెచ్చే చికిత్సతో బాటు ఔషధాల్ని కూడా కలిపి ఇచ్చే మిశ్రమ చికిత్సతో ధూమపానం వదిలివేసే అవకాశాలు మరింత మెరుగ్గా ఉంటాయి.

కుటుంబం నుంచీ, స్నేహితుల నుంచీ లభించే మంచి ప్రోత్సాహం, వారి మద్దతు ఈ ప్రక్రియలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

ఎన్నో రకాల కేన్సర్లు కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్ల వంటివి కలిగి ఉంటాయి. ఈ వైరల్ ఇన్ఫెక్షన్లు సాధారణ కణాలలో మార్పులను కలిగించడం ద్వారా కేన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.

కేన్సర్ సంబంధం ఉన్న వైరస్ లలో ఇవి కూడా ఉన్నాయి.

హెచ్‌పివి

ఇది మానవుల్లో వచ్చే పపిల్లోమావైరస్. ఇది గర్భాశయ కేన్సర్, గుద కేన్సర్లు కొన్ని రకాల తల, మెడ కేన్సర్ల పెరుగుదలకి కారకమవుతుంది.

హెపటైటిస్ బి మరియు సి

ఈ వైరస్ లు హెపటోసెల్యులార్ (లివర్) కేన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి.

హెచ్‌టిఎల్‌వి 1

ఈ వైరస్ కొన్ని రకాల ల్యుకేమియాకు కారణమవుతుంది.

హెచ్‌ఐవి

మానవ రోగనిరోధక శక్తిని పోగొట్టి ఎయిడ్స్ కి కారణమయ్యే వైరస్ కొన్ని లింఫోమాస్ మరియు కపోసీ సర్కోమాలను కలిగించవచ్చు.

ఇబివి

ఎప్స్టీన్ బార్ వైరస్ బుర్కిట్ లింఫోమా, అలాగే నాసోఫారింజియల్ కేన్సర్లకి కారకమవుతుంది.

ఈ వైరస్ లలో ఎక్కువ భాగం సంక్రమణ సోకిన రక్తం లేదా శరీర ద్రవాల వల్ల వస్తుంది. వాడిపారేసే సిరంజిల్ని ఉపయోగించడం, రక్తమార్పిడి ముందు సరైన రీతిలో రక్తం లేదా రక్త ఉత్పత్తుల్ని పరీక్షించి ఈ రకమైన కేన్సర్లు రాకుండా నిరోధించవచ్చు.

ఈ వైరస్ లలో రెండు రకాల అంటువ్యాధుల నివారణకు టీకాలు అందుబాటులో ఉన్నాయి.

హెచ్‌పివి టీకా

ప్రధానంగా గర్భాశయ కేన్సర్ దారితీసే HPV సంక్రమణను నివారించడానికి టీకాలు అందుబాటులో ఉన్నాయి. HPV లైంగిక చర్య ద్వారా చర్మం ద్వారా వ్యక్తి నుంచి వ్యక్తికి ప్రసారం చేయబడే ఒక వైరస్.

ఈ టీకా 9 నుండి 26 ఏళ్ల మధ్య వయస్సులో ఉన్న పిల్లలకు ఇవ్వబడుతుంది. ఒక ఆడపిల్ల లేదా మహిళ లైంగికంగా చురుకుదనం సంతరించుకోక ముందే ఈ టీకా ఇస్తే ఇది గరిష్ట ప్రయోజనం కలుగజేస్తుంది. లైంగిక క్రియాశీలత తరువాత కూడా టీకాలు వేయబడవచ్చు, కానీ అప్పటికే ఆ స్త్రీ అలాంటి వైరస్ ని కలిగి ఉంటే, అప్పుడు కలిగే ప్రయోజనం పరిమితం కావచ్చు. పూర్తి రోగనిరోధక శక్తిని పొందేందుకు టీకాని మూడు మోతాదుల్లో ఇవ్వడం అవసరం.

ఇంజక్షన్ల రూపంలో ఇవ్వబడే రెండు ఫార్ములేషన్లు అందుబాటులో ఉన్నాయి. గార్డసిల్ ని 0, 2 మరియు 6 నెలల్లో మూడు మోతాదులు, మరియు సెర్వరిక్స్ 0, 1 మరియు 6 నెలల్లో మూడు మోతాదులు ఇవ్వబడతాయి. ఆ తరువాత బూస్టర్ మోతాదులు అవసరం లేదు.

భారతదేశంలో సాధారణ కేన్సర్లో ఒకటైన గర్భాశయ కేన్సర్ ప్రమాదాన్ని ఈ టీకామందు బాగా తగ్గిస్తుంది.

పైన పేర్కొన్న వయస్సులో మగపిల్లలు మరియు పురుషులకి పై టీకాలు కూడా సిఫార్సు చేస్తారు.

హెపటైటిస్ బి టీకా

హెపాటిటిస్ బి సంక్రమణ నివారించడానికి అందుబాటులో ఉన్న ఒక టీకా. హెపటైటిస్ బి ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉన్నందువల్ల భారతదేశంలో ఉన్నవారందరికీ ఈ టీకా సిఫార్సు చేయబడింది. సాధారణంగా ఈ టీకా ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో పిల్లలకు ఇవ్వబడుతోంది. అలాంటి ప్రోగ్రాంలో టీకా ఇవ్వబడనివారు, హెపటైటిస్ బి కి రాకుండానూ, హెపటోసెల్యులార్ కార్సినోమా పెరిగే ప్రమాదం రాకుండానూ, టీకాలు వేయించాలి. ఈ టీకా 0, 1 మరియు 6 నెలల సమయంలో ఇంజెక్షన్ గా ఇవ్వబడుతుంది.