Screening for Cancer

క్యాన్సర్ కోసం స్క్రీనింగ్

క్యాన్సర్ కోసం స్క్రీనింగ్ అంటే ఏమిటి?

క్యాన్సర్ కోసం స్క్రీనింగ్ అనేది క్యాన్సర్ లేదా క్యాన్సర్కు దారితీసే ముందస్తు పరిస్థితుల కోసం సాధారణ జనాభాలో క్రమానుగతంగా పరీక్షలు చేసే ప్రక్రియ.

స్క్రీనింగ్ యొక్క ప్రయోజనం ఏమిటి?

చాలా రకాల క్యాన్సర్లు ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఎటువంటి లక్షణాలను కనబరచవు. అవి లక్షణాలను ఉత్పత్తి చేసి, గుర్తించే సమయానికి, క్యాన్సర్లు మరింత ఎక్కువ దశలో ఉంటాయి మరియు అందువల్ల నయం చేయడం కష్టమవుతుంది. స్క్రీనింగ్ ఈ క్యాన్సర్లను ముందుగానే గుర్తించడానికి మరియు నయం చేసే అవకాశాన్ని పెంచడానికి సహాయపడుతుంది.

కింది క్యాన్సర్లకు స్క్రీనింగ్ అందుబాటులో ఉంది

  • రొమ్ము క్యాన్సర్
  • పెద్దప్రేగు మరియు పురీషనాళ క్యాన్సర్
  • శుక్రాశయగ్రంథి క్యాన్సర్
  • గర్భాశయ క్యాన్సర్
  • ఊపిరితిత్తుల క్యాన్సర్

రొమ్ము క్యాన్సర్ కోసం స్క్రీనింగ్ అనేది క్యాన్సర్ పూర్వ రొమ్ము వ్యాధి మరియు రొమ్ము క్యాన్సర్‌ను ముందుగా గుర్తించడంలో సహాయపడాటానికి చేసే స్క్రీనింగ్ పరీక్షలను కలిగి ఉంటుంది. క్యాన్సర్‌కు ముందు రొమ్ము వ్యాధి చికిత్స చెయ్యకుండా వదిలివెయ్యబడిన రొమ్ము పరిస్థితులను కలిగి ఉంటుంది, ఇది చికిత్స చేయకపోతే కాలక్రమేణా క్యాన్సర్‌గా మారుతుంది.

స్క్రీనింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటంటే, క్యాన్సర్లు చిన్నగా ఉన్నప్పుడు వాటిని గుర్తించవచ్చు, నివారణకు అవకాశం పెరుగుతుంది. అలాగే, చిన్న క్యాన్సర్లు కనిపించినప్పుడు, వాటిని మాస్టెక్టమీ (రొమ్ము తొలగింపు) కాకుండా లంపెక్టమీ (గడ్డను మాత్రమే తొలగించడం) తో చికిత్స చేయవచ్చు.

బ్రెస్ట్ స్క్రీనింగ్ నుండి ఎవరు ప్రయోజనం పొందుతారు?

40 ఏళ్లు పైబడిన మహిళలందరికీ బ్రెస్ట్ స్క్రీనింగ్ పరిగణించాలి మరియు స్క్రీనింగ్ కనీసం 70 వరకు కొనసాగాలి. రొమ్ము క్యాన్సర్ యొక్క బలమైన కుటుంబ చరిత్ర ఉన్న మహిళలకు, స్క్రీనింగ్ 30 నుండి ప్రారంభించాలి.

రొమ్ము స్క్రీనింగ్ ఎలా చేస్తారు?

రొమ్ము స్క్రీనింగ్ మామోగ్రామ్ చేత చేయబడుతుంది. మామోగ్రామ్ అనేది రొమ్ము పరిస్థితులను గుర్తించడానికి ఉపయోగించే సాధారణ పరీక్ష. ఇది రొమ్ముకు తక్కువ మోతాదులో ఇవ్వబడే ఎక్స్-రే. పరీక్ష సమయంలో, రొమ్ము ఒక పలకపై నొక్కబడుతుంది మరియు రెండు ఎక్స్-రేలు వేర్వేరు కోణాల్లో తియ్యబడతాయి. రెండు రొమ్ములపై ​​ఎక్స్‌రేలు తియ్యబడతాయి. గడ్డ అనుభూతి చెందక ముందే మామోగ్రామ్‌లు రొమ్ము క్యాన్సర్‌లను గుర్తించగలవు. ఇవి సాధారణంగా 40 ఏళ్లు పైబడిన మహిళల్లో జరుగుతాయి. మామోగ్రామ్‌లు సాధారణంగా నొప్పిలేకుండా ఉంటాయి. రొమ్మును ప్లేట్ పై అదిమినప్పుడు కొంతమంది మహిళలకు అసౌకర్యంగా ఉండవచ్చు. మామోగ్రామ్‌లు బహిష్టు సమయంలో లేదా ఒక వారం ముందు చేయకూడదు. మామోగ్రామ్‌లు తక్కువ సున్నితమైనవి కాబట్టి 40 ఏళ్లలోపు మహిళల్లో రొమ్ము ఎంఆర్‌ఐ మరియు మామోగ్రామ్ రెండూ చేయబడతాయి.

మామోగ్రామ్ ఫలితం వెంటనే అందుబాటులో ఉండకపోవచ్చు అందువలన మరొక రోజు అపాయింట్‌మెంట్ ఏర్పాటు చేయబడుతుంది.

మామోగ్రామ్ సాధారణంగా ఉంటే, అది రెండు సంవత్సరాలలో మళ్ళీ చేయించుకోవాలి మరియు ప్రతి రెండు సంవత్సరాలకు కనీసం 70 సంవత్సరాల వయస్సు వరకు పునరావృతం చేయాలి. కొన్ని దేశాలు ప్రతి సంవత్సరం మామోగ్రామ్ను, ఇంకొన్ని ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి సిఫార్సు చేస్తాయి. మామోగ్రామ్‌లో అసాధారణత కనుగొనబడితే, క్యాన్సర్ ఉందని దీని అర్థం కాదు. క్యాన్సర్ లేని పరిస్థితులు చాలా మామోగ్రామ్‌లో కనిపిస్తాయి. అసాధారణతను పరిశోధించడానికి రొమ్ము అల్ట్రాసౌండ్ మరియు బయాప్సీ వంటి మరిన్ని పరీక్షలు అవసరం.

పెద్దప్రేగులో పురీషనాళం ఒక భాగము. పెద్దప్రేగును అంధాంతరం, అధిరోహి పెద్దప్రేగు, విలోమ పెద్దప్రేగు, అవరోహణ పెద్దప్రేగు మరియు డింబముగా విభజించవచ్చు. పురీషనాళం పెద్ద ప్రేగు యొక్క అత్యంత దిగువ భాగంలో డింబము మరియు పాయువు మధ్య ఉంటుంది.

ప్రేగు క్యాన్సర్ కోసం స్క్రీనింగ్ ప్రారంభ దశలో ప్రేగు క్యాన్సర్‌ను గుర్తించడానికి సహాయపడుతుంది, అందువలన నయం చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. స్క్రీనింగ్ ప్రేగులోని పాలిప్స్ గుర్తించడానికి కూడా సహాయపడుతుంది. పాలిప్స్ పెద్ద ప్రేగు యొక్క లోపలి పొరలో చిన్న కణుతుల పెరుగుదల. అవి ఎటువంటి లక్షణాలను ఉత్పత్తి చేయవు మరియు కొంత కాలానికి క్యాన్సర్‌గా అభివృద్ధి చెందవచ్చు. స్క్రీనింగ్ సమయంలో పాలిప్స్ కనిపిస్తే వాటిని శస్త్రచికిత్స విచ్ఛేదనం ద్వారా తొలగించవచ్చు.

ప్రేగు క్యాన్సర్ స్క్రీనింగ్ నుండి ఎవరు ప్రయోజనం పొందుతారు?

ప్రేగు క్యాన్సర్ స్క్రీనింగ్‌ను 50 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ పరిగణించాలి. ప్రేగు క్యాన్సర్ యొక్క బలమైన కుటుంబ చరిత్ర ఉన్న రోగులు, 40 సంవత్సరాల వయస్సు నుండి స్క్రీనింగ్‌ను పరిగణించాలి.

ప్రేగు క్యాన్సర్ స్క్రీనింగ్ ఎలా జరుగుతుంది?

ప్రేగు క్యాన్సర్ స్క్రీనింగ్ అనేక విధాలుగా చేయవచ్చు.

గూఢమైన రక్తం కోసం మలం (ఎఫ్ఓబి)

తక్కువ మొత్తంలో రక్తం ఉందేమో చూడటానికి మలం సేకరించి చేసే పరీక్ష ఇది. ప్రేగులలోని పాలిప్స్ మరియు క్యాన్సర్లు రక్తస్రావానికి కారణం అవుతాయి. గూఢమైన అంటే కంటికి కనబడనిది, అందువల్ల ఈ పరీక్ష మలం లో కనిపించని రక్తాన్ని చూడటమే లక్ష్యంగా పెట్టుకుంది.

పరీక్ష సానుకూలంగా ఉంటే, ఆ వ్యక్తి కోలనోస్కోపీ కోసం పంపబడతాడు. ఇది ప్రతికూలంగా ఉంటే (రక్తం కనుగొనబడలేదు),
ప్రతి సంవత్సరం పరీక్ష పునరావృతమవ్వాలి.

ఫ్లెక్సిబుల్ సిగ్మోయిడోస్కోపీ

ఈ పరీక్షలో ఒక అనువైన సన్నని గొట్టం చివర కెమెరా పెట్టి పాయువులోకి చొప్పించబడుతుంది. ఈ పరీక్ష పాలిప్స్ మరియు క్యాన్సర్ కోసం ఎడమ వైపు పెద్దప్రేగు మరియు పురీషనాళాన్ని దృశ్యమానం చేయడానికి సహాయపడుతుంది. పరీక్ష అవుట్ పేషెంట్ ప్రాతిపదికన చేయవచ్చు మరియు సురక్షితం. దీనికి ప్రేగు సిద్ధం చెయ్యాల్సిన అవసరం లేదు. పరీక్ష యొక్క ప్రతికూలత ఏమిటంటే ఇది మొత్తం పెద్దప్రేగును దృశ్యమానం చేయదు. ఈ పరీక్ష స్క్రీనింగ్ కోసం ఉపయోగించబడితే, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఇది పునరావృతం చేయాలి.

కోలోనోస్కోపీ

ఈ పరీక్ష కెమెరా అమర్చబడిన సన్నని గొట్టాన్ని ఉపయోగిస్తుంది. పురీషనాళం మరియు పెద్దప్రేగు యొక్క మొత్తం పొడవు వరకు ఈ గొట్టం అసాధారణతలను వెతకవచ్చు. పాలిప్స్ కనుగొనబడితే, వాటిని అదే సమయంలో తొలగించవచ్చు. తగినంతగా ప్రేగు సిద్ధం చేసుకున్న తర్వాత పరీక్ష చేయాల్సి ఉంటుంది. ప్రక్రియకు ముందు రోజు ఇచ్చిన భేదిమందుల వాడకంతో ప్రేగు సిద్ధం చెయ్యడం జరుగుతుంది, తద్వారా పరీక్ష సమయంలో ప్రేగులు ఖాళీగా ఉంటాయి. కోలనోస్కోపీ సాధారణమైతే, ప్రతి పదేళ్ళకు ఒకసారి పునరావృతం చేయాలి.

శుక్రాశయ గ్రంథి మగవారిలో మాత్రమే ఉంటుంది. ఇది ప్రోస్టాటిక్ ద్రవాన్ని ఉత్పత్తి చేస్తుంది, ఇది వీర్యం యొక్క భాగం.

వృద్ధ జనాభాలో ప్రోస్టేట్ క్యాన్సర్ ఒక సాధారణ క్యాన్సర్. శుక్రాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రారంభ దశలో ఉన్న శుక్రాశయ క్యాన్సర్‌ను గుర్తించడంలో సహాయపడుతుంది.

శుక్రాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ నుండి ఎవరు ప్రయోజనం పొందుతారు?

శుక్రాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ 50 సంవత్సరాల తరువాత పురుషులకు అందించబడుతుంది. 70-75 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు వరకు స్క్రీనింగ్ కొనసాగించవచ్చు.

శుక్రాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ ఎలా జరుగుతుంది?

శుక్రాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ పీఎస్ఏ పరీక్ష సహాయంతో జరుగుతుంది. పీఎస్ఏ అంటే ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్. ఇది రక్తంలో ఉండే ప్రోటీన్ మరియు శుక్రాశయ క్యాన్సర్ ఉన్నవారిలో ఇది పెరుగుతుంది. క్యాన్సర్ లేని పరిస్థితులలో కూడా పీఎస్ఏ ఎక్కువగా ఉండవచ్చు. అందువల్ల, పిఎస్‌ఎను ఎక్కువగా ఉండటం అంటే క్యాన్సర్ ఉందని ఎల్లపుడూ అర్థం కాదు. ఒకే రక్త పరీక్ష పీఎస్ఏ ఫలితాన్ని ఇస్తుంది.

పిఎస్‌ఎతో పాటు, శుక్రాశయ గ్రంధిని డాక్టర్ తనిఖీ చేస్తారు.

పిఎస్‌ఎ పెరిగినట్లయితే, శుక్రాశయ బయాప్సీ సలహా ఇవ్వబడుతుంది మరియు పిఎస్‌ఎ సాధారణమైతే, ప్రతి 2-4 సంవత్సరాలకు ఒక పునరావృత పిఎస్‌ఎ జరుగుతుంది.

గర్భాశయ గ్రీవం గర్భాశయం (గర్భం) యొక్క దిగువ భాగం. గర్భాశయ క్యాన్సర్ గర్భాశయ గ్రీవం నుండి అభివృద్ధి చెందుతుంది. గర్భాశయ క్యాన్సర్ భారతదేశంలో చాలా సాధారణం మరియు గర్భాశయ క్యాన్సర్ యొక్క ముందస్తు పరిస్థితులను మరియు క్యాన్సర్‌ను గుర్తించడంలో స్క్రీనింగ్ సహాయపడుతుంది. సర్వైకల్ ఇంట్రా ఎపిథీలియల్ నియోప్లాసియా (సిఐఎన్ 1-3) అనేది ఒక క్యాన్సర్ ముందస్తు పరిస్థితి, ఇది కొంతకాలానికి గర్భాశయ క్యాన్సర్‌గా అభివృద్ధి చెందవచ్చు. ఈ పరిస్థితులను ముందుగానే గుర్తించడం వల్ల నివారణకు అవకాశం పెరుగుతుంది.

గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ నుండి ఎవరు ప్రయోజనం పొందుతారు?

గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ 20 ఏళ్లు పైబడిన మహిళలందరికీ అందించాలి. ఈ పరీక్ష ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి 65 సంవత్సరాల వయస్సు వరకు కొనసాగుతుంది.

గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ ఎలా జరుగుతుంది?

పాప్ స్మియర్ పరీక్ష సహాయంతో గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ జరుగుతుంది. క్యాన్సర్ లేదా గర్భాశయంలో క్యాన్సర్‌కు దారితీసే మార్పుల కోసం డాక్టర్ చేసే పరీక్ష ఇది.

గర్భాశయ నుండి కొన్ని కణాలను తీసుకోవడానికి డాక్టర్ ఒక చిన్న సాధనాన్ని ఉపయోగిస్తారు. ఈ కణాలను మార్పుల కోసం సూక్ష్మదర్శిని క్రింద చూస్తారు. పరీక్ష కొద్దిగా అసౌకర్యాన్ని కలిగిస్తుంది కాని బాధాకరమైనది కాదు.

30 సంవత్సరాల వయస్సు తరువాత, హెచ్.పి.వి పరీక్షతో పాటు పాప్ స్మియర్ పరీక్ష జరుగుతుంది. హెచ్.పి.వి అంటే హ్యూమన్ పాపిల్లోమా వైరస్ మరియు అది ఉన్నట్లయితే గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది చాలా మంది మహిళలు తమ జీవితంలో కొంత సమయంలో పొందే సాధారణ వైరస్. పాప్ స్మెర్ కోసం తీసుకున్న కణాలను హెచ్.పి.వి కోసం కూడా పరీక్షించవచ్చు

పరీక్ష ఫలితాలు ఒకటి లేదా రెండు రోజుల్లో లభిస్తాయి. పరీక్ష అసాధారణంగా అంటే క్యాన్సర్ ఉందని కాదు మరియు అసాధారణ స్మియర్ పరీక్ష ఉన్న చాలా మంది మహిళలకు క్యాన్సర్ లేదు.

పరీక్ష అసాధారణంగా ఉంటే, హెచ్.పి.వి చేయకపోతే ఆ పరీక్ష లేదా గర్భాశయాన్ని దగ్గరగా చూడటానికి కాల్‌పోస్కోపీకి డాక్టర్ సలహా ఇవ్వవచ్చు. కొన్నిసార్లు, 12 నెలల్లో పాప్ స్మియర్ మళ్ళీ అవసరం కావచ్చు.

కాల్‌పోస్కోపీ అనేది ఒక పరీక్ష, ఇందులో డాక్టర్ గర్భాశయాన్ని దగ్గరగా పరిశీలించి, అవసరమైతే బయాప్సీ తీసుకోవచ్చు.

పాప్ స్మియర్ సాధారణమైతే, ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పునరావృతం చేయాలి. 30 సంవత్సరాల వయస్సు తరువాత, పాప్ పరీక్షకు హెచ్.పి.వి పరీక్షను జోడిస్తే, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి స్క్రీనింగ్ చేయవచ్చు.

గర్భాశయ క్యాన్సర్ టీకాలకు సంబంధించి నివారణపై విభాగాన్ని చూడండి..

ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది ఊపిరితిత్తులలో ఉద్భవించే క్యాన్సర్. ఊపిరితిత్తుల క్యాన్సర్ అభివృద్ధి చెందడానికి ప్రధాన ప్రమాద కారకం ధూమపానం. ఊపిరితిత్తుల క్యాన్సర్ కోసం స్క్రీనింగ్ ఇతర క్యాన్సర్ల కోసం స్క్రీనింగ్ లాగా ప్రతి ఒక్కరికీ అందించబడదు.

ఇది క్రింద జాబితాలో ఇవ్వబడిన అధిక-ప్రమాద సమూహాలలో రోగులకు మాత్రమే అందించబడుతుంది.

ఊపిరితిత్తుల క్యాన్సర్ స్క్రీనింగ్ నుండి ఎవరు ప్రయోజనం పొందుతారు?

కింది లక్షణాలతో ఉన్న వ్యక్తులకు ఊపిరితిత్తుల క్యాన్సర్ స్క్రీనింగ్ అందించవచ్చు.

30 ప్యాక్ ల సంవత్సరం ధూమపాన చరిత్ర కలిగిన 55 నుండి 74 సంవత్సరాల వయస్సులో ఉన్నవారు. (సంవత్సరానికి ఒక ప్యాక్ అంటే ఒక సంవత్సరానికి రోజుకు 20 సిగరెట్లు తాగటంతో సమానం. 30 ప్యాక్ సంవత్సరాలు అంటే ముప్పై సంవత్సరాలు రోజుకు 20 సిగరెట్లు లేదా 15 సంవత్సరాలు రోజుకు 40 సిగరెట్లు తాగడం).

20-ప్యాక్ సంవత్సరాల చరిత్ర కలిగిన 50 ఏళ్లు పైబడిన వారు ఒక ప్రమాదకారకం. ప్రమాద కారకాలు రాడాన్ లేదా ఆస్బెస్టాస్‌కు బహిర్గతం కావటం, ఊపిరితిత్తుల క్యాన్సర్ లేదా ఇతర క్యాన్సర్ల కుటుంబ చరిత్ర, సిఓపిడి లేదా పల్మనరీ ఫైబ్రోసిస్ వంటి lఊపిరితిత్తుల వ్యాధుల చరిత్ర.

ఊపిరితిత్తుల క్యాన్సర్ స్క్రీనింగ్ ఎలా జరుగుతుంది?

ఛాతీ యొక్క తక్కువ మోతాదు సీటీ స్కాన్ వాడకంతో ఊపిరితిత్తుల క్యాన్సర్ స్క్రీనింగ్ జరుగుతుంది. ఇది సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది.

సీటీ స్కాన్ ఛాతీ యొక్క వివరణాత్మక చిత్రాలను పొందడానికి ఎక్స్-కిరణాలను ఉపయోగిస్తుంది మరియు ఊపిరితిత్తులలోని చిన్న అసాధారణతలను గుర్తించగలదు.

ఇతర క్యాన్సర్లకు స్క్రీనింగ్ పరీక్షలు ఉన్నాయా?

పైన పేర్కొన్నవి కాకుండా ఇతర క్యాన్సర్లకు రొటీన్ స్క్రీనింగ్ సిఫారసు చేయబడలేదు ఎందుకంటే వాటిని చేయడం వల్ల నిరూపితమైన ప్రయోజనం ఏమీ లేదు.